ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లోనే నత్తి సమస్య వస్తుందెందుకు? అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి?

Published : Oct 19, 2026, 11:36 AM IST

కొంతమంది పిల్లల్లో మాటలు సరిగా రావు. నత్తి వస్తుంది. ఇలా కొంతమంది పిల్లలకు ఎందుకు జరుగుతుంది? నత్తి రావడానికి కారణాలు ఏమిటి? నత్తి వచ్చే పిల్లలను తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి?

PREV
13
నత్తి సమస్య ఎందుకు వస్తుంది?

చిన్న పిల్లల్లో నత్తి సమస్య కనిపించినప్పుడు తల్లిదండ్రులు చాలా ఆందోళన పడతారు. అందరి పిలల్లాగే తమ పిల్లలు కూడా చక్కగా మాట్లాడాలని కోరుకుంటారు. సాధారణంగా రెండు నుంచి ఐదేళ్ల వయసులో ఈ ఇబ్బంది మొదలవుతుంది.ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. మాట్లాడే సమయంలో అవసరమైన నోటి కండరాల మధ్య సమన్వయం సరిగ్గా కుదరకపోవడం వల్లే కొన్ని అక్షరాలు, పదాలు పలకడం కష్టమవుతుంది.

కుటుంబంలో ఎవరికైనా ఉంటే జన్యుపరంగా కూడా పిల్లలకు ఇది వచ్చే వీలుంది. చాలామందిలో ఏడేళ్లు వచ్చేసరికి ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. నూటికి ఒక్కరిలో మాత్రమే పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది. నత్తి ఉన్న పిల్లలు అమాయకులని, చదువులో వెనుకబడతారని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వారి తెలివితేటలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎంతోమంది నత్తి ఉన్న పిల్లలు చురుగ్గా ఆలోచిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.

23
తల్లిదండ్రులు ఏం చేయాలి?

నత్తి ఉన్న పిల్లలు నలుగురిలో మాట్లాడేటప్పుడు తడబడటం, కంగారు పడటం చూస్తుంటాం. తోటి పిల్లలు హేళన చేస్తే వాళ్లు మానసికంగా కుంగిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. పిల్లలు మాట్లాడేటప్పుడు తొందరపెట్టకుండా పూర్తిగా చెప్పే వరకు ఓపికగా వినాలి. చాలా వేగంగా మాట్లాడే అలవాటు ఉన్న పిల్లల్లో ఈ తడబాటు పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా, నెమ్మదిగా మాట్లాడటం నేర్పించాలి.

ఇంట్లో తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపడం మంచిది. సరిగ్గా రాని అక్షరాలను రోజూ సరదాగా పలికించడం, కొత్త పదాలను పరిచయం చేయడం వల్ల మాటల్లో స్పష్టత పెరుగుతుంది. పాటలు పాడించడం, సంగీతం నేర్పించడం వల్ల కూడా నాలుక సులువుగా తిరిగి మాట స్పష్టంగా వచ్చేందుకు దారితీస్తుంది.

33
మందులు ఉన్నాయా?

నత్తి సమస్యకు ప్రత్యేకంగా మందులేవీ ఉండవు. ఐదేళ్ల లోపే గుర్తించి నిపుణులతో స్పీచ్ థెరపీ ఇప్పించడం సరైన పరిష్కారం. థెరపీ ద్వారా మాటల్లోని లోపాలను సవరించడమే కాకుండా, పిల్లల్లో లోపించిన ధైర్యాన్ని నింపవచ్చు. తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహం, సరైన సమయానికి తీసుకునే శిక్షణ వారిని ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి. పిల్లలు ఎలా మాట్లాడినా ప్రేమతో ఆదరించి, వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడమే వారికి అందించే గొప్ప మద్దతు.

Read more Photos on
click me!

Recommended Stories