Araku Railway Station: పచ్చని కొండలు, చీకటిని చీల్చుకుంటూ సాగే సొరంగాలు.. అరకు రైలు ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతి. అయితే, ప్రకృతి అందాల మధ్య ఈ రైల్వే మార్గం ఎందుకు నిర్మించారో తెలుసా? పర్యాటకం కోసం కాదు.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది
పచ్చని కొండలు, మేఘాలను తాకే లోయలు, చీకటిని చీల్చుకుంటూ సాగే సొరంగాలు.. అరకు రైలు ప్రయాణం అనగానే చాలామందికి గుర్తొచ్చే దృశ్యాలివి. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ రైల్వే మార్గం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే పఈ రైల్వే మార్గం ఎందుకు నిర్మించారో తెలుసా? ఖనిజ సంపదను రవాణా చేయాలన్న లక్ష్యంతో మొదలైన రైల్వే ప్రాజెక్టులో భాగంగానే అరకు రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంది.
24
ఖనిజ రవాణా కోసం రైల్వే మార్గం
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అరకు ప్రాంతం తూర్పు కనుమల మధ్య ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. అయితే, ఈ ప్రాంతం మీదుగా రైల్వే మార్గం నిర్మించడానికి ప్రధాన కారణం ఇక్కడి టూరిజం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా ప్రాంతంలో లభించే ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టుకు తరలించేందుకు రైల్వే కనెక్టివిటీ అవసరమైంది.
ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తవలస నుంచి కిరండూల్ వరకు రైల్వే లైన్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టును దండకారణ్య–బొలంగీర్–కిరిబురు (DBK) ప్రాజెక్టుగా పిలుస్తారు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల మీదుగా సాగుతూ అరకు లోయ గుండా వెళ్తుంది.
34
కొండలను చీల్చుకుంటూ సాగిన నిర్మాణం
తూర్పు కనుమల కొండ ప్రాంతాల్లో రైల్వే లైన్ వేయడం అంత ఈజీ కాదు. ఎత్తుపల్లాలు, రాతి కొండలు, లోయలు ఇంజినీర్లకు సవాళ్లుగా నిలిచాయి. అయినప్పటికీ ఈ ప్రాంతంలో రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గంలో మొత్తం 58 సొరంగాలు, 84 ప్రధాన వంతెనలు ఉండటం దీని నిర్మాణ ప్రత్యేకతను తెలియజేస్తుంది.
ఈ రైల్వే ప్రాజెక్టు 1959లో ప్రారంభమై, కొత్తవలస–కిరండూల్ మార్గం 1966–67 నాటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నిర్మాణానికి జపాన్ ఆర్థిక సహాయం అందించడం మరో ముఖ్యమైన అంశం. తొలుత ఇనుప ఖనిజ రవాణా అవసరాల కోసం రూపొందించిన ఈ మార్గం, తర్వాత ప్రయాణికుల రాకపోకలకు కూడా కీలకంగా మారి..టూరిజానికి మరింత ఊతం ఇచ్చింది.
కాలక్రమంలో అరకు లోయ ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షించడంతో ఈ రైల్వే మార్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రైలు కిటికీలోంచి కనిపించే పచ్చని కొండలు, లోతైన లోయలు, సొరంగాలు ప్రయాణాన్ని ఓ ప్రత్యేక అనుభూతిగా మారుస్తాయి. అరకు చేరుకోవడానికి రైలును ఎంచుకునే పర్యాటకులకు ప్రయాణమే ఒక ఆకర్షణగా నిలుస్తోంది. సముద్ర మట్టానికి సుమారు 925 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు రైల్వే స్టేషన్ ఈ మార్గంలో ముఖ్యమైన నిలయం.