Anesthesia: ఒకప్పుడు ఆపరేషన్ అంటే నరకం. మత్తు మందు ఇచ్చేవారు కాదు. కానీ అనస్థీషియా పుట్టిన తరువాత మాత్రం ఎలాంటి నొప్పి తెలియకుండా ఆపరేషన్ పూర్తి అయిపోతుంది. ఈ అనస్థీషియా ఎలా పుట్టింది? ఎలా తయారుచేశారు?
ఒకప్పుడు ఆపరేషన్ అంటే నరకమే. శరీరంలో ఒక భాగాన్ని కోస్తుంటే ఎంత నొప్పి వస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. దెబ్బతిన్న అవయవాన్ని తొలగించాలంటే రోగిని నలుగురు వ్యక్తులు గట్టిగా పట్టుకునేవారు. ఆ బాధకు రోగి పెట్టే కేకలు ఆసుపత్రి అంతా మారుమోగిపోయేవి. చాలా మంది రోగులు ఆపరేషన్ సమయంలో కలిగే విపరీతమైన నొప్పిని భరించలేక ఆ బాధతో చనిపోయేవారు. మత్తు మందు లేని రోజుల్లో ఆపరేషన్ చేయాలంటే వైద్యుడికి కూడా పెద్ద సవాలే. ఇంతటి భయంకరమైన పరిస్థితిని మార్చింది అనస్థీషియా. ఆధునిక వైద్య శాస్త్రంలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ అనే చెప్పుకోవాలి. ఇంతకీ ఈ మత్తు మందు ఎలా పుట్టింది? ఎవరు తయారుచేశారు?
24
పార్టీలో పుట్టిన ఐడియా
19వ శతాబ్దంలో అమెరికాలో 'ఈథర్' (Ether) అనే రసాయన ద్రవం ఉండేది. దానిని అప్పట్లో దాన్ని వినోదం కోసం వాడేవారు. యువతీ యువకులు పార్టీలు చేసుకునేటప్పుడు ఈథర్ ద్రవాన్ని ఒక రుమాలుపై వేసుకుని పీల్చేవారు. దానివల్ల వారికి ఒక రకమైన మైకం కమ్మేది. ఇలాంటి వేడుకలను 'ఈథర్ ఫ్రాలిక్స్' అని పిలిచేవారు. సరిగ్గా ఇలాంటి ఒక పార్టీకి అమెరికాలోని జార్జియాకు చెందిన డాక్టర్ క్రాఫోర్డ్ లాంగ్ కూడా వెళ్ళారు. అక్కడ ఈథర్ తీసుకుని మత్తులో పడిఉన్న వ్యక్తులను ఆయన గమనించారు. వారు కింద పడి తల పగిలినా, చేతులకు గాయాలైనా ఏమాత్రం నొప్పిని అనుభవించకపోవడం ఆయన గుర్తించారు. ఇది చూసిన డాక్టర్ లాంగ్ కు ఈ రసాయనాన్ని పీల్చినప్పుడు నొప్పి తెలియడం లేదంటే, దీనిని ఆపరేషన్ల సమయంలో ఎందుకు వాడకూడదు అనే ఆలోచన వచ్చింది.
34
మొదటి ఆపరేషన్
1842, మార్చి 30వ తేదీన జేమ్స్ వెనబుల్ అనే వ్యక్తి తన మెడ వెనుక ఉన్న గడ్డను తొలగించుకోవడానికి డాక్టర్ వద్దకు వచ్చారు. అప్పట్లో ఇలాంటి గడ్డలను కోసి తీయడం అంటే రోగిని కదలకుండా కట్టి పడేసేవారు. కానీ డాక్టర్ లాంగ్ ఈథర్ తో ప్రయోగం చేశారు. ఒక కర్చీఫ్‌పై ఈథర్ పోసి రోగికి వాసన చూపించారు. కొద్ది నిమిషాల్లోనే రోగి గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. అప్పుడు డాక్టర్ లాంగ్ ఆ గడ్డను కోసి బయటకు తీశారు. ఆపరేషన్ పూర్తయ్యాక రోగి మత్తు నుంచి కోలుకుని అయిపోయిందా? నొప్పి తెలియలేదు అని చెప్పాడు. అలా అనస్థీషియా పుట్టింది.
డాక్టర్ లాంగ్ ఈథర్ గురించి బయట ప్రపంచానికి చెప్పలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత విలియం టి.జి. మోర్టన్ అనే దంతవైద్యుడు ఈ ఈథర్ మత్తును వాడి దంతాల ఆపరేషన్లను చేయడం ప్రారంభించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ఆపరేషన్ థియేటర్లలో వినిపించే రోగుల ఏడుపులు అనస్థీషియా రాకతో నిశ్శబ్దంగా మారిపోయాయి. గుండె ఆపరేషన్లు, మెదడు శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి వంటి కఠినమైన ఆపరేషన్లన్నీ ఈ మత్తు మందు వల్లే సాధ్యమవుతున్నాయి. ప్రస్తుతం అనస్థీషియా రంగం ఎంతో అభివృద్ధి చెందింది. శరీరంలోని ఒక భాగానికి మాత్రమే మత్తు ఇవ్వడం (Local Anesthesia), వెన్నెముకకు మత్తు ఇవ్వడం వంటి ఎన్నో పద్ధతులు వచ్చాయి.