Dangerous Tree: ఎన్నో చెట్లు ఈ ప్రకృతిలో ఉన్నాయి. కానీ ఒక చెట్టు గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చెట్టు గాలి సోకినా ప్రమాదమే. ఆ చెట్టు కింద నిల్చున్నా ప్రాణాపాయమే. అందుకే ఈ చెట్లపై నిషేధం ఉంది. ఆ చెట్టు పేరు ‘మంచినీల్’.
ప్రకృతిలో ఎన్నో చెట్లు ఉన్నాయి. అవన్నీ మనుషులకు ఏదో రకంగా సాయం చేసేవే. కానీ మనుషుల ప్రాణాలు తీసే అతి భయంకరమైన చెట్టు ఒకటి ఉంది. అదే ‘మంచినీల్’ వృక్షం. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్లలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. చూడటానికి అచ్చం ఆపిల్ చెట్టులాగే కనిపించే ఈ చెట్టు ఉత్తర, దక్షిణ అమెరికా తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా సముద్రపు ఒడ్డున ఉండే మడ అడవుల్లో పెరుగుతుంది. సముద్రపు అలల తాకిడికి నేల కోతకు గురికాకుండా కాపాడటంలో ఇది సాయపడుతుంది. సాధారణంగా 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఎదిగే ఈ చెట్లను స్థానికులు ‘బీచ్ ఆపిల్’ అని కూడా పిలుస్తుంటారు. మన దేశంలో ఈ చెట్లు కనిపించకపోవడం మన అదృష్టమనే చెప్పాలి.
23
చెట్టంతా విషమే
ఈ చెట్టు ప్రతి భాగంలోనూ విషం దాగి ఉంటుంది. చెట్టు ఆకులు, కాండం నుంచి కారే తెల్లటి పాల వంటి రసం చర్మానికి తగిలితే చాలు, తీవ్రమైన మంట పుట్టి బొబ్బలు, పెద్ద పుండ్లు వస్తాయి. వర్షం పడే సమయంలో పొరపాటున కూడా ఈ చెట్టు నీడలో నిలబడకూడదు. ఆకులపై నుంచి జారే నీటి బిందువులు మన ఒంటిపై పడినా చర్మం కాలిపోయి రక్తస్రావం జరుగుతుంది. అలాగే ఈ చెట్టు కలపను కాల్చినప్పుడు వచ్చే పొగ కళ్లకు తగిలితే కంటిచూపు పోయే ప్రమాదం ఉంటుంది. దీనికి కాసే పండ్లు చూడటానికి చిన్న ఆపిల్స్లా ఉండి తినడానికి తియ్యగానే ఉంటాయి. కానీ వీటిని ఒక్క ముక్క తిన్నా గొంతు వాచిపోయి, అంతర్గతంగా రక్తస్రావం జరిగి ప్రాణాలు పోతాయి. అందుకే వీటిని 'మరణాన్ని ఇచ్చే పండ్లు' అని పిలుస్తారు.
33
డేంజర్ బోర్డులు
ఈ చెట్లతో ఇంత ముప్పు ఉండటం వల్ల అమెరికా ప్రభుత్వం ఇవి పెరిగే తీర ప్రాంతాల్లో ప్రజలు దగ్గరకు వెళ్లకుండా ఎరుపు రంగు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తుంది. పూర్వకాలంలో అక్కడి గిరిజనులు జంతువులను వేటాడేందుకు బాణాల మొనలకు ఈ చెట్టు పాలను రాసేవారు. ఆ బాణం తగలగానే విషం శరీరంలోకి చేరి జంతువులు పడిపోయేవి. కరేబియన్ ప్రాంతంలో కొన్ని సంస్థలు కఠిన నిబంధనలు పాటిస్తూ ఈ కలపతో ఫర్నిచర్ తయారు చేస్తాయి. కొమ్మలను ఎండలో బాగా ఎండబెట్టి, విషపు రసం పూర్తిగా ఆవిరైన తర్వాతే ఉపయోగిస్తారు. అందంగా కనిపిస్తూనే ప్రాణాంతకంగా మారే ఈ వృక్షానికి వీలైనంత దూరంగా ఉండటమే శ్రేయస్కరం.