Volcano Village: ఒకవైపు ఆకాశాన్ని తాకే పర్వతాలు.. మరోవైపు అంతులేని సముద్రం.. మధ్యలో ఓ అగ్నిపర్వత బిలం.. దాని లోపలే కొందరు ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీరు నమ్మగలరా? మరి ఈ వింత గ్రామం ఎక్కడుంది? అక్కడి ప్రజల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ప్రపంచంలో మనుషులు నివసించడానికి అనువైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. కొందరు సముద్ర తీరాల్లో ఇళ్లు కట్టుకుంటే, మరికొందరు కొండలు, అడవుల మధ్య నివసిస్తుంటారు. అయితే ఒక అగ్నిపర్వతం బిలం మధ్యలోనే ఓ గ్రామం ఉందంటే నమ్మగలరా? చుట్టూ ఎత్తైన పర్వతాలు, మధ్యలో మరో చిన్న అగ్నిపర్వతం, వాటి మధ్య పచ్చని ప్రకృతి.. అక్కడ ప్రజల జీవనం సాగుతోంది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. జపాన్లోని అవోగషిమా అనే చిన్న ద్వీప గ్రామం ఇది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న ఈ గ్రామం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
25
టోక్యో పరిధిలోని అవోగషిమా గ్రామం
జపాన్ రాజధాని టోక్యోకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రంలో అవోగషిమా అనే చిన్న ద్వీపం ఉంది. ఇది జపాన్లోని ఇజు ద్వీప సమూహంలో భాగం. టోక్యో నగరానికి సుమారు 358 నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం పరిపాలనాపరంగా టోక్యో మెట్రోపాలిటన్ పరిధిలోకి వస్తుంది. సుమారు 5.96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపంలో 170 మంది వరకు నివసిస్తున్నారు. జపాన్లో అతి తక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో ఇది కూడా ఒకటి.
35
ఒక అగ్నిపర్వతం లోపల మరో అగ్నిపర్వతం
అవోగషిమా ద్వీపాన్ని పై నుంచి చూస్తే ఒక పెద్ద గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. దీని చుట్టూ అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడిన ఎత్తైన పర్వతాలు ఉంటాయి. ఈ పర్వత అంచుల మధ్యలో మరో చిన్న అగ్నిపర్వత శిఖరం కనిపిస్తుంది. దీన్ని మౌంట్ మారుయామా అని పిలుస్తారు. ద్వీపం చుట్టూ కొన్ని ప్రాంతాల్లో సుమారు 250 మీటర్ల ఎత్తైన కొండచరియలు ఉండటం వల్ల ఇది మరింత అందంగా కనిపిస్తుంది.
ఈ గ్రామ చరిత్రలో భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు ఉన్నాయి. ముఖ్యంగా 1785లో జరిగిన విస్ఫోటనం కారణంగా అక్కడి ప్రజలు తమ ఇళ్లను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అవోగషిమా దాదాపు 50 సంవత్సరాల పాటు జనావాసాలు లేని ప్రాంతంగా మారింది. ఆ తర్వాత 1832లో ప్రజలు మళ్లీ ఈ ద్వీపానికి తిరిగి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు.
అగ్నిపర్వతం కారణంగా ద్వీపంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి వేడివేడి ఆవిరి బయటకు వస్తుంటుంది. ఈ సహజ ఆవిరిని ఉపయోగించి వంటలు చేసుకోవడానికి వీరు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.
55
ఇక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది?
చుట్టూ సముద్రం, మధ్యలో పర్వతాలు, ప్రకృతి ఒడిలో చిన్న ఇళ్లు.. ఇదే అవోగషిమా ప్రజల జీవన ప్రపంచం. ఇక్కడ నగరాల్లో కనిపించే రద్దీ, వాహనాల హడావిడి, పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఉండవు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తుంటారు. వ్యవసాయం, స్థానిక ఉత్పత్తులు, పర్యాటకం వంటి కార్యకలాపాలు ఇక్కడి ఆర్థిక జీవితంలో భాగంగా ఉన్నాయి.
అవోగషిమాకు వెళ్లాలంటే ముందుగా టోక్యో నుంచి హచిజోజిమా ద్వీపానికి చేరుకోవాలి. అక్కడి నుంచి హెలికాప్టర్లో సుమారు 20 నిమిషాలు ప్రయాణిస్తే అవోగషిమాకు చేరుకోవచ్చు. లేదా నౌక ద్వారా సుమారు 2.5 నుంచి 3 గంటల సమయంలో చేరుకోవచ్చు. అయితే ఈ గ్రామం అందంగా కనిపించినప్పటికీ అగ్నిపర్వత ప్రాంతం కాబట్టి జాగ్రత్తలు కూడా అవసరం. పర్యాటకులు అక్కడికి వెళ్లే ముందు అధికారిక హెచ్చరికలు, భద్రతా సూచనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.