
సముద్ర తీరానికి వెళ్లి చల్లటి గాలిని ఆస్వాదించడం, అలల్లో సేదతీరడం, ఇసుకపై కాసేపు విశ్రాంతి తీసుకోవడాన్ని చాలామంది ఇష్టపడతారు. ఇందుకోసమే చాలామంది గోవాకు వెళుతుంటారు... ఇక్కడి బీచ్ లు పర్యాటకులతో నిండిపోయి ఉంటాయి. ఆంధ్ర ప్రదైశ్ లో కూడా వైజాగ్, సూర్యలంక వంటి అందమైన బీచ్ లు అనేకం ఉన్నాయి... ఇక్కడికి కుటుంబసమేతంగా వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ప్రపంచంలో చాలా బీచ్ లలో ఇలాగే ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేసేలా ఉంటాయి.
అయితే ఈ ప్రపంచంలో కొన్ని బీచ్ లు మాత్రం ఫ్యామిలీస్ అటువైపు కన్నెత్తి చూడలేని విధంగా ఉంటాయి. బికినీ, స్విమ్ సూట్స్ ధరించడం కాదు అసలు ఒంటిపై నూలుపోగు లేకుండా పర్యాటకులు స్వేచ్చగా తిరిగే సముద్రతీరాలు కొన్ని ఉన్నాయి... వీటినే Nude Beach లేదా Naturist Beach (నేచురిస్ట్ బీచ్‌లు) అంటారు. ప్రకృతిని ఎలాంటి దాపరికం లేకుండా ఆస్వాదించాలనుకునే వారికి ప్రత్యేకంగా నేచురిస్ట్ బీచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
అయితే వీటిని కేవలం నగ్నంగా ఉండే ప్రదేశాలుగా చూడటం సరైంది కాదు. నేచురిజం అనేది శరీరంపై ఉన్న సంకోచాలను తగ్గించుకుని, ప్రకృతితో మరింత సహజంగా మమేకం కావాలనే భావనతో ముడిపడి ఉంటుంది. చాలా బీచ్‌లలో ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను గౌరవించడం, అనుమతి లేకుండా ఫొటోలు తీయకపోవడం వంటి కఠినమైన నియమాలు ఉంటాయి. అలాంటి ప్రపంచ ప్రసిద్ధ టాప్ 5 నేచురిస్ట్ బీచ్‌లపై ఓ లుక్కేద్దాం.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామి సమీపంలో ఉన్న హాలోవర్ బీచ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నేచురిస్ట్ బీచ్‌లలో ఒకటి. మొత్తం హాలోవర్ పార్క్‌లోని ఉత్తర భాగంలో ప్రత్యేకంగా నగ్నంగా సూర్యస్నానం (సన్ బాత్) చేసేందుకు, బీచ్ లో సేదతీరేందుకు అనుమతిస్తారు. ఇది 1991 నుంచి నేచురిస్ట్ బీచ్‌గా కొనసాగుతోంది.
తెల్లటి ఇసుక, నీలిరంగు సముద్రం, చక్కటి సదుపాయాలతో ఈ ప్రాంతం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ నగ్నంగా ఉండటం తప్పనిసరి కాదు. ఎవరి సౌకర్యానికి తగ్గట్టుగా వారు దుస్తులతో లేదా దుస్తులు లేకుండా ఉండవచ్చు.
ఫ్రాన్స్‌లోని మెడిటరేనియన్ తీరంలో ఉన్న క్యాప్ డి'ఆగ్డ్ ప్రపంచంలోని అతిపెద్ద నేచురిస్ట్ ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచింది... దీన్ని 'నేక్డ్ సిటీ (Naked City)' అనికూడా అంటారు. ఇక్కడ సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ఇసుక తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో బీచ్ మాత్రమే కాకుండా వసతి, రెస్టారెంట్లు, దుకాణాలు, వినోద సదుపాయాలు కూడా ఉన్నాయి. అందుకే ఏటా 40 వేలమందికి పైగా ఈ బీచ్ ను సందర్శిస్తారు.
ఇతర నేచురిస్ట్ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ నియమాలు మరింత స్పష్టంగా ఉంటాయి. నేచురిస్ట్ బీచ్ లోకి ప్రవేశానికి నియంత్రణ ఉంటుంది... అక్కడికి చేరుకున్న తర్వాత నేచురిజం నియమాలను పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. అలాగే ఫొటోలు, వీడియోల విషయంలో ఇతరుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
ఫ్రాన్స్‌లోనే ఉన్న మరో ప్రసిద్ధ నేచురిస్ట్ బీచ్ మాంటాలివెట్. అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో సుమారు రెండు కిలోమీటర్ల ప్రత్యేక నేచురిస్ట్ బీచ్ ఉంది. ఫ్రాన్స్‌లో నేచురిజం చరిత్రతో ఈ ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ నగ్నతను కేవలం వ్యక్తిగత ఎంపికగా కాకుండా సంస్కృతిలో భాగంగా చూస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నగ్నతను పాటించడం ఇక్కడి నియమాల్లో భాగమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ తీరంలో ఈతతో పాటు బీచ్ వాలీబాల్, సర్ఫింగ్ వంటి కార్యకలాపాలు కూడా అందుబాటులో ఉంటాయి.
4. రెక్ బీచ్ – కెనడా
కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న రెక్ బీచ్ ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద నేచురిస్ట్ బీచ్‌లలో ఒకటి. సుమారు 7.8 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండే ఈ తీర ప్రాంతం ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి. నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడికి చేరుకున్న తర్వాత అడవులు, కొండచరియలు, సముద్రం కలిసిన ప్రత్యేక వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది clothing-optional బీచ్ మాత్రమే... ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నగ్నంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే బీచ్‌లో నేచురిజం సాధారణ దృశ్యంగా ఉంటుంది. ఇతరులను గమనిస్తూ ఇబ్బంది పెట్టడం, అనుమతి లేకుండా ఫొటోలు తీయడం వంటి వాటిని తీవ్రంగా నిరుత్సాహపరుస్తారు.
స్పెయిన్‌లోని ఫోర్మెంటెరా ద్వీపంలోని సెస్ ఇల్లెట్స్ ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. తెల్లటి ఇసుక, పారదర్శకమైన టర్కాయిస్ రంగు నీరు, ప్రశాంతమైన వాతావరణం ఈ బీచ్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇది పూర్తిగా నేచురిస్ట్ బీచ్‌గా గుర్తింపు పొందింది. చుట్టూ ఉన్న ప్రాంతం ప్రకృతి సంరక్షిత పరిధిలో ఉండటంతో ఇక్కడి సహజ వాతావరణాన్ని కాపాడటానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.
గుర్తుంచుకోవాల్సిన విషయం
నేచురిస్ట్ బీచ్‌కు వెళ్లాలనుకునేవారు ముందుగా అక్కడి స్థానిక నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ప్రాంతాల్లో నగ్నత తప్పనిసరి కాగా, మరికొన్ని చోట్ల clothing-optional విధానం మాత్రమే ఉంటుంది. అలాగే ఇతరుల వ్యక్తిగత గోప్యతను గౌరవించడం, అనుమతి లేకుండా ఫొటోలు లేదా వీడియోలు తీయకపోవడం, స్థానిక నియమాలను పాటించడం తప్పనిసరి. ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు అక్కడి సంస్కృతి, నియమాలను గౌరవించినప్పుడే నేచురిస్ట్ బీచ్ అనుభవం నిజంగా ప్రత్యేకంగా మారుతుంది.