పర్ఫ్యూమ్ ఎలా త‌యారు చేస్తారు.? ఎక్కువ సేపు వాస‌న ఉండ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా.?

Published : Sep 09, 2026, 05:25 PM IST

Perfume: మనలో చాలామంది రోజూ పరఫ్యూమ్‌ ఉపయోగిస్తుంటారు. మంచి సువాసన మనకు తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అయితే ఇంత‌కీ పర్ఫ్యూమ్‌ను ఎలా త‌యారు చేస్తారు? దీని వాస‌న ఎక్కువ‌సేపు ఉండేందుకు కార‌ణం ఏటో తెలుసా?

PREV
15
పర్ఫ్యూమ్‌లో ఏం కలుపుతారు?

పర్ఫ్యూమ్ తయారీలో ప్రధానంగా సువాసన ఇచ్చే పదార్థాలు, ఫిక్సేటివ్స్‌, ఇథనాల్‌ వంటి సాల్వెంట్‌ ఉపయోగిస్తారు. వీటిలో ప్రతి పదార్థానికి ప్రత్యేకమైన పని ఉంటుంది. సువాసన కలిగించే పదార్థాలే పర్ఫ్యూమ్‌కు అసలు వాసనను ఇస్తాయి. ఫిక్సేటివ్స్‌ ఆ వాసన ఎక్కువసేపు ఉండేలా సహాయపడతాయి. ఇక ఇథనాల్‌ సువాసన పదార్థాలను కరిగించి, పర్ఫ్యూమ్‌ను చర్మంపై స్ప్రే చేసుకునేలా చేస్తుంది.

25
సువాసన వచ్చే పదార్థాలు ఎలా తయారవుతాయి?

పర్ఫ్యూమ్‌కు వాసన అందించే పదార్థాలను ప్రధానంగా సహజమైనవి, సింథటిక్‌ పదార్థాలుగా చెప్పవచ్చు. సహజ సువాసన నూనెలను పూలు, పండ్లు, ఆకులు, చెక్క, మసాలా దినుసుల నుంచి సేకరిస్తారు. ఉదాహరణకు గులాబీ, చందనం, నిమ్మ వంటి వాటి నుంచి సువాసన నూనెలను తయారు చేస్తారు. వీటికి ప్రత్యేకమైన సహజ పరిమళం ఉంటుంది. మరోవైపు సింథటిక్‌ సువాసన పదార్థాలను ల్యాబొరేటరీల్లో వివిధ రసాయన ప్రక్రియల ద్వారా తయారు చేస్తారు. వీటిలో కొన్ని సహజ పదార్థాల వాసనను పోలి ఉంటాయి. వీటిని పెద్ద మొత్తంలో తయారు చేయడం సులభంగా ఉండటంతో చాలా పరఫ్యూమ్‌లలో ఉపయోగిస్తారు.

35
పర్ఫ్యూమ్‌లో ఫిక్సేటివ్స్‌ ఎందుకు ఉప‌యోగిస్తారు.?

పరఫ్యూమ్‌ వాసన ఎక్కువసేపు ఉండటానికి ఫిక్సేటివ్స్‌ కీలకంగా పనిచేస్తాయి. సువాసన నూనెలు చాలా త్వరగా ఆవిరైపోయే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే పర్ఫ్యూమ్‌కు రాసిన కొద్దిసేపటికే వాసన తగ్గిపోకుండా ఫిక్సేటివ్స్‌ ఉపయోగిస్తారు. ఇవి సువాసన పదార్థాలు ఒక్కసారిగా ఆవిరైపోకుండా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. గతంలో సహజ పదార్థాలతో తయారైన కొన్ని ఫిక్సేటివ్స్‌ను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఎక్కువగా సింథటిక్‌ ఫిక్సేటివ్స్‌ను వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్ఫ్యూమ్‌కు వాసన ఎక్కువసేపు ఉండేలా చేయవచ్చు.

45
పర్ఫ్యూమ్‌లో ఇథ‌నాల్ పాత్ర ఏంటి.?

పర్ఫ్యూమ్ తయారీలో ఇథనాల్‌కు చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సువాసన నూనెలను నేరుగా చర్మంపై ఉపయోగించడం వల్ల అవి చాలా గాఢంగా ఉండటంతో అసౌకర్యం కలగవచ్చు. అందుకే వాటిని ఇథనాల్‌లో కలిపి పలుచగా చేస్తారు. ఇథనాల్‌ సువాసన పదార్థాలను బాగా కరిగించి, పర్ఫ్యూమ్‌ను సులభంగా స్ప్రే చేసుకునే ద్రవంగా మారుస్తుంది. చర్మంపై స్ప్రే చేసిన తర్వాత ఇథనాల్‌ త్వరగా ఆవిరైపోతుంది. దీంతో సువాసన పదార్థాలు చర్మంపై మిగిలి, వాటి పరిమళం గాలిలోకి వ్యాపించడం ప్రారంభమవుతుంది.

అంతేకాకుండా పర్ఫ్యూమ్‌లోని కొన్ని పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఉండటానికి కూడా ఇథనాల్‌ సహాయపడుతుంది. అయితేపర్ఫ్యూమ్‌లో ఇథనాల్‌ శాతం అన్ని ఉత్పత్తుల్లో ఒకేలా ఉండదు. తయారీ విధానం, పరఫ్యూమ్‌ రకం, సువాసన నూనెల శాతం ఆధారంగా మారుతుంది.

55
మార్కెట్‌లో ఉండే పర్ఫ్యూమ్‌ల మ‌ధ్య తేడా..

మార్కెట్‌లో Eau de Parfum (EDP), Eau de Toilette (EDT) వంటి పేర్లతో వివిధ రకాల పరిమళ ఉత్పత్తులు కనిపిస్తాయి. వీటి మధ్య ప్రధాన తేడా సువాసన పదార్థాల సాంద్రతలో ఉంటుంది. సువాసన నూనెల శాతం ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు సాధారణంగా గాఢమైన పరిమళాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంటుంది. అదే సువాసన నూనెల శాతం తక్కువగా ఉన్న ఉత్పత్తులు తేలికైన పరిమళాన్ని ఇస్తాయి. వాటి వాసన తక్కువ సమయంలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

అందుకే పర్ఫ్యూమ్‌ బాటిల్‌లో ఉండేది కేవలం సువాసన నూనె మాత్రమే కాదు. సువాసన పదార్థాలు, ఫిక్సేటివ్స్‌, ఇథనాల్‌ వంటి పదార్థాల సరైన మిశ్రమంతోనే ఇది తయారవుతుంది. ముఖ్యంగా సువాసనను కరిగించడం, చర్మంపై సులభంగా స్ప్రే అయ్యేలా చేయడం, పరిమళం త్వరగా వ్యాపించేందుకు ఇథనాల్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories