రైల్లో చైన్ ఎప్పుడు పడితే అప్పుడు లాగకూడదు. ఎవరికైనా తీవ్రమైన ప్రాణాపాయ ఆరోగ్య సమస్య తలెత్తినా, ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా జరిగినా, మంటల చెలరేగినా.. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు చైన్ లాగొచ్చు.
స్టేషన్ మిస్ అయ్యిందని చైన్ లాగొచ్చా..?
చాలా మందికి ఉండే పెద్ద అనుమానం ఇది. ఒకవేళ దిగాల్సిన స్టేషన్ దాటిపోతే చైన్ లాగి దిగొచ్చా అనుకుంటారు. కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు. మీరు బోర్డు అయిన ట్రైన్ మారినా, స్టేషన్ దాటిపోయినా, లేదా సామాను మరచిపోయినా చైన్ లాగడం నిషిద్ధం. మీ చిన్న వ్యక్తిగత పొరపాటు లేదా తొందరపాటు నిర్ణయం వల్ల ఆ ఒక్క రైలు షెడ్యూల్ మాత్రమే కాకుండా, దాని వెనుక వచ్చే ఎన్నో రైళ్లు ఆలస్యం అవుతాయి. దీనివల్ల వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే, సొంత లాభం కోసం ఎప్పుడూ చైన్ లాగకూడదు.
చైన్ లాగితే ఏం జరుగుతుంది..?
సరైన కారణం లేకుండా, సరదా కోసం, మీ సొంత లాభం కోసం చైన్ లాగితే.. రైల్వే అధికారులు మిమ్మల్ని శిక్షించే అవకాశం ఉంటుంది. రైల్వే చట్టం-1989, సెక్షన్ 141 ప్రకారం.. తగిన కారణం లేకుండా రైలు కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, ₹1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.