మనిషి శరీరం నుంచి చేతులు, కాళ్లు వేరు చేసినా బతకగలమేమో కానీ, తల వేరే చేస్తే బతకలేం. కానీ, ఓ జంతువు మాత్రం.. మీరు దాని తలను, మొండాన్ని వేరు చేసినా కూడా దర్జాగా బతికేయగలదు. ఎలానో తెలుసా?
ఈ భూమి మీద చాలా రకాల జంతువులు ఉన్నాయి. ప్రకృతి సృష్టంచిన జీవుల్లో అత్యంత శక్తివంతమైన, విచిత్రమైన జంతువులు చాలా ఉన్నాయి. వాటిలో ఒక జంతువు.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎంతలా అంటే... తన తలను శరీరం నుంచి వేరు చేసినా కూడా.. అది ప్రాణాలతో జీవించగలదు. ఆ జంతువు మరేదో కాదు.. బొద్దింక. అవును, మీరు చదివింది నిజమే, డైనోసార్లు అంతరించిపోయిన కాలం నుంచి భూమిపై ఉన్న ఈ బొద్దింక గురించి కొన్ని నమ్మసక్యం కాని విషయాలు ఇప్పుడు చూద్దాం...
24
తల లేకపోయినా బతకగలదా?
ఒక మనిషికి లేదా ఇతర జీవులకు తల తొలగిపోతే క్షణాల వ్యవధిలో మరణిస్తారు. కానీ, బొద్దింక తల లేకపోయినా సరే దాదాపు ఒక వారం లేదా రెండు వారాల పాటు హాయిగా బతికేయగలదు. దీనికి కారణం వాటి శ్వాస వ్యవస్థ. ఇవి ముక్కు ద్వారా కాకుండా తమ శరీరంపై ఉండే చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. అయితే.. తల లేకపోవడం వల్ల నోరు కూడా పోతుంది కాబట్టి.. నీరు, ఆహారం లభించక చివరికి ఆకలితో అలమటించి చనిపోతాయి. అలా ఆకలితో చనిపోవడానికి కూడా కనీసం వారం రోజులు తీసుకుంటుంది. అప్పటి వరకు అది బతకగలదు.
34
శరీరం ద్వారానే శ్వాస..
బొద్దింకలు తమ శరీర భాగాల ద్వారానే ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి కాబట్టి, శ్వాస తీసుకోవడానికి మెదడు లేదా తల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. ఇవి చాలా శక్తివంతమైనవి. ఎంతలా అంటే.. రేడియేషన్ తట్టుకునే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. మానవులు లేదా ఇతర జీవులు ప్రాణాలు కోల్పోయే మోతాదులో రేడియేషన్ ఉన్నప్పటికీ, బొద్దింకలు సులభంగా తట్టుకుని జీవించగలవు.
ఆహారం లేకుండా మనం ఒక రోజంతా ఉంటేనే నీరసపడిపోతాం. కానీ, బొద్దింకలు ఏదీ తినకుండా దాదాపు ఒక నెల రోజుల పాటు జీవించగలవు. అలాగే నీరు లేకుండా కూడా కొన్ని వారాల పాటు ఇవి బతకగలవు. ప్రకృతిలో ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటూ తన వంశాన్ని కాపాడుకోవడంలో ఈ బొద్దింకల జీవన విధానం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి