Old Capital of India: ఢిల్లీ కంటే ముందు మన దేశ రాజధాని ఏది? పాత రాజధానిని ఎందుకు మార్చారు?

Published : Nov 05, 2026, 05:29 PM IST

Old Capital of India: ప్రస్తుతం మన దేశ రాజధాని ఢిల్లీ అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఢిల్లీ కంటే ముందు మన దేశ రాజధాని ఏది? అసలు పాత రాజధానిని ఎందుకు మార్చారు? ఢిల్లీ ఎప్పటి నుంచి మన దేశ రాజధానిగా కొనసాగుతోంది? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

PREV
15
ఢిల్లీ కంటే ముందు మన దేశ రాజధాని ఏది?

మన దేశంలోని ప్రధాన రాజకీయ నిర్ణయాలు, పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం ఇలా ఎన్నో కీలక ప్రభుత్వ వ్యవస్థలు ఢిల్లీలోనే ఉన్నాయి. కానీ ఒకప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీ కాదనే విషయం చాలామందికి తెలియదు. బ్రిటిష్ పాలన టైంలో మన దేశ రాజధానిగా మరో నగరం ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం రాజధాని నగరాన్ని మార్చేసింది. ఇంతకీ ఢిల్లీకి ముందు దేశ రాజధాని ఏది? అసలు బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? కొత్త రాజధాని నిర్మాణానికి ఎంతకాలం పట్టిందో ఇక్కడ తెలుసుకుందాం.

25
కలకత్తా నగరం

ఢిల్లీకి ముందు మన దేశ రాజధానిగా ఉన్న నగరం కలకత్తా(కోల్‌కతా). బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన అధికారాన్ని విస్తరించుకున్న సమయంలో కలకత్తా ముఖ్యమైన పరిపాలనా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ నగరం సముద్ర వాణిజ్యానికి అనుకూలంగా ఉండటంతో బ్రిటిష్ వారికి కలిసొచ్చింది. 1770ల కాలం నుంచి కలకత్తా బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ప్రధాన కేంద్రంగా మారింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని అధికారికంగా పరిపాలించే కేంద్రంగా కూడా ఈ నగరం కొనసాగింది.

35
కలకత్తానే ఎందుకు రాజధాని?

కలకత్తాను రాజధానిగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక, వాణిజ్య ప్రాధాన్యం. అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ ప్రాంతంలో బలమైన పట్టు ఉండేది. ముఖ్యంగా కలకత్తా ఓడరేవు ద్వారా వివిధ దేశాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం సులభంగా ఉండేది. ఇక్కడి నుంచి సరుకులను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి కూడా మంచి సౌకర్యాలు ఉండేవి. అంతేకాకుండా బ్రిటిష్ అధికారులకు అవసరమైన పరిపాలనా వ్యవస్థలు, ఆఫీసులు, సైనిక స్థావరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనుకూలంగా ఉండేది. దీంతో కలకత్తా బ్రిటిష్ పాలనలో అత్యంత కీలక నగరంగా మారింది.

45
కలకత్తా నుంచి ఢిల్లీకి ఎందుకు మార్చారు?

కలకత్తా రాజధానిగా ఉన్నప్పటికీ కాలక్రమేణా బ్రిటిష్ ప్రభుత్వానికి కొన్ని పరిపాలనా సమస్యలు ఎదురయ్యాయి. బెంగాల్ ప్రాంతంలో జాతీయవాద ఉద్యమాలు, బ్రిటిష్ వ్యతిరేక నిరసనలు పెరిగాయి. ముఖ్యంగా 1905లో బెంగాల్ విభజన నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో కలకత్తాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు బలంగా కొనసాగాయి. దీంతో దేశ పరిపాలనను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు కొత్త రాజధాని అవసరమని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. చారిత్రక ప్రాధాన్యం, భౌగోళిక స్థానం, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీని ఎంపిక చేసింది.

55
1911లో రాజధాని మార్పు

1911 డిసెంబర్ 12న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్రిటిష్ రాజు ఐదవ జార్జ్ ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్మాణ పనులకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. చివరకు 1931 ఫిబ్రవరి 13న న్యూ ఢిల్లీని అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇదే మన దేశ రాజధానిగా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories