Coconut: కొబ్బరి కాయకు ఒక వైపు మూడు రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలను కళ్లు అంటారు. ఆ కళ్లు ఏర్పడటానికి కారణం చాలా మందికి అవగాహన లేదు. అసలు మూడు రంధ్రాలు ఏర్పడటానికి కారణం ఇక్కడ వివరించాము.
కొబ్బరికాయను పూజల్లో, వంటల్లో, పానీయంగా ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. అయితే కొబ్బరికాయను జాగ్రత్తగా గమనిస్తే దాని పైభాగంలో మూడు కళ్ల లాంటి గుర్తులు కనిపిస్తాయి. అసలు కొబ్బరికాయకు మూడు కళ్లు ఎందుకు ఉంటాయి? వాటి పని ఏంటి? అనే సందేహం చాలామందికి వస్తుంది. నిజానికి అవి కళ్లు కావు. మొక్కల శాస్త్రం ప్రకారం అవి విత్తనం అభివృద్ధి చెందే సమయంలో ఏర్పడిన మూడు సహజ రంధ్రాల గుర్తులు. కొబ్బరి పువ్వు నుంచి కాయ ఏర్పడే దశలో మూడు అండాలు ఉంటాయి. కాయ పెరిగే కొద్దీ వాటిలో ఒకటి మాత్రమే పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. మిగతా రెండు పెరుగుదల ఆగిపోతుంది. వీటి గుర్తులే కొబ్బరికాయ పైభాగంలో మూడు చిన్న గుంటల్లా కనిపిస్తాయి.
23
కొబ్బరికాయకు మూడు రంధ్రాల వెనుక కారణం
ఈ మూడు గుర్తుల్లో ఒకటి మాత్రమే చాలా మెత్తగా ఉంటుంది. మిగతా రెండింటితో పోలిస్తే ఈ భాగంలో పెంకు పలుచగా ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ మెత్తని భాగం కిందనే కొబ్బరి విత్తనంలోని పిండం (ఎంబ్రియో) ఉంటుంది. భవిష్యత్తులో ఇదే కొత్త కొబ్బరి మొక్కగా పెరుగుతుంది. కాయ మొలకెత్తే సమయంలో ఈ మెత్తని భాగం నుంచి చిన్న మొలక బయటకు వస్తుంది. అందుకే దీనిని మొలకెత్తే రంధ్రం అని పిలుస్తారు. మిగతా రెండు గుర్తుల దగ్గర పెంకు గట్టిగా ఉంటుంది. అందుకే కొబ్బరికాయలో నీళ్లు తాగేందుకు రంధ్రం చేయాలంటే ఈ మెత్తని భాగాన్ని ఎంచుకుంటారు. ఈ మూడు గుర్తుల ద్వారా వర్షపు నీరు కొబ్బరికాయలోకి వెళ్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
33
కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి?
దీనికి సమాధానం కొబ్బరి చెట్టు వేర్లలో ఉంది. చెట్టు భూమిలోని నీటిని వేర్ల ద్వారా పీల్చుకుంటుంది. ఆ నీరు చెట్టులోని ప్రత్యేక నాళాల ద్వారా పైకి ప్రయాణించి కాయలోకి చేరుతుంది. కాయ పెరుగుతున్న సమయంలో ఈ నీరు పోషకాలు కలిసిన ద్రవంగా మారుతుంది. దీన్నే శాస్త్రీయంగా లిక్విడ్ ఎండోస్పెర్మ్ అంటారు. ఇదే మనం తాగే కొబ్బరి నీరు. కాయ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఈ ద్రవంలో కొంత భాగం తెల్లని కొబ్బరి గుజ్జుగా మారుతుంది. మిగిలిన భాగం నీరుగా ఉంటుంది. ఇలా కొబ్బరికాయలోని మూడు గుర్తులు, నీరు ఏర్పడే విధానం వెనుక అద్భుతమైన ప్రకృతి రహస్యం దాగి ఉంది.