Train Coaches: ఎన్నో రైళ్లు పాతబడుతూ ఉంటాయి. పాతగా మారిన రైలు బోగీలను రైల్వే శాఖ ఏం చేస్తుంది? వాటిని అమ్ముతారా? వాటిని తిరిగి ఎలా ఉపయోగిస్తారు? మనం వాటిని కొని ఎలా ఉపయోగించుకోవచ్చా?
రైలు ప్రయాణంలో రోజూ ఎన్నో బోగీలను చూస్తుంటాం. అయితే వాటిలో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణికులకు సేవలు అందించిన తర్వాత పాతబడిపోతాయి. అలాంటి బోగీలను రైల్వే శాఖ ఏం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? వాటన్నింటినీ తుక్కుగా మార్చి అమ్మేయరు. బోగీ పరిస్థితిని బట్టి మరో పనికి ఉపయోగిస్తారు. కొన్ని పాత బోగీలను రెస్టారెంట్లు, కేఫ్‌లుగా మారుస్తారు. ఇందుకోసం ప్రైవేటు వ్యాపారులకు రైల్వే శాఖ నిర్ణీత స్థలంలో బోగీలను లీజుకు ఇస్తుంది. దీనివల్ల రైల్వేకు అదనపు ఆదాయం వస్తుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
23
విడి భాగాలను తీసి
కొన్ని పాత బోగీలు మంచి స్థితిలో ఉంటే వాటికి మరమ్మతులు చేసి రైల్వే సిబ్బంది తాత్కాలిక నివాసాలుగా ఉపయోగిస్తారు. తనిఖీల కోసం, ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు చేపట్టే రైళ్లలోనూ వాడతారు. ఇంకొన్ని పాత ప్రయాణికుల బోగీలను మార్పులు చేసి సరుకు రవాణా బోగీలుగా తయారు చేస్తారు. వీటితో కార్లు, ట్రాక్టర్లు లాంటి వాహనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తారు. మరమ్మతులకు పనికిరాని బోగీలను పనికిరానివిగా ప్రకటిస్తారు. వాటిలో ఉపయోగపడే విడిభాగాలను వేరు చేసి మిగిలిన ఇనుమును తుక్కుగా అమ్మేస్తారు.
33
మనం కొనుక్కోవచ్చా?
భారతీయ రైల్వే తన దగ్గర ఉన్న పాత బోగీలు, ఇతర సామగ్రిని IREPS (Indian Railway E-Procurement System) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ వేలంలో విక్రయిస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు, వ్యాపారులు ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. అయితే వేలంలో పాల్గొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బోగీని అమ్మేలోపే దాని చక్రాలు, ఇరుసులు, ఇతర విలువైన భాగాలను తొలగించి ఉండవచ్చు. అందుకే వేలం వివరాలను పూర్తిగా చదవాలి. బోగీని కొనుగోలు చేసిన తర్వాత అక్కడి నుంచి తరలించే బాధ్యత కొనుగోలుదారుడిదే. దీనికి అవసరమైన రవాణా ఏర్పాట్లు, స్థానిక అనుమతులు కూడా ఆయనే చూసుకోవాలి.