India: మనదేశాన్ని ఇండియా అని కూడా పిలుస్తారు. కానీ ఆ పేరును మనదేశానికి పెట్టింది ఎవరు? ఆ పదానికి అర్థం ఏమిటి? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియా పేరు వెనుక చరిత్రను తెలుసుకోండి.
మన దేశం పేరు భారతదేశం. ఈ పేరు కన్నా 'ఇండియా' పేరే ఎక్కువగా ప్రపంచ దేశాల్లో మార్మోగిపోతుంది. ఇండియా అనే పేరు మన దేశానికి ఎలా వచ్చింది? దీనికి ముఖ్య కారణం సింధు నది. వేల సంవత్సరాల క్రితం మన దేశంలో ప్రవహించే సింధు నది తీరంలో గొప్ప నాగరికత వెలిసిల్లిన సంగతి తెలిసిందే. ఆ కాలంలో విదేశీ వ్యాపారులు, యాత్రికులు మన దేశానికి వచ్చేటప్పుడు ఈ నదినే ప్రధాన సరిహద్దుగా చూసేవారు.
ఆ సమయంలో ఇరాన్ ప్రాంతానికి చెందిన పర్షియన్లు మన దేశంతో వ్యాపారం చేసేవారు. పర్షియన్ భాషలో 'స' అనే అక్షరం పలకడం కష్టంగా ఉండేది, అందుకే వారు 'స' బదులు 'హ' అని ఉచ్ఛరించే అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వారు 'సింధు' నదిని 'హిందూ' అని పిలిచారు. ఆ నది దాటి ఉన్న విశాలమైన భూభాగాన్ని, అక్కడ నివసించే ప్రజలను కూడా హిందూ నది పరివాహక ప్రాంతవాసులుగా గుర్తించారు.
23
ఆ దేశస్థులు పెట్టిన పేరు
పర్షియన్ల ద్వారా మన దేశం గురించి ప్రాచీన గ్రీకులకు తెలిసింది. గ్రీకు భాషలో 'హ' ధ్వని పలకడం కుదరక, వారు పర్షియన్లు వాడిన 'హిందూ' పదాన్ని కాస్త మార్చి 'ఇండోస్' అని పలకడం ప్రారంభించారు. అలాగే సింధు నదికి 'ఇండస్' అని నామకరణం చేశారు. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో జీవించిన ప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ తన రాతల్లో ఈ ప్రాంతాన్ని సూచించడానికి మొదటిసారిగా 'ఇండోస్' అనే పదాన్ని ప్రస్తావించారు.
ఆ తర్వాత మౌర్యుల కాలంలో మన దేశాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్ తాను రాసిన ప్రసిద్ధ గ్రంథానికి 'ఇండికా' అని పేరు పెట్టారు. ఇలా గ్రీకులు మాట్లాడిన 'ఇండోస్' క్రమంగా లాటిన్ భాషలోకి చేరి కాలక్రమేణా 'ఇండియా'గా రూపాంతరం చెందింది.
33
రాజ్యాంగంలో ఏముంది?
శతాబ్దాల తర్వాత వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు ఈ పేరును మరింత పాపులర్ చేసారు. ఈస్టిండియా కంపెనీ పాలన మొదలైన తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో, ప్రపంచ పటాల్లో మన దేశాన్ని అధికారికంగా 'ఇండియా' అని నమోదు చేయడం మొదలుపెట్టారు. అలా ప్రపంచమంతటా ఈ పేరే స్థిరపడిపోయింది. అయితే మన ప్రాచీన సంస్కృతిలో ఈ గడ్డను 'భరతవర్షం' లేదా 'భారతదేశం' అని భరత చక్రవర్తి పేరు మీదుగా పిలుచుకునేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండు పేర్లను గౌరవించారు. అందుకే మన రాజ్యాంగంలోని మొదటి అధికరణంలో "ఇండియా, అనగా భారత్" అని స్పష్టంగా పొందుపరిచారు.