Train: అపార్ట్‌మెంట్ మధ్యలో నుంచి దూసుకెళ్లే రైలు.. ఈ వింత రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

Published : Nov 14, 2026, 12:37 PM IST

Train: అపార్ట్‌మెంట్ మధ్యలో నుంచి రైలు దూసుకెళ్తే ఎలా ఉంటుంది? ఇంటి కిటికీలోంచి చూస్తే రైలు కనిపించడం, బిల్డింగ్ మధ్యలోనే స్టేషన్ ఉండటం, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఓ నగరంలో రైలు ఏకంగా అపార్ట్‌మెంట్‌ మధ్యలో నుంచి వెళ్తుంది. అదెక్కడో చూద్దాం

PREV
15
అపార్ట్ మెంట్ మధ్యలో నుంచి రైలు ప్రయాణం

సాధారణంగా రైళ్లు పట్టాలపై, వంతెనల మీదుగా, సొరంగాల గుండా ప్రయాణిస్తుంటాయి. కానీ ఒక నగరంలో మాత్రం ఏకంగా అపార్ట్‌మెంట్ భవనం మధ్యలో నుంచే రైలు దూసుకెళ్తుంది. అంతేకాదు.. ఆ భవనంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజంగానే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆశ్చర్యపరుస్తున్న ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ చైనాలోని చోంగ్‌కింగ్ నగరంలో ఉంది. దీని పేరు లిజిబా మోనోరైల్ స్టేషన్. ఇక్కడ రైలు ప్రయాణం చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అయితే, బయట నుంచి ఆ దృశ్యాన్ని చూడటం మరో అద్భుతమైన అనుభవం.

25
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

చైనా లోని చోంగ్‌కింగ్ నగరం ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు, ఎత్తుపల్లాలతో కూడిన రహదారులు, భారీ భవనాలు, ఆధునిక రవాణా వ్యవస్థకు ప్రసిద్ధి. ఈ నగరాన్ని మౌంటెన్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండలు, లోయలు, నదులు ఎక్కువగా ఉండటంతో సాధారణ నగరాల్లో మాదిరిగా రోడ్లు, రైల్వే మార్గాలను నిర్మించడం అంత సులభం కాదు. అందుబాటులో ఉన్న పరిమిత స్థలాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకు అక్కడి ఇంజినీర్లు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే అపార్ట్‌మెంట్ భవనంలోనే రైల్వే స్టేషన్ నిర్మించడం. దీంతో లిజిబా స్టేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

35
అపార్ట్‌మెంట్‌లోనే రైల్వే స్టేషన్ ఎలా సాధ్యమైంది?

లిజిబా స్టేషన్‌లో 19 అంతస్తుల నివాస, వాణిజ్య భవనంలో ఆరవ, ఏడవ అంతస్తుల ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. చోంగ్‌కింగ్ రైల్ ట్రాన్సిట్ లైన్ 2కు చెందిన మోనోరైల్ రైళ్లు ఈ భవనం మధ్యలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న స్టేషన్‌లో ఆగుతాయి. ప్రయాణికులు రైలు ఎక్కడం, దిగడం కూడా భవనం లోపలే జరుగుతుంది.

అయితే ఈ రైల్వే మార్గాన్ని ఇప్పటికే ఉన్న అపార్ట్‌మెంట్‌ను పగలగొట్టి నిర్మించలేదు. రైల్వే స్టేషన్, నివాస భవనం రెండింటినీ ఒకే ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. భవనం నిర్మాణానికి, రైల్వే మార్గానికి సంబంధించిన ఇంజినీరింగ్ ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. రైలు ప్రయాణించే మార్గం, భవనానికి సంబంధించిన నిర్మాణ వ్యవస్థలు ఒకదానిపై మరొకటి అనవసరమైన ఒత్తిడి కలిగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

45
రైలు శబ్దం ఇంట్లోకి వినిపించదా?

అపార్ట్‌మెంట్ మధ్యలో నుంచి రైలు వెళ్తుంటే అక్కడ నివసించే వారికి శబ్దం, ప్రకంపనలు ఇబ్బంది కలిగించవచ్చనే సందేహం చాలామందికి వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టులో శబ్ద నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణ రైళ్ల మాదిరిగా చక్రాలు పట్టాలపై రాపిడి చెందకుండా, ఈ రైలు ప్రత్యేక రబ్బరు టైర్లతో కూడిన మోనోరైల్ వ్యవస్థపై ప్రయాణిస్తుంది. దీనివల్ల శబ్దం గణనీయంగా తగ్గుతుంది. అలాగే స్టేషన్, భవన నిర్మాణాల మధ్య ప్రకంపనలు నేరుగా వ్యాపించకుండా ప్రత్యేక ఇంజినీరింగ్ ఏర్పాట్లు చేశారు.

55
పర్యాటకులను ఆకర్షిస్తున్న లిజిబా స్టేషన్

లిజిబా స్టేషన్ నిర్మాణం 2004 మార్చిలో పూర్తయింది. సుమారు 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టేషన్ ప్రాజెక్టును రూపొందించారు. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది. రైలు అపార్ట్‌మెంట్ భవనంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాన్ని చూసేందుకు ప్రతిరోజూ ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories