
Poisonous vs Venomous : పాము కనిపిస్తే చాలు చాలామంది వణికిపోతారు... ఇది పడగవిప్పితే చాలు దూరంగా పరుగుతీస్తారు. అయితే పాము అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే విషయం ‘విషం’… వీటిని వెనమస్ అంటారు. కానీ పాముల మాదిరిగానే మరికొన్ని విషపూరిత జీవులు ఉంటారు... వాటిని మాత్రం వెనమస్ అనకుండా పాయిజనస్ అంటారు. జీవశాస్త్రంలో విషపూరిత జీవులను వివరించేందుకు Poisonous, Venomous అనే రెండు వేర్వేరు పదాలను ఉపయోగిస్తారు... ఈ రెండు పదాలకు తెలుగులో అర్థం దాదాపు ఒకేలా అనిపిస్తుంది. కానీ విషపూరిత జీవులు మనిషి, ఇతర జీవుల శరీరంలోకి విషాన్ని పంపించే విధానాన్ని బట్టి అది వెనమసా, పాయిజనసా అనేది నిర్దారిస్తారు.
పాయిజనస్ అనే పదాన్ని సాధారణంగా విషాన్ని తాకడం లేదా తినడం ద్వారా ఇతర జీవులకు హాని కలిగించే జీవులు, మొక్కలు లేదా పదార్థాలకు ఉపయోగిస్తారు. అంటే ఇలాంటి జీవి పాముల మాదిరిగా మనల్ని కరిచి విషాన్ని శరీరంలోకి పంపాల్సిన అవసరం లేదు.. ఇతర పద్దతుల్లో పంపుతుంది.
ఉదాహరణకు కొన్ని విషపూరిత కప్పలు తమ చర్మంలో విషపదార్థాలను కలిగి ఉంటాయి. వాటిని తాకడం లేదా వాటి నుంచి వచ్చే విషపదార్థాలు శరీరంలోకి చేరడం వల్ల హాని కలగవచ్చు. అలాగే కొన్ని మొక్కలు, పుట్టగొడుగులు, జంతువుల్లో కూడా శరీరంలో విషపదార్థాలు ఉండొచ్చు. వీటిని Poisonousగా పరిగణిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ‘దాన్ని మీరు తింటే లేదా తాకితే మీకు విష ప్రభావం కలిగితే అది పాయిజనస్’ అని గుర్తుపెట్టుకోవచ్చు.
వెనమస్ జీవులు విషాన్ని స్వయంగా ఉత్పత్తి చేసి, దాన్ని ప్రత్యేకమైన శరీర భాగాల ద్వారా మరో జీవి శరీరంలోకి ప్రవేశపెడతాయి. ఇందుకోసం కాటు వేయడం, కొరకడం లేదా ముళ్లు వంటి ప్రత్యేక వ్యవస్థలను ఉపయోగిస్తాయి.
పాములు దీనికి ప్రధాన ఉదాహరణ. విషపూరిత పాములు తమ విష గ్రంథుల్లో విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాటు వేసినప్పుడు కోరల ద్వారా ఆ విషాన్ని ప్రత్యర్థి శరీరంలోకి పంపుతాయి. అందుకే విషాన్ని కాటు ద్వారా ఇంజెక్ట్ చేసే పాములను వెనమస్ స్నేక్స్ అంటారు. అదే విధంగా కొన్ని సాలీడులు, తేళ్లు, కొన్ని కీటకాలు కూడా తమ విషాన్ని కాటు లేదా కుట్టడం ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతాయి. ఇవి కూడా వెనమస్ జీవుల కిందకు వస్తాయి.
పాయిజనస్, వెనమస్ పదాల మధ్య తేడాను గుర్తుపెట్టుకోవడానికి ఒక సులభమైన నియమం ఉంది. మీరు దేన్నైనా కరిస్తే లేదా తింటే మీకు ప్రాణాపాయం జరిగితే అది పాయిజనస్... ఏదైనా మిమ్మల్ని కరిస్తే లేదా కుడితే మీకు ప్రాణాపాయం జరిగితే అది వెనమస్. అంటే విషం ఎలా శరీరంలోకి చేరుతుందనేదే అసలు తేడా.
పాయిజనస్ జీవి తన విషాన్ని మనపైకి పంపేందుకు ప్రత్యేకమైన ఇంజెక్షన్ వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. అదే వెనమస్ జీవికి మాత్రం విషాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకమైన శరీర నిర్మాణం ఉంటుంది.
పాములన్నీ వెనమస్ కావు
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. పాము అంటే తప్పనిసరిగా వెనమస్ అని కాదు. ప్రపంచంలో అనేక రకాల పాములు ఉన్నాయి. వాటిలో విషాన్ని ఉత్పత్తి చేసి కాటు ద్వారా శరీరంలోకి పంపే పాములు ఒక వర్గం మాత్రమే. కొన్ని పాములు విషాన్ని కలిగి ఉండవు. మరికొన్ని పాముల్లో విషాన్ని ఉపయోగించే విధానం, కోరల నిర్మాణం వంటి అంశాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల పాము కనిపించగానే అది విషపూరితమా కాదా అని స్వయంగా నిర్ధారించడానికి ప్రయత్నించడం సురక్షితం కాదు.
విషం శరీరంలోకి ఎలా చేరుతుందనేదే ముఖ్యం
మన రోజువారీ భాషలో Poisonous, Venomous రెండింటినీ ‘విషపూరితమైన’ అనే అర్థంలో ఉపయోగిస్తుంటాం. కానీ శాస్త్రీయంగా చూస్తే వాటి మధ్య స్పష్టమైన తేడా ఉంది.
పాయిజనస్ = మనం తినడం లేదా తాకడం ద్వారా విష ప్రభావం కలిగించేది.
వెనమస్ = కాటు వేయడం, కుట్టు లేదా ప్రత్యేకమైన శరీర నిర్మాణం ద్వారా విషాన్ని మన శరీరంలోకి ప్రవేశపెట్టేది.
అందుకే ఇకపై విషపూరిత జీవుల గురించి చదివేటప్పుడు లేదా విన్నప్పుడు ఈ రెండు పదాలు కనిపిస్తే, విషం శరీరంలోకి చేరే విధానాన్ని బట్టి వాటి మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు.