Tea Capital: ఉదయం నిద్ర లేవగానే వేడివేడి టీ తాగడం చాలామందికి అలవాటు. సాయంత్రం సమయంలో ఓ కప్పు టీ చేతిలో ఉంటే ఆ మజానే వేరు. అందుకే మన దేశంలో టీకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతేకాదు మన దేశంలో టీకి ఏకంగా రాజధాని నగరమే ఉంది. అదేక్కడో తెలుసుకుందాం.
చాలామందికి టీ తాగనిదే రోజు స్టార్ట్ కాదు. పని ఒత్తిడిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటున్నా.. చేతిలో ఓ కప్పు టీ ఉంటే ఆ ఆనందమే వేరు. మన దేశంలో టీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద హోటళ్ల వరకు ఎక్కడ చూసినా చాయ్ లవర్స్ కనిపిస్తుంటారు. అయితే మన దేశంలో టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ నగరం ఉంది. అక్కడ ఎటు చూసినా పచ్చని తేయాకు తోటలే కనిపిస్తాయి. అక్కడి టీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అదే అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్ నగరం. దీన్ని టీ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇంతకీ ఈ నగరానికి టీ రాజధాని అనే పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
25
టీ రాజధాని అనే పేరు ఎలా వచ్చింది?
అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్ నగరం టీ తోటలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. బ్రహ్మపుత్ర నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ నగరం చుట్టూ పచ్చని తేయాకు తోటలు విస్తరించి ఉంటాయి. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం తేయాకు సాగుకు అనుకూలంగా ఉండటంతో పెద్ద ఎత్తున టీ తోటలు అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో టీ పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వ్యవసాయంతో పాటు టీ తయారీ కేంద్రాలు, వ్యాపార కార్యకలాపాలు కూడా ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. డిబ్రూగఢ్తో పాటు సమీపంలోని టిన్సుకియా, శివసాగర్ ప్రాంతాలు కూడా అస్సాం టీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఈ నగరానికి టీ రాజధాని అనే పేరు వచ్చింది.
35
అస్సాం టీ ప్రత్యేకత
అస్సాం టీ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది దాని బలమైన రుచి, మంచి రంగు, ప్రత్యేకమైన సువాసన. సాధారణంగా ఇతర ప్రాంతాల టీతో పోలిస్తే అస్సాం టీ రుచి కొంచెం గాఢంగా ఉంటుంది. ముఖ్యంగా పాలతో తయారుచేసే టీకి ఈ రకం తేయాకు బాగా సరిపోతుంది. అందుకే దేశంలోని అనేక ప్రాంతాల్లో టీ తయారీకి అస్సాం తేయాకును ఉపయోగిస్తుంటారు. అస్సాం టీకి అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి గుర్తింపు ఉంది.
అస్సాంలో తేయాకు సాగుకు దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. 1823లో రాబర్ట్ బ్రూస్ అస్సాంలో అడవి తేయాకు మొక్కలను గుర్తించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. తర్వాత బ్రిటిష్ పాలన కాలంలో అస్సాంలో వాణిజ్యపరంగా టీ తోటల సాగు ప్రారంభమైంది. క్రమంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది.
55
పర్యాటకులకు మంచి అనుభూతి
డిబ్రూగఢ్ ప్రత్యేకత కేవలం టీ ఉత్పత్తికే పరిమితం కాలేదు. ఇక్కడి పచ్చని తేయాకు తోటలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎటు చూసినా పచ్చదనంతో నిండిన తోటలు, వాటి మధ్య పనిచేసే కార్మికులు కనిపిస్తారు. టీ తోటల్లో పర్యటిస్తూ తేయాకు ఆకులను ఎలా సేకరిస్తారు? వాటిని ఫ్యాక్టరీల్లో ఎలా ప్రాసెస్ చేస్తారు? మనం తాగే టీగా ఎలా మారుస్తారు? అనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రాంతం మంచి అనుభూతిని అందిస్తుంది.