8th Pay Commission : ఉద్యోగులకు రూ.18,000 జీతం కాస్త రూ.65,000 అవుతుందా?

Published : Nov 24, 2026, 01:00 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతం (బేసిక్ శాలరీ) రూ.18,000 నుంచి ఏకంగా రూ.65,000కు పెంచాలనే కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరి 8వ వేతన సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

PREV
15
8వ వేతన సంఘం ముందు ఉద్యోగుల డిమాండ్స్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్‌లో భారీ మార్పులు తీసుకురాగల రెండు కొత్త ప్రతిపాదనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కనీస జీతాన్ని అంటే బేసిక్ శాలరీని రూ.65,000 చేయాలనేది ఒక డిమాండ్ అయితే, పైస్థాయి అధికారులకు భారీగా జీతాలు పెంచాలనేది మరో డిమాండ్.

8వ వేతన సంఘం (8th Pay Commission)పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో భారీ అంచనాలున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరి జీతాల్లో భారీ మార్పులు వస్తాయి.

ఇప్పటికే మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ (MSA), ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) అనే రెండు ప్రధాన ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) ప్రతిపాదనలను వేతన సంఘం ముందుంచాయి. ఈ రెండు సంఘాలు వేర్వేరు పద్ధతుల్లో జీతాలు పెంచాలని అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతమున్న రూ.18,000 బేసిక్ జీతాన్ని రూ.65,000కు పెంచాలన్న ప్రతిపాదన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

25
రూ.18,000 జీతం రూ.65,000 అవుతుందా?

మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ (MSA) ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ జీతాన్ని రూ.65,000 గా, గరిష్ఠ బేసిక్ జీతాన్ని రూ.9 లక్షలుగా నిర్ణయించాలి. దీనికోసం అన్ని పే లెవెల్స్‌కి ఒకే రకమైన 3.61 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వాడాలని ఆ సంఘం కోరుతోంది.

ప్రస్తుత 7వ వేతన సంఘం ప్రకారం… లెవెల్ 1 ఉద్యోగుల కనీస బేసిక్ జీతం రూ.18,000గా ఉంది. MSA ప్రతిపాదనకు 8వ వేేతన సంఘం ఓకే చెబితే ఇది రూ.65,000 కు పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న లెవెల్ 18 అధికారుల బేసిక్ జీతం సుమారు రూ.9.02 లక్షలకు చేరొచ్చు.

ఈ ప్లాన్ లో హైలైట్ ఏంటంటే... కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఒకే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తిస్తుంది. దీనివల్ల కనీస, గరిష్ఠ జీతాల మధ్య ఉన్న 1:13.9 నిష్పత్తి మారకుండా ఉంటుంది.

35
ఏ లెవెల్‌ ఉద్యోగులకు ఆ లెవెల్‌లోనే పెంపు

మరోవైపు ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) పూర్తిగా భిన్నమైన ప్రతిపాదనను 8వ వేతన సంఘం ముందు ఉంచింది. అందరికీ ఒకే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కాకుండా ఆయా పే లెవెల్స్‌ని బట్టి వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్స్‌ను నిర్ణయించాలని ఈ సంఘం కోరుతోంది.

వీరి ప్లాన్ ప్రకారం…

• లెవెల్ 1 ఉద్యోగులకు 2.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.

• లెవెల్ 17, 18 ఉన్నతాధికారులకు 4.38 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.

• మధ్యలో ఉన్న లెవెల్స్‌కి క్రమంగా పెరుగుతూ వెళ్లే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.

దీనివల్ల పైస్థాయిలో ఉన్నవారికి ఎక్కువ జీతం పెరిగే అవకాశం ఉందన్నది వీరి వాదన.

ఎవరికి ఎంత జీతం రావచ్చు?

IRTSA వేసిన లెక్కల ప్రకారం.. 7వ వేతన సంఘంతో పోలిస్తే 8వ వేతన సంఘంలో వివిధ స్థాయిల్లో జీతాలు భారీగా పెరగొచ్చు.

