కేవలం రూ.22,000 పెట్టుబడితో రోజుకు లక్ష, నెలకు రూ.30 లక్షలా..! ఇలాంటి ప్రభుత్వ పథకం ఉందా?

Published : Jul 11, 2026, 12:51 PM ISTUpdated : Jul 11, 2026, 12:58 PM IST

సైబర్ నేరగాళ్లు మరింత ముదిరిపోయారు... ఏకంగా ప్రధాని, ఆర్థిక మంత్రి ఏఐ వీడియోలతో భారీ మోసాలకు తెరతీశారు. కేవలం రూ.22,000 పెట్టుబడితో నెలకు రూ.30 లక్షలు సంపాదించవచ్చనే ఆశ చూపించి డబ్బులు దండుకునేందుకు సిద్దమయ్యారు.  

PREV
15
బరితెగించిన సైబర్ కేటుగాళ్ళు... ఆర్థిక మంత్రిని వదల్లేదుగా..!

టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలూ ఎక్కువ అవుతున్నాయి... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దీనికి మినహాయింపు కాదు. ఇటీవల కాలంలో ప్రజల్లో AI వాడకం పెరిగింది... ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు కూడా ఏఐ సాయంతో మోసాలకు తెరతీశారు. ఏకంగా ప్రభుత్వ పథకాల పేరిట.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ వీడియోలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా తాజాగా సోషల్ మీడియాలో ఓ నకిలీ ఇన్వెస్ట్మెంట్ వీడియో చక్కర్లు కొడుతోంది.

25
ఇది సైబర్ నేరగాళ్ల నయా మోసం...

సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంక్ అధికారుల పేరిట అకౌంట్ వివరాలు సేకరించి డబ్బులు కాజేశారు. ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది... అందుకే AI టెక్నాలజీ సాయంతో కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేరిట చిన్న పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ ప్రచారం చేస్తున్నారు... వీళ్లు ప్రకటించినట్లుగా నకిలీ వీడియోలను AI సాయంతో రూపొందిస్తున్నారు. ఇలా తాజాగా ఆర్థిక మంత్రి రూ.22,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.1 లక్ష ఆదాయం పొందవచ్చని ప్రకటించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది.

ఇలా నెలకు ఒకటి రెండు కాదు ఏకంగా రూ.30 లక్షలు సంపాదించవచ్చు అని నిర్మలా సీతారామన్ హామీ ఇస్తున్నట్లు నమ్మిస్తున్నారు కేటుగాళ్లు. వెంటనే రూ.22,000 పెట్టుబడి పెట్టేవారికే ఈ అవకాశం అని చెప్పి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా మోసగించే పన్నాగం పన్నారు. ప్రభుత్వ పథకం అంటున్నారు... ప్రధాని, ఆర్థిక మంత్రి హామీ ఇస్తున్నారు అని నమ్మి డబ్బులు చెల్లించారో మోసపోయినట్లే. ఇది సైబర్ కేటుగాళ్లు ఏఐ సాయంతో మోసం చేసేందుకు రూపొందించిన వీడియో అని గుర్తించాలి. ఇటువంటి ప్రచారాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి... ఇది పూర్తిగా మోసపూరిత పథకం.

35
PIB Fact Check క్లారిటీ..

ప్రధాని మోదీ, మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై ప్రభుత్వ విభాగం పిఐబి క్లారిటీ ఇచ్చింది. ఇది AI-ఆధారిత నకిలీ వీడియో అని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గానీ, భారత ప్రభుత్వం గానీ అటువంటి ఏ పెట్టుబడి పథకాన్ని లేదా ప్లాట్‌ఫారమ్‌ను ఆమోదించలేదని తెలిపింది. ఇలా ప్రజలతో పెట్టుబడులు పెట్టించే పథకమేదీ లేదు.. ఇలాంటి పథకాలను ప్రభుత్వ ప్రోత్సహించదని PIB వెల్లడించింది. మోసగాళ్లు ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి ప్రముఖుల నకిలీ వీడియోలను వాడుతుంటారు... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

45
ప్రజలారా మోసపోకండి..

మోసగాళ్లు తరచుగా కృత్రిమ మేథస్సు (AI)తో సృష్టించిన కంటెంట్, నకిలీ వీడియోలు, అధిక రాబడుల వాగ్ధానాలతో ప్రజలను మోసం చేస్తుంటారు. రోజుకు లక్ష రూపాయలు లేదా నెలకు ముప్పై లక్షల రూపాయల వంటి తప్పుడు రాబడి వాగ్ధానం చేసే పథకాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పెట్టుబడి పథకమైనా నిజంగా అంత తక్కువ సమయంలో, అంత ఎక్కువ రాబడిని ఇవ్వదు. ఇలాంటి ప్రకటనలు కేవలం మోసపూరితమైనవి మాత్రమే. త్వరితగతిన ధనవంతులు కావాలనే ఆశ ప్రజలను మోసాల బారిన పడేలా చేస్తుంది.

ఎప్పుడూ పెట్టుబడి పెట్టడానికి ముందు లేదా వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు అధికారిక సమాచారాన్ని ధృవీకరించడం చాలా ముఖ్యం. PIB వంటి అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నకిలీ వార్తలను, మోసాలను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేస్తాయి. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లేదా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బిఐ వంటి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను మాత్రమే నమ్మాలి. అవాస్తవమైన లాభాలను వాగ్ధానం చేసే ఎటువంటి పథకాలను ప్రభుత్వం ఆమోదించదు.  

55
మోసాలను నిరోధించండి

ఆన్‌లైన్‌ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి… తప్పుడు సమాచారం, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను నిరోధించడానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. అటువంటి అనుమానాస్పద లేదా తారుమారు చేయబడిన కంటెంట్‌ మీ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. PIB కి చెందిన +91 8799711259 వాట్సాప్ నంబర్‌కు లేదా factcheck@pib.gov.in అనే ఇమెయిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదు ఎందరినో మోసాల బారి నుండి కాపాడుతుంది. ఇలాంటి మోసాలను అరికట్టడంలో మనమంతా భాగస్వాములమవుదాం.

Read more Photos on
click me!

Recommended Stories