
అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతుండేవాడు. వ్యాపారం చిన్నదే అయినా.. అతని మనసు మాత్రం చాలా పెద్దది. ఎవరు తన దగ్గరకు వచ్చినా ఆప్యాయంగా మాట్లాడేవాడు. అవసరంలో ఉన్నవారికి వీలైనంత సాయం చేసేవాడు. అదే గ్రామంలో రవి అనే వ్యక్తి ఉండేవాడు. అతను తరచూ శ్రీనివాస్ దుకాణానికి వచ్చి ఇంటికి కావాల్సిన సరుకులు కొనేవాడు. బియ్యం, పప్పులు, నూనె, చక్కెర ఇలా అవసరమైన వస్తువులన్నీ అక్కడే తీసుకునేవాడు. రవి దగ్గర ఆ సమయంలో డబ్బులు లేకపోయినా శ్రీనివాస్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు కాదు. కొనుగోలు చేసిన సరుకుల వివరాలను ఒక చిన్న పుస్తకంలో రాసి, ఆ పుస్తకాన్ని రవి దగ్గరే ఉంచుకునేవాడు. నెలాఖరులో రవి ఆ పుస్తకం తీసుకొచ్చి లెక్క చూసుకుని మొత్తం డబ్బులు చెల్లించేవాడు. అలా కొంతకాలం ఇద్దరి మధ్య మంచి నమ్మకం ఏర్పడింది.
రోజులు గడుస్తున్న కొద్దీ రవిలో ఓ చెడు ఆలోచన మొదలైంది. ‘సరుకుల లెక్క రాసే పుస్తకం నా దగ్గరే ఉంది కదా.. అందులో కొన్ని పేజీలు తీసేస్తే శ్రీనివాస్‌కు ఎలా తెలుస్తుంది?’ అని ఆలోచించాడు. మొదట ఆ ఆలోచన వచ్చినప్పుడు రవి మనసులో కొంత భయం కలిగింది. కానీ డబ్బు ఆదా అవుతుందనే ఆశ ఆ భయాన్ని మించిపోయింది. ఒకరోజు శ్రీనివాస్ దుకాణం నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత రవి తన దగ్గరున్న లెక్కల పుస్తకాన్ని తీసుకున్నాడు. అందులో తాను ఎక్కువ సరుకులు తీసుకున్న వివరాలు ఉన్న కొన్ని పేజీలను చింపేశాడు. నెలాఖరులో పుస్తకం తీసుకెళ్లి చూసినప్పుడు లెక్క తక్కువగా కనిపించింది. దాంతో తాను చెల్లించాల్సిన దానికంటే తక్కువ డబ్బు ఇచ్చాడు. ఎవరూ గుర్తించలేదని రవి చాలా సంతోషించాడు. అదే అతని పెద్ద తప్పుకు మొదటి అడుగైంది.
ఒక్కసారి చేసిన మోసం బయటపడకపోవడంతో రవికి ధైర్యం పెరిగింది. ఆ తర్వాత ప్రతి నెలా అదే పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టాడు. శ్రీనివాస్ దగ్గర ఎక్కువ సరుకులు తీసుకునేవాడు. వాటి వివరాలు పుస్తకంలో రాసించుకునేవాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు అనుకూలంగా కొన్ని పేజీలు చించేసేవాడు. నెలాఖరులో తక్కువ మొత్తాన్ని చెల్లించేవాడు. ఇలా చేయడం వల్ల ప్రతి నెలా కొంత డబ్బు మిగులుతోందని రవి భావించాడు. కానీ తనకు తెలియకుండానే మరో విషయం కోల్పోతున్నాడు. అదే నమ్మకం. మరోవైపు శ్రీనివాస్‌కు మాత్రం ఏదో తేడాగా అనిపించడం మొదలైంది. ‘రవి ఈ మధ్య ఎక్కువ సరుకులు తీసుకెళ్తున్నాడు. కానీ నెలాఖరులో మాత్రం తక్కువ డబ్బులు ఇస్తున్నాడు. అసలు లెక్కలో ఏదైనా తేడా జరుగుతోందా?’ అని అనుమానించాడు. నేరుగా రవిని అడిగితే అతను తప్పించుకునే అవకాశం ఉందని భావించిన శ్రీనివాస్.. నిజాన్ని తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