IRTSA ప్రతిపాదన ప్రకారం అంచనా వేసిన బేసిక్ జీతాలు..

ఉద్యోగి పే లెవెల్ - ప్రతిపాదిత జీతం

లెవెల్ 1 - రూ.52,600

లెవెల్ 6 - రూ.1,23,900

లెవెల్ 12 - రూ.2,99,500

లెవెల్ 18 - రూ.10,95,000

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. MSA ప్రతిపాదనలో కింది స్థాయి ఉద్యోగులకు ఎక్కువ లాభం జరుగుతుంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగికి రూ.65,000 బేసిక్ జీతం రావొచ్చు. కానీ IRTSA ప్రతిపాదనలో లెవెల్ 18 అధికారుల బేసిక్ జీతం రూ.10.95 లక్షల వరకు పెరగొచ్చు. అలాగే MSA ప్లాన్‌లో లెవెల్ 6 ఉద్యోగికి రూ.1,27,800 దక్కొచ్చు. ఇది IRTSA అంచనా వేసిన రూ.1,23,900 కంటే ఎక్కువే.

45
ఈ రెండు ప్రతిపాదనలకు తేడా ఏంటి?

ఈ రెండు సంఘాల డిమాండ్ల మధ్య ప్రధానమైన తేడా ఒకటుంది. MSA అన్ని లెవెల్స్‌కు ఒకే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వాడి, కనీస జీతాన్ని పెంచడంపై ఫోకస్ చేసింది. కానీ IRTSA మాత్రం ఏ పదవికి తగ్గట్టు ఆ పదవికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మార్చాలని పట్టుబడుతోంది. దీనివల్ల పైస్థాయి అధికారులకు భారీ పెంపు అందుతుంది. దీనివల్ల MSA ప్లాన్‌లో కనీస, గరిష్ఠ జీతాల నిష్పత్తి 1:13.9 గానే ఉంటుంది. కానీ IRTSA ప్లాన్‌లో ఈ నిష్పత్తి 1:20.8 కి పెరుగుతుందని అంచనా.

8వ వేతన సంఘం ఫైనల్ డెసిషన్ ఎప్పుడు?

సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకోసారి పే కమిషన్‌ను వేసి జీతభత్యాలు, పెన్షన్లలో మార్పులు చేస్తుంటుంది. ఆ రకంగా చూస్తే 8వ వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది 2027 లో అమలు కావచ్చు… ఇది రాబోయే ఎన్నో ఏళ్లపాటు ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి.

జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ.. కింది స్థాయి ఉద్యోగుల అవసరాలను, పైస్థాయి అధికారుల బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.

55
రూ.65,000 జీతం పక్కానా?

ప్రస్తుతం బయటకు వచ్చిన MSA, IRTSA ప్రతిపాదనలు కేవలం డిమాండ్లు మాత్రమే. వీటిలో దేనినీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఫైనల్ చేయలేదు, ఆమోదించలేదు. అందుకే ప్రస్తుతం ఉన్న రూ.18,000 బేసిక్ జీతం రాత్రికి రాత్రే రూ.65,000 అయిపోతుందని చెప్పలేం. అలాగే పైస్థాయి అధికారులకు రూ.10.95 లక్షల జీతం వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలించాకే 8వ వేతన సంఘం తన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టే కొత్త జీతాల స్ట్రక్చర్ అమలులోకి వస్తుంది.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మదిలో ఇప్పుడు ఒకటే ప్రశ్న మెదులుతోంది.. కనీస జీతాన్ని రూ.65,000 చేసే MSA ప్లాన్‌కి ఓకే చెబుతారా? లేక అధికారులకు పెద్దపీట వేసే IRTSA ప్లాన్‌ను అమలు చేస్తారా? అని.

Read more Photos on
click me!

Recommended Stories