River: మనదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. వాటిలో అద్భుతమైన స్వచ్ఛమైన నది ఒకటుంది. అది చాలా స్పెషల్ నది. ఈ నది ఎక్కడుంది? ఆ నదిలో నీరు ఎందుకంత స్వచ్ఛంగా ఉంటుంది? అనేది తెలుసుకోండి.
భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. వాటిలో అత్యంత స్వచ్ఛమైన నదిగా గుర్తింపు పొందినది.. ఉమ్‌గోట్ నది. ఈ అద్భుతమైన నది మేఘాలయ రాష్ట్రంలోని డాకీ అనే చిన్న పట్టణంలో ప్రవహిస్తుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే ఈ నదిని స్థానికులు డాకీ నది అని కూడా పిలుస్తారు. షిల్లాంగ్ నగరం నుండి దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటారు. ఇక్కడి నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే, నది అడుగున ఉండే గులకరాళ్ళు, ఈదులాడే చేపలను కూడా పైనుంచే స్పష్టంగా చూడవచ్చు. సూర్యకాంతి పడినప్పుడు ఆ నది అద్దంలా మెరిసిపోతుంది. ఈ నది చూడటానికి ఎంతో మంది పర్యాటకులు వస్తారు.
23
పడవలు గాలిలో తేలుతున్నట్టు
ఈ నదిలోని నీటి స్వచ్ఛత వల్ల పడవలు నీటిలో కాకుండా గాలిలోనే తేలియాడుతున్నట్లు కనిపిస్తాయి. ఫోటోలు తీసినప్పుడు పడవ నీడ నేరుగా నది అడుగు భాగాన పడుతూ కనిపిస్తుంది. దాంతో పడవ ఆకాశంలో ఎగురుతోందా అన్న అద్భుత భావన కలుగుతుంది. ఇక్కడ దేశీయ పడవల ప్రయాణం చేయడం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ నుండి ఏప్రిల్ నెలల మధ్య కాలంలో నీరు ఇంకా పారదర్శకంగా మారుతుంది. ఈ సమయంలోనే ఈ నదిని చూసేందుకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు.
33
నది ఎందుకంత స్వచ్ఛంగా ఉంటుంది
ఉమ్ గోట్ నది ఇంత పరిశుభ్రంగా ఉండటానికి ప్రధాన కారణం స్థానిక ఖాసీ, జైంతియా గిరిజన ప్రజల కృషి. వీరు ప్రకృతిని దైవంగా భావిస్తూ ఎన్నో ఏళ్లుగా నదిని కాపాడుకుంటున్నారు. నీటిలోకి ప్లాస్టిక్ లేదా ఇతర చెత్తను వేయకుండా అడ్డుకుంటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నదిని నిరంతరం శుభ్రం చేస్తూ కాలుష్యం లేకుండా చూసుకుంటారు. ఇలాంటి పర్యావరణ స్పృహ వల్లనే ఉమ్‌గోట్ నది దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలలో డాకీ నది ఒకటి.