
మీ టీవీ సౌండ్ క్వాలిటీని మరింత మెరుగుపరచుకోవాలంటే ప్రస్తుతం మన ముందున్న రెండు పాపులర్ ఆప్షన్లు ఒకటి సౌండ్‌బార్, రెండోది హోమ్ థియేటర్ సిస్టమ్. సాధారణ టీవీ స్పీకర్లతో పోలిస్తే ఈ రెండూ చాలా బెటర్ ఆడియోను అందిస్తాయి. అయితే డిజైన్, సౌండ్ అవుట్‌పుట్, ఫీచర్లు, ఇన్‌స్టాలేషన్, ధరల విషయంలో వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ తేడాలను సరిగ్గా అర్థం చేసుకుంటే మీ ఇంటికి ఏ ఆడియో సిస్టమ్ కరెక్ట్‌గా సెట్ అవుతుందో ఈజీగా ఎంచుకోవచ్చు.
సౌండ్‌బార్ అనేది పొడవుగా, సన్నగా ఉండే ఒక సింగిల్ స్పీకర్ యూనిట్. దీనిని టీవీ కింద లేదా టీవీకి ముందు భాగంలో అమర్చుకోవచ్చు. ఒకే బాక్స్‌లో అనేక చిన్న స్పీకర్లు ఉండటం వల్ల డైలాగ్ క్లారిటీ, మ్యూజిక్ ప్లేబ్యాక్, సినిమా సౌండ్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఆధునిక సౌండ్‌బార్లలో డీప్ బేస్ కోసం ప్రత్యేకంగా వైర్‌లెస్ సబ్‌వూఫర్ కూడా వస్తోంది.
అడ్వాన్స్‌డ్ మోడల్స్‌లో డాల్బీ అట్మాస్, డీటీఎస్ఎక్స్ టెక్నాలజీలు కూడా ఉంటాయి. తక్కువ వైర్లతో ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎచ్ డీ ఎంఐ ఏఆర్సీ, ఈఏఆర్సీ, బ్లూటూత్, ఆప్టికల్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. అపార్ట్‌మెంట్లు, చిన్న లివింగ్ రూమ్‌లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
హోమ్ థియేటర్ సిస్టమ్‌లో గది నలుమూలలా వేర్వేరు స్పీకర్లను అమర్చాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక 5.1 ఛానల్ సిస్టమ్‌లో ఐదు స్పీకర్లు, ఒక సబ్‌వూఫర్ ఉంటాయి. వినేవారి ముందు, వెనుక, పక్కల ఈ స్పీకర్లను సెట్ చేయడం వల్ల అద్భుతమైన సరౌండ్ సౌండ్ వస్తుంది.
7.1 ఛానల్, డాల్బీ అట్మాస్ వంటి అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌లో అదనపు ఆడియో ఛానెల్స్‌తో పాటు పైనుంచి సౌండ్ వచ్చే ఓవర్‌హెడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ప్రత్యేక సబ్‌వూఫర్ ద్వారా పవర్‌ఫుల్ బేస్ లభిస్తుంది. పెద్ద గదులు లేదా ప్రత్యేక హోమ్ సినిమా రూమ్‌లకు ఇది బాగా సూట్ అవుతుంది.
డిజైన్ పరంగా సౌండ్‌బార్ ఒకే సింగిల్ యూనిట్‌గా, కాంపాక్ట్‌గా ఉంటుంది. కానీ హోమ్ థియేటర్‌లో అనేక స్పీకర్లు విడివిడిగా ఉంటాయి. ఇన్‌స్టాలేషన్ విషయానికి వస్తే సౌండ్‌బార్‌ను ఒక్క కేబుల్‌తో నిమిషాల్లో సెట్ చేయవచ్చు, కానీ హోమ్ థియేటర్‌కు ఎక్కువ వైరింగ్, స్పీకర్ ప్లేస్‌మెంట్ అవసరం కాబట్టి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. సౌండ్‌బార్‌లో మోడల్‌ను బట్టి వర్చువల్ లేదా ఫిజికల్ సరౌండ్ సౌండ్ ఉంటే, హోమ్ థియేటర్‌లో డెడికేటెడ్ సరౌండ్ ఛానెల్స్ ఉంటాయి.
బేస్ కోసం సౌండ్‌బార్‌లో బిల్ట్ ఇన్ లేదా సపరేట్ సబ్‌వూఫర్ ఉంటే, హోమ్ థియేటర్‌లో పవర్‌ఫుల్ డెడికేటెడ్ సబ్‌వూఫర్ ఉంటుంది. సౌండ్‌బార్‌కు తక్కువ స్థలం, తక్కువ వైరింగ్ సరిపోతాయి. హోమ్ థియేటర్‌కు ఎక్కువ స్థలం, ఎక్కువ కనెక్షన్లు కావాలి. ధరల విషయంలో సౌండ్‌బార్ బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు దొరికితే, హోమ్ థియేటర్ బడ్జెట్ నుంచి హై ఎండ్ రేంజ్ వరకు అందుబాటులో ఉంది.
ఒక మంచి క్వాలిటీ హోమ్ థియేటర్ సిస్టమ్ గది చుట్టూ ఫిజికల్ స్పీకర్లను కలిగి ఉండటం వల్ల చాలా ఖచ్చితమైన, ఇమ్మెర్సివ్ సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. మరోవైపు ప్రీమియం డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్ కూడా ఎక్కువ స్పీకర్లు లేకుండానే మంచి సినిమాటిక్ ఆడియోను ఇస్తుంది.
అయితే దాని సరౌండ్ ఎఫెక్ట్ అనేది ఆ మోడల్, గది లేఅవుట్, అకౌస్టిక్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సినిమాలు, యాక్షన్ సీన్లు, స్పోర్ట్స్ చూడటానికి సరిగ్గా సెట్ చేసిన హోమ్ థియేటర్ మరింత రియలిస్టిక్ అనుభూతిని ఇస్తుంది.
మీ ఇంట్లో స్థలం తక్కువగా ఉండి, సింపుల్ ఇన్‌స్టాలేషన్‌తో మెరుగైన టీవీ ఆడియో కావాలనుకుంటే సౌండ్‌బార్ ఎంచుకోవడం బెటర్. ఉదాహరణకు జేబీఎల్ సినిమా ఎస్బీ580 లేదా సోనీ హెచ్టీ ఎస్400 వంటివి రోజువారీ షోలు, స్పోర్ట్స్ చూడటానికి బాగుంటాయి.
అదే మీకు పెద్ద గది ఉండి, సినిమాలు, గేమింగ్ కోసం పవర్‌ఫుల్ సరౌండ్ సౌండ్ కావాలనుకుంటే సోనీ బ్రావియా హెచ్టీ ఎస్60 లేదా ఇతర కంపెనీలకు చెందిన డాల్బీ సపోర్ట్ హోమ్ థియేటర్ సిస్టమ్ తీసుకోవచ్చు. త్రీ-డైమెన్షనల్ ఆడియో అనుభవం కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న మోడల్ ఎంచుకోవాలి. ఏది కొనేముందైనా కేవలం వాటేజ్ లేదా ధరను మాత్రమే కాకుండా స్పీకర్ కాన్ఫిగరేషన్, మొత్తం అవుట్‌పుట్ పవర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, కనెక్టివిటీ, మీ గది సైజును పోల్చి చూసుకోవడం ముఖ్యం.