మరుసటి రోజు రవి ఎప్పటిలాగే సరుకులు కొనడానికి శ్రీనివాస్ దుకాణానికి వచ్చాడు. శ్రీనివాస్ ఆ రోజు రవి తీసుకున్న వస్తువులన్నింటినీ లెక్కల పుస్తకంలో రాశాడు. అయితే ఈసారి ప్రతి పేజీ మూలలో వరుస క్రమంలో కనిపించీ కనిపించనట్లుగా కొన్ని సంఖ్యలు వేశాడు. రవి మాత్రం ఆ విషయాన్ని గమనించలేదు. ఎప్పటిలాగే పుస్తకాన్ని తీసుకుని ఇంటికి వెళ్లాడు. తనకు అలవాటైన విధంగా రెండు పేజీలు చించేశాడు. నెలాఖరులో పుస్తకాన్ని తీసుకుని శ్రీనివాస్ దగ్గరకు వచ్చి తక్కువ మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించాడు. శ్రీనివాస్ పుస్తకం తీసుకుని పేజీలను చూశాడు. మధ్యలో కనిపించకుండా పోయిన సంఖ్యలను గమనించాడు. అప్పుడు రవి చేసిన మోసం పూర్తిగా అర్థమైంది. శ్రీనివాస్ కోపంతో పెద్దగా గొడవ చేయలేదు. రవిని చూస్తూ ఇలా అన్నాడు.. ‘నిన్ను నమ్మి లెక్కల పుస్తకం నీ దగ్గరే పెట్టాను. ఆ నమ్మకాన్ని ఇలా మోసం చేస్తావని నేను ఊహించలేదు. డబ్బు నష్టం అయితే ఎప్పుడో ఒకప్పుడు తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. ఇక నుంచి నువ్వు నా దుకాణానికి వచ్చినా.. నన్ను చూసిన ప్రతిసారీ ఏదో తప్పు చేసిన వ్యక్తిలా తలదించుకోవాల్సి వస్తుంది. నీకు వచ్చిన చిన్న లాభం కోసం నీ మనశ్శాంతిని నువ్వే పోగొట్టుకున్నావు.’
శ్రీనివాస్ మాటలు రవి మనసును బలంగా తాకాయి. తాను సంపాదించింది డబ్బు కాదని.. ఒకరి నమ్మకాన్ని కోల్పోయానని అతనికి అర్థమైంది. ఇప్పటివరకు చేసిన మోసం గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు. వెంటనే శ్రీనివాస్‌ను క్షమించమని కోరాడు. ఇంతకుముందు తక్కువగా చెల్లించిన డబ్బులన్నింటినీ లెక్కకట్టి పూర్తిగా తిరిగి చెల్లించాడు. ‘డబ్బు కోసం ఇంత పెద్ద తప్పు చేశాను. నన్ను నమ్మిన వ్యక్తిని మోసం చేశాను. ఇకపై ఎప్పుడూ ఇలా చేయను’ అని రవి చెప్పాడు. శ్రీనివాస్ అతన్ని క్షమించాడు. కానీ గతంలో ఉన్న నమ్మకం మాత్రం తిరిగి రాలేదు. ఆ రోజు తర్వాత రవి ఎప్పుడూ శ్రీనివాస్ దుకాణానికి వెళ్లలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన ప్రతిసారీ తాను చేసిన తప్పు గుర్తుకొచ్చేది. తాను చేసిన మోసం వల్ల వచ్చిన పశ్చాత్తాపం అతన్ని వెంటాడుతూనే ఉండేది.
నమ్మకం అనేది డబ్బు కంటే విలువైంది. ఎదుటివారిని మోసం చేసి పొందిన లాభం ఎంత చిన్నదైనా.. దాని కోసం కోల్పోయే నమ్మకం మాత్రం చాలా పెద్దది. ఒకరి నమ్మకాన్ని దెబ్బతీస్తే ఎదుటివారికి నష్టం కలిగించడమే కాదు.. మనలోని ప్రశాంతతను కూడా మనమే కోల్పోతాం. అందుకే ఎంతటి పరిస్థితి వచ్చినా మోసానికి దూరంగా ఉండాలి. నిజాయితీగా జీవిస్తే మనసుకు ఎప్పుడూ భయం ఉండదు.