2026 ఇండెక్స్‌లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్ వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నగరం 100కు గాను 98 పాయింట్లు సాధించింది. స్టెబిలిటీ, ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో 100కు 100 పర్ఫెక్ట్ స్కోర్ సాధించడం విశేషం. హెల్త్‌కేర్‌లో 96, కల్చర్‌లో 95 పాయింట్లు రాబట్టి అత్యుత్తమ ప్రజాసేవలు, భద్రతకు నిదర్శనంగా నిలిచింది.
రెండో స్థానంలో ఆస్ట్రియా రాజధాని వియన్నా 97.1 స్కోరుతో నిలిచింది. గతంలో పలుమార్లు తొలి స్థానంలో నిలిచిన వియన్నా, ఈసారి కూడా తన అద్భుతమైన అర్బన్ మేనేజ్‌మెంట్, మౌలిక వసతులతో టాప్-2లో కొనసాగుతోంది. ఇక మూడు, నాలుగు స్థానాలను ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలు సాధించాయి. మెల్‌బోర్న్ మూడో స్థానంలో నిలవగా, సిడ్నీ నాల్గో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మూడు నగరాలు టాప్ 10లో ఉండటం విశేషం.
ఐదో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన జూరిచ్, ఆరో స్థానంలో జెనీవా నిలిచాయి. సంస్కృతి, పర్యావరణ విభాగాల్లో స్కోరు కాస్త తగ్గడంతో ఈ రెండు నగరాలు ఒక్కో మెట్టు కిందకు దిగాయి. ఏడో స్థానంలో జపాన్‌కు చెందిన ఒసాకా నగరం నిలిచింది. అత్యుత్తమ వైద్య వసతులు, తక్కువ నేరాల రేటు ఒసాకాకు ప్లస్ పాయింట్‌గా మారాయి.