Rudraksha Health Benefits : అసలు రుద్రాక్ష అంటే ఏమిటి? దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? దీన్ని మెడలో ధరించడం ద్వారా కలిగే ఆద్యాత్మిక, మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల మెడలో రుద్రాక్ష మాల ధరించేవారి సంఖ్య పెరుగుతోంది. ఇది అలంకారంగానే కాకుండా భక్తిని వ్యక్తపరుస్తుంది. రుద్రాక్ష అంటే కేవలం ఒక విత్తనం కాదు, అది పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. శివుని అనుగ్రహం పొందడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి భక్తులు రుద్రాక్షను ధరిస్తారు. అంతేకాదు దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి రుద్రాక్ష విశేషాలు, పురాణ గాథలు, ఆరోగ్య ప్రయోజనాలు, ధరించే నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
ఏమిటీ రుద్రాక్ష?
హిందూమతంలో శివుడికి సంబంధించిన ఎన్నో పవిత్రమైన వస్తువులు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో రుద్రాక్ష ఒకటి. సైన్స్ ప్రకారం రుద్రాక్ష అనేది 'ఎలయోకార్పస్ గనిట్రస్' (Elaeocarpus ganitrus) అనే చెట్టు నుండి లభించే ఒక ప్రత్యేకమైన విత్తనం. ఈ చెట్లు నేపాల్, భారత్, ఇండోనేషియా, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి. రుద్రాక్షను శివుడి ఆభరణంగా భావిస్తారు.
మత విశ్వాసాల ప్రకారం... రుద్రాక్ష ధరించడం శివుడిపై భక్తికి చిహ్నం. చాలామంది పూజ, జపం, ధ్యానం చేసేటప్పుడు దీనిని ధరిస్తారు. ఇది మనసుకు శాంతినిచ్చి, ఆధ్యాత్మిక సాధనలో ఏకాగ్రతను పెంచుతుంది. రుద్రాక్ష ధరిస్తే బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, థైరాయిడ్, గుండె జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా నమ్ముతారు.
36
రుద్రాక్ష గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి?
పురాణాల ప్రకారం.. ఒకప్పుడు భద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు. జ్యోతిష్యులు ఆ బాలుడి ఆయుష్షు చాలా తక్కువని రాజుకు చెప్పారు. దీనికి పరిష్కారంగా 'మీ కొడుకుకు శివుడికి ఇష్టమైన రుద్రాక్షను ధరింపజేయండి. దానివల్ల మృత్యు గండం తొలగిపోవచ్చు' అని సలహా ఇచ్చారు. రాజు అలాగే చేశాడు. రుద్రాక్ష ప్రభావంతో భద్రసేనుడి కొడుకు దీర్ఘాయుష్షు పొందాడు. తండ్రిలాగే తను కూడా చక్రవర్తి అయ్యాడు.
ఇక శివ సంప్రదాయాల ప్రకారం... రుద్రాక్ష శివుడి కన్నీళ్ల నుండి పుట్టింది. అందుకే దీన్ని పవిత్రంగా భావిస్తారు. చాలామంది భక్తులు పూజలు, మంత్ర జపాలు, మతపరమైన కార్యక్రమాలలో రుద్రాక్ష మాలను ఉపయోగిస్తారు. శైవ మతాన్ని అనుసరించేవారు తప్పకుండా రుద్రాక్ష ధరిస్తారు. మరణ సమయంలో రుద్రాక్ష ధరించి ఉంటే, ఆ వ్యక్తి ఆత్మ శివలోకానికి వెళ్తుందని ఒక నమ్మకం.
అసలైన రుద్రాక్షలో ముఖాలు (సహజ గీతలు) పైనుంచి కింద వరకు ఉంటాయి. అవి మధ్యలో విరిగినట్లు ఉంటే నకిలీ కావచ్చు.
అసలైన రుద్రాక్ష మరీ మెరవదు, కానీ నకిలీది నునుపుగా, మెరుస్తూ ఉంటుంది.
మీరు ఖరీదైన లేదా అరుదైన రుద్రాక్ష కొంటుంటే ఎక్స్-రే టెస్ట్ ద్వారా కూడా అసలు, నకిలీని గుర్తించవచ్చు.
అసలైన రుద్రాక్ష బరువు తక్కువగా ఉండి నీటిపై తేలుతుంది. నకిలీది బరువుగా ఉండి నీటిలో మునిగిపోతుంది.
56
ఎన్ని ముఖాల రుద్రాక్షలు ఉంటాయి?
రుద్రాక్షపై ఉండే గీతలను 'ముఖాలు' అంటారు. మార్కెట్లో ఏకముఖి నుండి అనేక ముఖాల రుద్రాక్షలు దొరుకుతాయి. ప్రతి ముఖి రుద్రాక్షకు వేర్వేరు ఫలితాలు ఉంటాయి. పంచముఖి (5 ముఖాలు) రుద్రాక్షను ఎక్కువ మంది ధరిస్తారు. శివ మహాపురాణంలో ప్రతి రుద్రాక్ష ప్రాముఖ్యత, మంత్రాల గురించి వివరంగా ఉంది.
66
రుద్రాక్ష ఎలా ధరించాలి? ఏ నియమాలు పాటించాలి?
భగవంతుడిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించవచ్చు. కానీ ధరించిన తర్వాత కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే చెడు ఫలితాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
రుద్రాక్ష ధరించాక మాంసం, మందు సేవించకూడదు.
మహిళలు రుతుక్రమ సమయంలో దీనిని తీసివేయాలి.
రుద్రాక్ష ధరించిన వారు సాత్విక జీవనం గడపాలి.
రుద్రాక్ష ఎలా ధరించాలి?
రుద్రాక్ష ధరించే ముందు దాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలి. తర్వాత శివలింగం ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత శ్రద్ధగా ధరించాలి. ధరించేటప్పుడు 'ఓం నమః శివాయ' లేదా 'ఓం రుద్రాయ నమః' మంత్రాన్ని జపిస్తే మరింత శుభప్రదం. సోమవారం లేదా మహాశివరాత్రి వంటి శుభదినాన రుద్రాక్ష ధరిస్తే అది ఇంకా ఎక్కువ ఫలితాలనిస్తుంది.