భూమిపై నుండి మంచినీటిని సముద్రంలోకి మోసుకెళ్లే నదుల గురించే మనకు తెలుసు… కానీ సముద్రపు నీటిని భూమిపైకి మోసుకొచ్చే నది గురించి తెలుసా? ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఇంతకీ ఈ వింత నది ఏది?
సాధారణంగా నది అంటే భూమిపైన పుట్టి సముద్రంలో కలిసేది... ప్రపంచంలో ఎక్కడైనా నదీ వ్యవస్థ ఇలాగే ఏర్పడుతుంది. లక్షల క్యూసెక్కుల నీటితో ప్రపంచంలోనే అతిపెద్ద నది అమెజాన్ నుండి మన గంగా, గోదావరి, కృష్ణా నదుల వరకు ఇదే ఫార్ములా... కొండల్లో లేదా సరస్సుల్లో పుట్టడం, సుదూరం ప్రయాణించి చివరకు సముద్రంలో కలవడం. ఇంకా చెప్పాలంటే భూమిపై నుండి నీటిని సముద్రంలోకి మోసుకెళ్లే వాటినే నదులు అంటారు.
భూమిపై పుట్టి సముద్రంలో కలిసే నదులను చూసి ఉంటారు. కానీ విచిత్రంగా సముద్రపు నీటిని భూమిపైకి మోసుకొచ్చే వింత నది గురించి తెలుసా? ఈ నది ఎక్కడో కాదు మన ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంది. ఇంతకీ ఈ వింత నది ఏది? ఇది రివర్స్ లో ఎందుకు ప్రవహిస్తుంది? సముద్రపు నీటిని భూమిపైకి ఎందుకు మోసుకువస్తుంది? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
23
రివర్స్ లో ప్రవహించే నది ఏది?
ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు ఒకటి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉంది. ఈ సరస్సులో బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు వంటి చిన్నచిన్న నదులు కలుస్తాయి…. ఇలా భారీగా మంచినీరు చేరుతుంది. అయితే ఈ సరస్సు నుండే పుట్టే నదే ఉప్పుటేరు.
కొల్లేరు సరస్సులోని అదనపు నీరు ఈ ఉప్పుటేరు ద్వారానే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మీదుగా దాదాపు 64 కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ నది కొన్నిసార్లు రివర్స్ లో ప్రవహిస్తుంది... అంటే సముద్రం నుండి భూమివైపు నీటిప్రవాహం సాగుతుంది. ఇలా సముద్రపు నీరు ప్రవహించడం వల్ల ఈ నదినీరు ఉప్పగా మారతాయి... అందుకే దీన్ని ఉప్పుటేరు అంటారు.
33
ఉప్పుటేరు రివర్స్ లో ఎందుకు ప్రవహిస్తుంది?
సాధారణ సమయాల్లో అన్ని నదుల మాదిరిగానే ఉప్పుటేరు కూడా భూమిపై నుండి సముద్రంలోకే నీటిని మోసుకెళుతుంది. అయితే బంగాళాఖాతంలో పోటు సమయంలో అంటే సముద్ర నీటిమట్టి పెరిగిన సమయంలో ఈ ఉప్పుటేరు రివర్స్ లో ప్రవహిస్తుంది. నదిలోని నీరు సముద్రం కలవడం కాదు సముద్రపు నీరే ఎగదన్నుకుంటూ నదిలోకి చేరుతుంది. దీంతో కొల్లేరులోని స్వచ్చమైన మంచినీటితో ప్రవహించే ఈ నదీజలాలు సముద్ర నీటితో ఉప్పగా మారతాయి... తాగడానికి, వ్యవసాయానికి పనికిరాకుండా తయారవుతాయి.
అయితే బంగాళాఖాతంలో పోటు ముగియగానే సముద్రపు నీరు వెనక్కి వెళుతుంది.. దీంతో ఉప్పుటేరు కూడా సాధారణ స్థితికి వస్తుంది. అంటే కొల్లేరులోని నీరు మళ్లీ యధావిధిగా సముద్రంలో కలుస్తాయి. ఇలా ఉప్పుటేరు కేవలం ముందుకే కాదు అప్పుడప్పుడు వెనక్కి కూడా ప్రవహిస్తుంది... ఇదే ఈ నదికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.