Tariffs : అసలు టారీఫ్ అంటే ఏమిటి? అమెరికా భారత్ పై టారీఫ్స్ విధించినా కట్టేది అమెరికన్లే, అదెలాగో తెలుసా?

Published : Nov 27, 2026, 04:21 PM IST

అమెరికా భారత వస్తువులపై 25 శాతం టారిఫ్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో చాలామందికి ఓ డౌట్ వస్తుంది... అమెరికా విధించే ఈ పన్ను భారత ప్రభుత్వం కడుతుందా? వ్యాపారులు కడతారా? లేక కొనుగోలు చేసే అమెరికన్లు కడతారా? అని. మరి ఈ టారీప్స్ ఎవరు కడతారో తెలుసుకుందాం.

PREV
15
టారీఫ్స్ ఎవరు కడతారు?

భారతదేశంపై అమెరికా టారిఫ్స్ విధిస్తే మన దేశానికి నష్టం జరుగుతుందని వార్తలు వింటుంటాం. కానీ ఈ పన్ను నేరుగా భారత ప్రభుత్వమో, భారతీయ వ్యాపారులో చెల్లించేది కాదు... అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై విధించే టారిఫ్‌ను అక్కడి దిగుమతిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చివరకు ఈ పన్ను భారం ఎవరిపై పడుతుంది? అమెరికా ప్రజలు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందా? భారతీయ కంపెనీలు తమ లాభాలను తగ్గించుకోవాల్సి వస్తుందా? ఓ చిన్న ఉదాహరణతో ఈ టారిఫ్స్ లెక్కను అర్థం చేసుకుందాం.

25
అసలు టారిఫ్ అంటే ఏమిటి?

ఒక దేశం మరో దేశం నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు వాటిపై విధించే పన్నునే టారిఫ్ (Tariff) అంటారు. విదేశాల నుంచి వచ్చే వస్తువులు తమ దేశ మార్కెట్లో అమ్ముడవుతున్నప్పుడు వాటిపై అదనపు పన్ను విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించేందుకు, దేశీయ కంపెనీలకు పోటీ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు టారిఫ్స్ విధిస్తుంటాయి.

ఉదాహరణకు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తే.. అమెరికాలో ఆ వస్తువులను దిగుమతి చేసుకునే సంస్థ కస్టమ్స్ వద్ద ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది భారత ప్రభుత్వం అమెరికాకు చెల్లించే పన్ను కాదు. అమెరికాలోకి వస్తువులను తీసుకువచ్చే దిగుమతిదారుపై విధించే ట్యాక్స్ అన్నమాట.

35
25 శాతం టారీఫ్ అంటే ఎంత?

ఉదాహరణకు హైదరాబాద్‌లో అద్వైత అనే యువతి గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తోందని అనుకుందాం. ఆమె తన ఫ్యాక్టరీలో తయారు చేసిన షర్ట్స్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తోందనుకుందాం. అక్కడి ఓ షాపు యజమాని ఒక్కో షర్ట్‌ను రూ.1000 చొప్పున కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ షర్ట్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

షర్ట్ అసలు దిగుమతి ధర - రూ.1,000

25% టారిఫ్ - రూ. 250

టారిఫ్ తో కలిపి ఆ షర్ట్ ధర - రూ.1250

అంటే రూ.1000 విలువైన షర్ట్‌ను అమెరికాలోకి దిగుమతి చేసుకునేందుకు షాపు యజమాని అదనంగా రూ.250 టారిఫ్ చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్ను అమెరికా కస్టమ్స్‌కు వెళ్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ అదనపు భారాన్ని షాపు యజమానే భరిస్తాడా? లేక మరొకరిపైకి బదిలీ చేస్తాడా?

45
ఈ 25 శాతం టారీఫ్ భారం ఎవరిపై పడుతుంది?

అమెరికాలో షాపు నిర్వహించే యజమాని ఈ అదనపు పన్ను భారాన్ని భరించకుండా ఉండేందుకు మూడు మార్గాలను ఎంచుకోవచ్చు.

1. తన లాభాలను తగ్గించుకోవడం

షర్ట్‌ను రూ.1000కు కొనుగోలు చేసి, దానిపై రూ.250 టారిఫ్ చెల్లిస్తే దిగుమతిదారుడి ఖర్చు రూ.1250 అవుతుంది. షాపు యజమాని అదే పాత ధరకు అమ్మితే తన లాభం తగ్గిపోతుంది. టారిఫ్ భారాన్ని తనే భరించి కస్టమర్లకు ధర పెంచకుండా అమ్మవచ్చు. కానీ ఎక్కువ కాలం ఇలా చేయడం వ్యాపారానికి నష్టం కలిగించవచ్చు.

2. భారతీయ కంపెనీపై ధర తగ్గించాలని ఒత్తిడి చేయడం

అమెరికా షాపు యజమాని భారతీయ ఎగుమతిదారుతో మాట్లాడి షర్ట్ ధర తగ్గించాలని కోరవచ్చు. గతంలో రూ.1000కు కొనుగోలు చేసిన షర్ట్‌ను ఇప్పుడు రూ.750కి ఇవ్వాలని అడగవచ్చు. దీంతో రూ.750పై 25 శాతం టారిఫ్ రూ.187.50 అవుతుంది. అమెరికా దిగుమతిదారుకు షర్ట్ మొత్తం ఖర్చు రూ.937.50 అవుతుంది. ఇలా టారిఫ్ భారంలో కొంత భాగాన్ని భారతీయ తయారీదారుపైకి బదిలీ చేసినట్లవుతుంది. కానీ దీనివల్ల భారతీయ కంపెనీకి లాభాలు తగ్గడంతో పాటు ఉత్పత్తి ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, వ్యాపార నిర్వహణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

3. కస్టమర్లపై ధరల భారం వేయడం

ఇక మూడో మార్గం.. టారిఫ్ భారాన్ని కస్టమర్లపై వేయడం. రూ.1000కు దిగుమతి చేసుకున్న షర్ట్‌పై రూ.250 టారిఫ్ పడితే.. షాపు యజమాని తన ఖర్చులకు తగ్గట్టుగా అమ్మకపు ధరను పెంచవచ్చు. దీంతో అమెరికాలో ఆ షర్ట్ కొనుగోలు చేసే కస్టమర్ గతంలో కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

అంటే విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్స్ పెరిగితే వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. చివరకు ఆ ప్రభావం సామాన్య వినియోగదారుల జేబుపై పడొచ్చు. అయితే ప్రతి వస్తువు ధర 25 శాతం పెరుగుతుందని చెప్పలేం. దిగుమతిదారులు, ఎగుమతిదారులు, వ్యాపారులు ఈ భారాన్ని ఎలా పంచుకుంటారనే దానిపై ధరలు ఆధారపడి ఉంటాయి.

55
టారిఫ్స్ ఎందుకు విధిస్తారు?

టారిఫ్స్ విధించడం వెనుక దేశాలకు అనేక ఆర్థిక, వాణిజ్యపరమైన కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి..

1. దేశీయ కంపెనీలకు రక్షణ : విదేశాల నుంచి తక్కువ ధరలకు వచ్చే వస్తువులతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేకపోవచ్చు. దిగుమతులపై పన్నులు విధించడం ద్వారా దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి.

2. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం : దిగుమతి సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఇలా ట్యాక్స్ రెవెన్యూ పెంచుకునేందుకు టారీప్స్ ఉపయోగపడతాయి.

3. విదేశాలతో వాణిజ్య చర్చల్లో ఒత్తిడి : ఇతర దేశాలు తమ మార్కెట్లను తెరవాలని, కొన్ని విధానాల్లో మార్పులు చేయాలని కోరుతూ టారిఫ్స్‌ను ఒక సాధనంగా ఉపయోగించవచ్చు. అమెరికా వంటి బలమైన దేశాలు ఇందుకోసమే టారీఫ్ అస్త్రాన్ని వాడుతున్నాయి.

4. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం : విదేశీ వస్తువుల ధరలు పెరిగితే స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతారని ప్రభుత్వాలు భావిస్తాయి. అందుకే విదేశీ వస్తువులపై టారీఫ్స్ విధించి ధరలు పెరిగేలా చేస్తాయి.

అయితే టారిఫ్స్ ఎక్కువగా విధిస్తే విదేశీ వస్తువుల ధరలు పెరగడం, వ్యాపార సంబంధాలు దెబ్బతినడం, ఇతర దేశాలు కూడా ప్రతిగా పన్నులు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories