Nepal: నేపాల్ వెళ్లాలనుకుంటున్నారా? అందమైన ఆ దేశాన్ని చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. అయితే అక్కడికి వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో అని భయపడతారు. చాలా తక్కువలో టూర్ కి వెళ్లి రావచ్చు.
నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా ఇటీవల భారత పర్యటనకు రావడంతో, ఇప్పుడు భారతీయుల్లో నేపాల్ పర్యటనపై ఆసక్తి బాగా పెరిగింది. వీసా అవసరం లేకుండానే తక్కువ బడ్జెట్‌లో విదేశీ పర్యటన చేయాలనుకునే వారికి నేపాల్ ఎంతో అనుకూలమైన దేశం. మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులు ఏడు రోజుల పాటు నేపాల్‌లోని అందాలను చుట్టి రావడానికి సగటున 15 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. విలాసవంతమైన సౌకర్యాలు కాకుండా సాధారణ ప్రయాణం చేస్తే 15 వేల నుంచి 25 వేల రూపాయల్లోనే ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. అదే కాస్త సౌకర్యవంతమైన ప్రయాణం, 3-స్టార్ హోటళ్లలో బస కోరుకుంటే మాత్రం 32 వేల నుంచి 55 వేల రూపాయల వరకు బడ్జెట్ వేసుకోవాల్సి ఉంటుంది.
23
నేపాల్ లో ఖర్చులు ఇలా
నేపాల్‌లో బస, ఆహార ఖర్చులు కూడా భారతీయ పర్యాటకులకు అందుబాటులోనే ఉంటాయి. సాధారణ బడ్జెట్ హోటళ్లు లేదా గెస్ట్ హౌస్‌లలో ఒక రాత్రి బస చేయడానికి 800 నుంచి 1,500 రూపాయల వరకు తీసుకుంటారు. మధ్యస్థాయి హోటళ్లలో అయితే 2 వేల నుంచి 5 వేల రూపాయల వరకు ఛార్జీలు ఉంటాయి. అయితే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‌లో ఈ ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇక భోజనం విషయానికి వస్తే, స్థానిక హోటళ్లలో దొరికే దాల్-భాత్, మోమోస్, చౌమీన్ లాంటి వంటకాలకు కేవలం 300 నుంచి 500 రూపాయల లోపే ఖర్చు అవుతుంది. ఖాట్మండు, పోఖారా లాంటి ప్రధాన నగరాల్లో తక్కువ ధరకే మంచి ఆహారం దొరుకుతుంది. కానీ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు మాత్రం ఆహార ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
33
వీసా అసవరం లేదు
నేపాల్ పర్యటనకు వెళ్లే భారతీయులకు ప్రత్యేకంగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. స్థానిక ప్రయాణాల కోసం బస్సులు, ట్యాక్సీలను వాడుకుంటే ఖర్చు తగ్గుతుంది. అయితే ప్రైవేట్ క్యాబ్‌లు లేదా టూరిస్ట్ బస్సులను ఎంచుకుంటే బడ్జెట్ కాస్త పెరుగుతుంది. ఇటీవల నేపాల్ ప్రధాని బాలెన్ షా భారత పర్యటన సందర్భంగా అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు 'సరయూ-కమల ఎక్స్‌ప్రెస్' అనే కొత్త వీక్లీ రైలును కూడా ప్రారంభించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో భారత్ నుంచి నేపాల్ వెళ్లే పర్యాటకులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.