
Smartest Animal : భూమిపై అత్యంత తెలివి కలిగిన జీవి మనిషి. తన తెలివితేటలతో అడవిలో ఆకులు కట్టుకుని గుహల్లో జీవించే స్థాయినుండి ఇప్పుడు కూడు,గూడు, గుడ్డతో పాటు సకల సౌకర్యాలను ఏర్పాటుచేసుకునే స్థాయికి ఎదిగాడు. అయితే మనిషి అంత కాకున్నా కొంచెం తెలివితేటలు ప్రదర్శించే జంతువులు కొన్ని ఉన్నాయి... వాటి స్కిల్స్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి జీవుల్లో కోతి జాతికి చెందిన ఒరంగుటాన్స్ ఒకటి.
ఒరంగుటాన్స్ ఎక్కడ కనిపిస్తాయి?
ఆసియా ఖండంలో మాత్రమే కనిపించే కోతులు ఈ ఒరంగుటాన్స్. వీటి డిఎన్ఏ దాదాపు 97 శాతం మానవులతో మ్యాచ్ అవుతుందట. అందుకే మనిషిలా తెలివితేటలు ప్రదర్శిస్తుంటని జంతుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. వీటిని 'అడవి మనుషులు' అనికూడా అంటారు.
ప్రధానంగా ఈ ఒరంగుటాన్స్ ఇండోనేషియాలోని సుమత్రా, మలేషియాలోని బోర్నియా ద్వీపాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా వర్షారణ్యాల్లో మాత్రమే జీవిస్తాయి. ప్రస్తుతం అంతరించిపోతున్న జీవజాతుల్లో ఈ ఒరంగుటాన్స్ కూడా ఉన్నాయి. వివిధ కారణాలతో వీటి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది.
మనం వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు వాడతాం. సేమ్ ఇలాగే ఒరంగుటాన్స్ కూడా వర్షం నుండా కాపాడుకునేందుకు సహజసిద్దమైన గొడుగును తయారుచేసుకుంటాయి. వర్షారణ్యాల్లో జీవించే ఇవి పరిస్థితులకు తగ్గట్లుగా తమ జీవన విధానాన్ని మార్చుకున్నాయి. నిత్యం కురిసే వర్షాలనుండి తప్పించుకునేందుకు అడవిలోని చెట్ల ఆకులను గొడుగులా వాడతాయి.
ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకోగానే ఒరంగుటాన్స్ అలర్ట్ అవుతాయి. అప్పటికప్పడు అడవిలోని పెద్దపెద్ద ఆకులను సేకరిస్తాయి.. వర్షం మొదలవగానే వాటిని తలపై పెట్టుకుని చెట్ల కొమ్మలపైనే ముడుచుకుని కూర్చుంటాయి. ఇలా వర్షంలో తడవకుండా జాగ్రత్త పడతాయి.
ఒరంగుటాన్స్ ఆకులను గొడుగులా మార్చుకుని వర్షం నుండి రక్షణ పొందినట్లే అడవిలో దొరికే కర్రలను అహారం కోసం ఉపయోగిస్తాయి. ఇవి పండ్లనే కాదు చిన్నచిన్న పురుగులను కూడా తింటాయి. ఇలా చెట్ల రంధ్రాల్లో ఉండే చెద పురుగులను బయటకు తీసేందుకు ఇవి కర్ర పుల్లలను ఉపయోగిస్తాయి. సన్నని పుల్లల సాయంతో చెట్ల రంధ్రాల్లోంచి పురుగులను బయటకు తీసి తింటుంటాయి. ఇలా తెలివిగా అహారాన్ని సంపాదించుకుంటాయి.
ఒరంగుటాన్స్ ప్రధాన అహారం పండ్లు. అడవిలో దొరికే వివిధ రకాల పండ్లను ఇవి తింటాయి. అయితే ఇలా పండ్లను తిని అందులోని విత్తలాలను అడవిలో వ్యాప్తి చేస్తాయి... తద్వారా మొక్కల పెరుగులకు తోడ్పడతాయి. ఇలా అడవుల విస్తరణకు సహాయపడే ఈ జీవులను ‘అడవి తోటమాలి (Gardeners of Forest)’ అని కూడా అంటారు.
ఒరంగుటాన్స్ కు వైద్యం కూడా తెలుసట... అంటే ఇవి చదువుకోని డాక్టర్లు అన్నమాట. నిత్యం చెట్లపైనే ఉండే ఈ జీవులు కొన్నిసార్లు గాయాలకు గురవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇవి కొన్ని రకాల ఆకులతో సొంతంగా పసరు వైద్యం చేసుకుంటాయట.
మెడిసినల్ గుణాలున్న ఆకులను పసరుగా చేసి తన లాలాజలంతో కలిసి గాయాలు, శరీరంలో నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో పూసుకుంటాయి. ఇలా సొంతవైద్యంతో తొందరగా గాయాలనుండి ఉపశమనం పొందుతాయట. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఒరంగుటాన్స్ ఉపయోగించే ఆకులను అడవుల్లో ఉండే ప్రజలు కూడా ఉపయోగిస్తారు.
ఇవి చెట్లమీదే ఎక్కువగా ఉంటాయి... నేలపైకి రావడానికి ఇష్టపడవట. రాత్రి చెట్ల కొమ్మలపై ఆకులను పర్చుకుని అక్కడే నిద్రపోతాయి. మిగతా కోతి జాతుల్లా గుంపులుగా కాకుండా ఇవి ఒంటరిగానే జీవిస్తాయి. ఆడ ఒరంగుటాన్స్ 3 నుండి 5 సంవత్సరాలకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది... అందుకే వీటి జనాభా పెద్దగా పెరగడంలేదు. అంతేకాదు అడవుల నరికివేత, అక్రమ రవాణా కారణంగా ఈ అరుదైన కోతిజాతి ఒరంగుటాన్స్ జనాభా బాగా తగ్గుతోంది.