Motivational story: అన్న‌ద‌మ్ములంటే ఇలా ఉండాలి.. ఈ త‌రం వాళ్లు క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌

Published : Jul 16, 2026, 07:14 PM IST

Motivational story: క‌థ‌లు మ‌న ఆలోచ‌న విధానాన్ని, జీవ‌న విధానాన్ని మారుస్తాయి. చిన్న క‌థ‌లే అయినా జీవితానికి స‌రిప‌డ సందేశాన్ని అందిస్తాయి. అలాంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చే క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు.. ప్రాణంలా పెరిగిన బాల్యం

వెంక‌టాద్రిపురం అనే గ్రామంలో శ్రీమ‌న్‌, మేథాన్ష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నతనం నుంచి ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం. అన్న కష్టపడితే తమ్ముడు పక్కనే ఉండేవాడు. తమ్ముడికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అన్న వెంటనే ఆదుకునేవాడు. గ్రామంలో వాళ్ల అనుబంధం చూసి అందరూ "ఇలాంటివాళ్లు అరుదు" అని మెచ్చుకునేవారు.

కాలక్రమేణా ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. కొంతకాలానికే తల్లిదండ్రులు చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ వాళ్ల భుజాలపై పడ్డాయి. కలిసి వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవించారు. శ్రీమన్ కి ఇద్దరు పిల్లలు పుట్టారు. మేథాన్ష్ కిి మాత్రం సంతానం కలగలేదు. అయినా ఇద్దరి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు.

25
భార్యల మధ్య గొడవలు

రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి భార్యల మధ్య చిన్నచిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు క్రమంగా పెద్దవిగా మారాయి. ఇంట్లో ప్రశాంతత లేకపోవడంతో గ్రామ పెద్దలు ఇద్దరూ విడిగా ఉండాలని సూచించారు. అన్నదమ్ములు కూడా భార్యల మనసు నొప్పించకుండా పొలాలను, ఇంటిని సమానంగా పంచుకున్నారు. కానీ వారు పంచుకున్నది ఆస్తి మాత్రమే... మనసులు మాత్రం కాదు. ఉదయం పొలంలో కలుసుకునేవారు. సాయంత్రం కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా పరుగెత్తేది మరో సోదరుడే.

35
తమ్ముడి మనసులో అన్నపై ప్రేమ... అన్న మనసులో తమ్ముడిపై బాధ్యత

పంట చేతికొచ్చిన ప్రతిసారీ మేథాన్ష్ ఒక ఆలోచన చేసేవాడు. "అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల భవిష్యత్తు కోసం ఇంకా ఎక్కువ ధాన్యం అవసరం. నాకు పిల్లలు లేరు. నా అవసరాలు కూడా తక్కువే". అని భావించి, అర్థరాత్రి ఎవరూ చూడకుండా తన ధాన్యపు బస్తాల్లో నుంచి పది బస్తాలను తీసుకుని అన్నయ్య గాదెలో వేసి వచ్చేవాడు.

45
అదే సమయంలో శ్రీమ‌న్‌ కూడా మరోలా ఆలోచించేవాడు.

"నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. రేపు వాళ్లు నన్ను చూసుకుంటారు. కానీ నా తమ్ముడికి పిల్లలు లేరు. వృద్ధాప్యంలో అతడికి తోడు ఎవరు? అతడికే ఎక్కువ ధాన్యం ఉండాలి."అని భావించి, రాత్రివేళ తమ్ముడికి తెలియకుండా పది బస్తాల ధాన్యాన్ని అతని గాదెలో వేసి వచ్చేవాడు. ఇలా ఇద్దరూ ఒకరి కోసం మరొకరు త్యాగం చేస్తూ... ఎవరికీ తెలియకుండా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.

55
ఆ రాత్రి జరిగిన సంఘటన... ఇద్దరి కళ్లలో నీళ్లు తెప్పించింది

ఒక పౌర్ణమి రాత్రి... ఇద్దరూ మామూలుగానే తమ తమ గాదెల నుంచి ధాన్యపు బస్తాలు మోసుకుని బయలుదేరారు. మధ్య దారిలో ఇద్దరూ ఎదురుపడ్డారు. చేతుల్లో బస్తాలు... ముఖాల్లో ఆశ్చర్యం. "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని ఒకేసారి ఇద్దరూ అడిగారు. కొద్దిసేపటికే అసలు విషయం ఇద్దరికీ అర్థమైంది. తమ్ముడు అన్న కోసం ధాన్యం తీసుకెళ్తున్నాడు... అన్న తమ్ముడి కోసం ధాన్యం తీసుకెళ్తున్నాడు. ఆ క్షణంలో ఇద్ద‌రి నోట మాట‌లు రాలేదు. ఇద్దరి కళ్లలో ఆనందబాష్పాలు నిండిపోయాయి. బస్తాలను కింద పెట్టి గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు కూడా కంటతడి పెట్టారు. నిజమైన ప్రేమ అంటే ఇదేనని, బంధం అంటే ఇదేనని అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

కథ చెప్పే గొప్ప సందేశం...

ఈ రోజుల్లో ఆస్తుల కోసం అన్నదమ్ములు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ ఈ కథ మాత్రం మనకు మరో సత్యాన్ని గుర్తు చేస్తుంది. నిజమైన సంపద ధనం కాదు... బంధం. ప్రేమతో ఇచ్చిన చిన్న సహాయం కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుంది. కుటుంబాన్ని నిలబెట్టేది ఆస్తి కాదు... పరస్పర నమ్మకం, త్యాగం, అనురాగం. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని అధిగమించవచ్చు. ఒకరి సంతోషాన్ని మరొకరు తమ సంతోషంగా భావించినప్పుడే కుటుంబం స్వర్గంలా మారుతుంది. నీకు ఎంత ఉందనేది ముఖ్యం కాదు... నీ దగ్గర ఉన్నదాంట్లో ఎంత ప్రేమను పంచుకున్నావన్నదే జీవితానికి అసలు అర్థం.

Read more Photos on
click me!

Recommended Stories