
ఈ భూమిపై ఉన్న వింత జీవులలో నీటి ఏనుగులు (హిప్పోపొటమస్) కూడా ఒకటి. భారీ శరీరంతో ఉండే ఇవి, తమ జీవితంలో ఎక్కువ సమయం నీటిలోనే గడుపుతాయి. అయితే ఇవి భూమిపైనా జీవించగలవు… అందుకే వీటిని ‘పాక్షిక జలచరంగా’ పేర్కొంటారు. ఏనుగులు, ఖడ్గమృగాల తర్వాత భూమిపై నివసించే అతిపెద్ద జంతువు హిప్పోనే.
అయితే మిగతా జంతువుల్లా కాకుండా హిప్పో కొన్ని ప్రత్యేకతలు కలిగివుంది. సాధాారణంగా మనిషి, ఇతర జంతువుల చెమట తెల్లగా నీటిమాదిరిగానే ఉంటుంది… కానీ హిప్పో చెమట మాత్రం రంగు లేకుండా ఉండదు… ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఆ చెమట వాటికి ఎంత ముఖ్యమో తెలుసుకుందాం.
నీటి ఏనుగుల చెమట ఎర్రగా ఉండటానికి ఓ సైంటిఫిక్ కారణం ఉంది. నిజానికి అది చెమట కాదు, రక్తం అంతకన్నా కాదు. వాటి చర్మం కింద ఉండే ప్రత్యేక గ్రంథులు ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ ద్రవాలు ఇతర జంతువుల చెమట మాదిరిగానే రంగు లేకుండా ఉంటుంది… అయితే శరీరంలోంచి బయటకు వచ్చాక ఈ ద్రవం గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరిపి ఎరుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. ఇది చూడటానికి రక్తంలా ఉండటంతో దీన్ని 'బ్లడ్ స్వెట్' అని పొరపాటుగా పిలుస్తారు.
నీటి ఏనుగుల (హిప్పో) శరీరానికి గమనిస్తే చాలా నునుపుగా ఉంటాయి… వెంట్రుకలు అనేవే ఉండవు. వాటి చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. హిప్పోలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి… అక్కడి మండుటెండకు వాటి చర్మం కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ఎండల నుండి తమనుతాము కాపాడుకునేందుకే ఈ ఎర్రటి ద్రవం విడుదల చేస్తాయి.
హిప్పోలు విడుదలచేసే ఎర్రటి ద్రవంలో హిప్పోసుడోరిక్ యాసిడ్, నార్‌హిప్పోసుడోరిక్ యాసిడ్ అనే రెండు ఆమ్లాలు ఉంటాయి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను (UV rays) గ్రహిస్తాయి. ఇలా చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఒక సహజ సన్‌స్క్రీన్‌లా పనిచేస్తాయి. అందువల్లే హిప్పోలు 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ తిరుగుతూ కనిపిస్తుంటాయి.
మగ నీటి ఏనుగులు తమ ప్రాంతం కోసం ఇతర హిప్పోలతో భయంకరంగా పోరాడతాయి. ఈ గొడవల్లో వాటి శరీరానికి పెద్ద గాయాలు అవుతాయి. క్రిములు ఎక్కువగా ఉండే బురద నీటిలో ఉన్నప్పటికీ హిప్పో శరీరంనుండి విడుదలయ్యే ప్రత్యేక ద్రవం యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అంటే గాయంపై బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది. ఇలా గాయాలు త్వరగా నయం కావడానికి ఇది సహాయపడుతుంది.
నీటిలో, బురదలో జీవించే నీటి ఏనుగులపై ఈగలు, దోమలు వంటి కీటకాలు సులభంగా వాలుతాయి. కానీ ఈ ఎర్రటి ద్రవం జిగటగా ఉండటం, దాని వాసన కారణంగా కీటకాలు వాటిపైకి రాకుండా ఉంటాయి. అంటే ఇది ఒక కీటక నాశినిగా కూడా పనిచేస్తుంది. అంతేకాదు ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు చర్మం పొడిబారకుండా, పగలకుండా ఈ ద్రవం ఒక లోషన్‌లా పనిచేసి చర్మంలోని తేమను కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీటి ఏనుగు శరీరం దానికి అవసరమైన సన్‌స్క్రీన్, యాంటీసెప్టిక్, మాయిశ్చరైజర్‌ను సొంతంగా తయారు చేసుకుంటుంది.