
పెట్రోల్ ధర పెరిగిందంటే చాలు... సామాన్య ప్రజల ఫ్యామిలీ బడ్జెట్‌పై వెంటనే ప్రభావం పడుతుంది. అందుకే ఈ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాయి... కొన్నిసార్లు తమ ట్యాక్సులను తగ్గించుకుని ప్రజలపై భారం పడకుండా చూస్తాయి. అయితే ఇక్కడ చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి... అసలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించేది ఎవరు? ఒక లీటర్ పెట్రోల్‌కు మనం చెల్లించే మొత్తం కేవలం క్రూడ్ ఆయిల్ ధర, రిఫైనింగ్ ఖర్చు మాత్రమే ఉంటాయా? కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు, పెట్రోల్ పంప్ డీలర్ కమిషన్, ఇతర ఖర్చులు కూడా కలుస్తాయా? ఒక్కో రాష్ట్రంలో పెట్రోల్ ధర ఒక్కోలా ఎందుకుంటుంది? అని. అందుకే ఇక్కడ పెట్రోల్ ధరల గురించి క్లారిటీగా తెలుసుకుందాం.
దేశంలో పెట్రోల్ అతి తక్కువ, అత్యధిక ధర కలిగిన ప్రాంతాలివే..
ప్రస్తుతం దేశంలో తక్కువ ధరకు పెట్రోల్ లభించే ప్రాంతాల్లో అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి. అక్టోబర్ 2026 అంటే ఈ నెలలో అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.88.66గా నమోదైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.117 ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య లీటర్‌కు దాదాపు రూ.29 తేడా కనిపిస్తోంది. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కు పైనే ఉంది.
మన పెట్రోల్ బంక్‌కు వెళ్లి ఒక లీటర్ పెట్రోల్‌కు చెల్లించే ధర వెనుక అనేక అంశాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర, రూపాయి-డాలర్ మారకం విలువ, రిఫైనింగ్ ఖర్చు, ఇంధనాన్ని డిపోల నుంచి పెట్రోల్ బంకులకు తరలించే ఖర్చు వంటి అంశాలు మొదట ప్రభావం చూపుతాయి.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విధించే VAT లేదా సేల్స్ ట్యాక్స్, పెట్రోల్ పంప్ డీలర్‌కు ఇచ్చే కమిషన్ వంటి అంశాలు తుది రిటైల్ ధరలో చేరతాయి. అందుకే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర ఒకటే అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వినియోగదారులు చెల్లించే ధర మాత్రం ఒకేలా ఉండదు.
ఇంధన ధరలు సాధారణంగా రోజువారీ డైనమిక్ ప్రైసింగ్ విధానంలో మారుతుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
బేస్ ధర..
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పి వంటి ఆయిల్ కంపెనీలో దేశంలో సరఫరా చేసే పెట్రోల్ కు బేస్ ప్రైజ్ నిర్ణయిస్తాయి. అన్ని రాష్ట్రాలకు ఇది ఒకేవిధంగా ఉంటుంది… ప్రస్తుతం 81-83 మధ్య ఉంది. ఇందులో క్రూడాయిల్ దిగుమతి, ఆయిల్ రిఫైనింగ్, ఆయిల్ రవాణా ఖర్చులన్నీ ఉంటాయి. అంటే పెట్రోల్ బంక్ వద్ద కనిపించే ధరలో మొత్తం డబ్బు ప్రభుత్వానికి వెళ్లదు. ఇంధనాన్ని తయారు చేసి వినియోగదారుడి వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చులు కూడా అందులో ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం ఎంత పన్ను వేస్తుంది?
పెట్రోల్ GST పరిధిలో లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ వంటి పన్నులు విధిస్తుంది. ప్రస్తుతం PPAC వివరాల ప్రకారం... పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ నిర్మాణంలో బేసిక్ ఎక్సైజ్, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్సు, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వంటి భాగాలు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే పన్ను భాగాలు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ పై సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రూ.12 కు అటుఇటుగా ఉంటోంది... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ పన్ను సేమ్ ఉంటుంది.
డీలర్ కమీషన్
ఇది పెట్రోల్ పంప్ ఓనర్ ఆదాయం. పెట్రోల్ బంక్ నిర్వహణ, సిబ్బంది జీతాలు, లాభాలు... ఇవన్నీ ఈ కమీషన్ ద్వారానే లభిస్తాయి. ప్రస్తుతం లీటర్ కు 4 నుండి 5 రూపాయలు డీలర్ కమీషన్ ఉంటుంది
రాష్ట్రాల పన్నులు...
పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై ప్రస్తుతం GST లేదు.. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో VAT లేదా సేల్స్ ట్యాక్స్, కొన్ని చోట్ల సెస్సులు వంటి పన్నులను విధిస్తాయి. ఇక్కడే రాష్ట్రాల మధ్య భారీ తేడా కనిపిస్తుంది.
ఉదాహరణకు PPAC తాజా వివరాల ప్రకారం.. అండమాన్ ఆండ్ అండ్ నికోబార్‌లో పెట్రోల్‌పై VAT 1 శాతంగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతం VATతో పాటు, రూ.1 రోడ్ డెవలప్‌మెంట్ సెస్సు, ఇతర పన్నులు ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్‌పై VAT 35.20 శాతంగా నమోదైంది. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్ పై రూ.19-22 వరకు పన్నులు ఉన్నాయి. అందుకే ధరలు ఎక్కువగా ఉన్నాయి.
పెట్రోల్ GST పరిధిలో లేకపోవడం కూడా ధరల చర్చలో తరచుగా ప్రస్తావనకు వస్తుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్, రాష్ట్రాలు VAT/సేల్స్ ట్యాక్స్ విధిస్తున్నాయి. GST అమలులోకి వస్తే పన్నుల నిర్మాణం మారుతుంది. అయితే GSTలోకి వస్తే పెట్రోల్ ధర తప్పకుండా తగ్గుతుంది.. అయితే ఇంత మొత్తానికి తగ్గుతుంది అని ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే తుది ధర ఏ GST రేటు, అదనపు సెస్సులు, ఇతర పన్నుల నిర్మాణం నిర్ణయిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఒక లీటర్ పెట్రోల్ ధర వెనుక కేవలం ముడి చమురు ధర మాత్రమే ఉండదు. క్రూడ్ ఆయిల్ + రిఫైనింగ్, రవాణా వంటి ఖర్చులు + కేంద్ర పన్నులు + రాష్ట్ర పన్నులు + డీలర్ కమిషన్ కలిసే వినియోగదారుడు చెల్లించే తుది ధర తయారవుతుంది. ఇందులో కేంద్ర పన్నులు దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్మాణంలో ఉన్నప్పటికీ రాష్ట్రాలు విధించే VAT, సెస్సులు మాత్రం ప్రాంతాన్ని బట్టి మారుతాయి. అండమాన్ అండ్ నికోబార్‌లో స్థానిక VAT కేవలం 1 శాతంగా ఉండటం, మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధిక VAT, సెస్సులు ఉండటం వల్లే రెండు ప్రాంతాల మధ్య పెట్రోల్ ధరలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.