Worlds ugliest car: ప్రపంచంలోనే అత్యంత వికారమైన కారుగా తూర్పు జర్మనీ 'ట్రాబంట్ 601' కు గుర్తింపు ఉంది. అసలు ఎందుకు ఈ కారు అత్యంత అధ్వాన్నమైన కారుగా నిలిచింది? ఈ కారు గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు జర్మనీకి చెందిన ట్రాబంట్ 601 కారు గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీనిని ప్రేమగా ‘ట్రాబీ’ అని పిలుచుకునేవారు. కానీ, ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో దీనికి ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన కారు అనే అప్రతిష్ఠ ఉంది. ప్లాస్టిక్ బాడీ, విపరీతమైన పొగ, తక్కువ వేగం.. ఇలాంటి ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ, ఒకప్పుడు ఈ కారును సొంతం చేసుకోవడం ఒక కలగా ఉండేది.
25
ప్లాస్టిక్ బాడీ.. గుర్రపు వెంట్రుకల సీట్లు !
ట్రాబంట్ కారును 1950వ దశకంలో అభివృద్ధి చేశారు. అప్పట్లో ఉక్కు కొరత ఉండటంతో, ఇంజనీర్లు దీనిని డ్యూరోప్లాస్ట్ అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేశారు. ఇది కాటన్ ఫైబర్, సింథటిక్ రెసిన్ కలిపి చేసిన ఒక రకమైన ప్లాస్టిక్. అందుకే దీనిని ప్రజలు తమాషాగా నడిచే కార్డ్‌బోర్డ్ అని పిలిచేవారు. కారు లోపల సీట్లలో దూదికి బదులు గుర్రపు వెంట్రుకలను నింపేవారు. ఈ కారులో కనీసం ఫ్యూయల్ గేజ్ అంటే పెట్రోల్ ఎంత ఉందో చూపే మీటర్ కూడా ఉండేది కాదు.
35
13 ఏళ్ల నిరీక్షణ..
తూర్పు జర్మనీలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల కార్ల లభ్యత చాలా తక్కువగా ఉండేది. దీంతో ఒక ట్రాబంట్ కారు కావాలంటే 10 నుండి 13 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అక్కడ పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు వారి పేరు మీద కారును బుక్ చేసేవారు. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యే సరికి కారు డెలివరీ వచ్చేది. ఒకవేళ ఎవరైనా సెకండ్ హ్యాండ్ కారు అమ్మితే, అది కొత్త కారు ధర కంటే రెట్టింపు ధర పలికేది.
ట్రాబంట్ 601లో కేవలం 23 హార్స్‌పవర్ ఇచ్చే రెండు సిలిండర్ల ఇంజన్ ఉండేది. ఇది విపరీతమైన పొగను వదిలేది. ఒక రచయిత దీనిని "ఇరాక్ చమురు బావుల మంటలంత పొగ వస్తుంది" అని పేర్కొనడం దాని నుంచి వచ్చే పొగ ఏ స్థాయిలో ఉండేదో తెలియజేస్తుంది. ఈ కారు 0 నుండి 60 మైళ్ల వేగాన్ని అందుకోవడానికి ఏకంగా 21 సెకన్ల సమయం తీసుకునేది. గరిష్ఠ వేగం కూడా గంటకు 100 కిలోమీటర్లు దాటేది కాదు. 34 ఏళ్ల పాటు ఉత్పత్తిలో ఉన్నా, ఇందులో ఎలాంటి ఆధునిక మార్పులు చేయకపోవడం గమనార్హం.
55
కమ్యూనిజం పతనానికి నిదర్శనం..
1957లో రష్యా స్పుత్నిక్ శాటిలైట్‌ను ప్రయోగించిన సమయంలో ఈ కారును తయారు చేశారు. అందుకే దీనికి జర్మన్ భాషలో శాటిలైట్ అని అర్థం వచ్చే ట్రాబంట్ అని పేరు పెట్టారు. అయితే, పశ్చిమ దేశాల కార్లు వేగంగా అభివృద్ధి చెందుతుంటే, తూర్పు జర్మనీ మాత్రం దశాబ్దాల కాలం నాటి పాత సాంకేతికతతోనే ఈ కార్లను తయారు చేస్తూ ఉండిపోయింది. 1989లో బెర్లిన్ గోడ కూలిపోయినప్పుడు, వేల సంఖ్యలో తూర్పు జర్మనీ ప్రజలు ఈ కార్లలోనే సరిహద్దులు దాటి పశ్చిమ జర్మనీకి వెళ్లారు.
నేడు క్లాసిక్ కారుగా క్రేజ్
ఒకప్పుడు పనికిరాని కారుగా ముద్రపడి, బెర్లిన్ గోడ పతనం తర్వాత రోడ్ల మీద వదిలేసిన ఈ ట్రాబంట్లు ఇప్పుడు మళ్లీ క్రేజ్ సంపాదించుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 33,000 ట్రాబంట్లు అందుబాటులో ఉన్నాయి. జర్మనీలో అనేక క్లాసిక్ కార్ క్లబ్బులు వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నాయి. చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిన ఈ బుజ్జి కారు ఇప్పుడు వేల డాలర్ల ధరకు వేలంలో అమ్ముడవుతోంది.