Jail Timings : ఫుడ్ నుండి బెడ్ వరకు... జైల్లో ఖైదీల దినచర్య ఎలా ఉంటుంది? 24 గంటల టైమ్ టేబుల్ ఇదే

Published : Sep 04, 2026, 11:43 AM IST

జైల్లో ఖైదీల దినచర్య ఎలా ఉంటుంది? ఉదయం నిద్రలేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే వరకు వాళ్ళు ఏ టైమ్ లో ఏం చేస్తారు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
జైల్లో ఖైదీల టైమ్ టేబుల్ ఇదే...

Jail Timings : జైలు అంటే శిక్ష అనుభవించే ప్రదేశం మాత్రమే కాదు... తప్పుచేసిన ఖైదీలలో మార్పు తీసుకువచ్చేందుకు ఏర్పాటుచేసిన తాత్కాలిక నివాసం. ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, తిరిగి సమాజంలో జీవించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడం కూడా ఈ జైలు వ్యవస్థలో భాగమే. అందుకే ఖైదీల రోజువారీ జైలు జీవితంలో వ్యాయామం, విద్య, కౌన్సెలింగ్, క్రీడలు, భోజనం, విశ్రాంతి, వినోదం వంటి అంశాలు భాగం అవుతాయి. అంటే జైలులో కఠిన నిబంధనలే కాదు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేలా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.

అయితే ఖైదీల రోజువారీ షెడ్యూల్ అన్ని జైళ్లలో ఒకేలా ఉండదు. రాష్ట్రం, జైలు నిబంధనలు, జైలు రకం, భద్రతా అవసరాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి సమయాల్లో మార్పులు ఉండొచ్చు. భారత కేంద్ర హోంశాఖ కూడా జైలు సంస్కరణలకు సంబంధించి Model Prison Manual 2016 ను రాష్ట్రాలకు మార్గదర్శకంగా అందించింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీల టైమ్ టేబుల్ ఎలా ఉంటుంది? ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తిరిగి రాత్రి నిద్రపోయేవరకు ఖైదీలు ఏం చేస్తారు? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

26
ఉదయం ఖైదీలు ఏం చేస్తారు?

ఉదయం 6 గంటలకే బ్యారక్‌లు ఓపెన్

ఖైదీల రోజు సాధారణంగా ఉదయం 6AM నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బ్యారక్‌లు లేదా ఖైదీలు ఉండే గదులను తెరుస్తారు. ఈ గంట సమయంలో ఖైదీలు కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి శుభ్రంగా రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో టీ, పాలు వంటివి కూడా అందిస్తారు. ఉదయం వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన పనులు పూర్తిచేసుకున్న తర్వాత ఖైదీలు తదుపరి కార్యక్రమాలకు సిద్ధమవుతారు.

7AM నుంచి 8AM వరకు వ్యాయామం, యోగా

ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు PT (Physical Training) ఉంటుంది. ఇందులో శారీరక వ్యాయామాలు అంటే పరేడ్, ఫిట్‌నెస్‌ వంటివి చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యోగా, ఇతర శారీరక, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఖైదీల శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ పెంపొందించడంలో ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క ఖైదీ జైల్లో ఉన్నంతకాలం ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది.

8AM నుంచి 9AM వరకు అల్పాహారం, పరిశుభ్రత

ఫిజికల్ ట్రైనింగ్ ముగిసిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) అందిస్తారు. ఇదే సమయంలో స్నానం చేయడం, దుస్తులు ఉతుక్కోవడం, వ్యక్తిగత వస్తువులను శుభ్రం చేసుకోవడం వంటి పనులు కూడా పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. జైలు జీవితంలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఖైదీలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ కూడా కీలకంగా మారుతుంది.

36
జైల్లో లంచ్, ఎడ్యుకేషన్ టైమింగ్స్ ఇవే..

9AM నుంచి 11AM వరకు చదువు, కౌన్సెలింగ్

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చదువుకు సంబంధించిన తరగతులు (Education Classes) నిర్వహిస్తారు. చదువు కొనసాగించాలనుకునే ఖైదీలకు వారి విద్యా స్థాయిని బట్టి వివిధ క్లాసులకు అందుబాటులో ఉండొచ్చు. జైళ్లలో విద్యను అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఖైదీలకు కొత్త అవకాశాలు కల్పించడం, సమాజంలోకి తిరిగి వెళ్లిన తర్వాత మెరుగైన జీవితాన్ని నిర్మించుకునేలా చేయడం.

ఇదే సమయంలో అవసరాన్ని బట్టి సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తారు. జైలు జీవితం, కుటుంబానికి దూరంగా ఉండటం, కేసులు, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలు ఖైదీల మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు. అందుకే మానసిక ఆరోగ్యం, ప్రవర్తనా మార్పు, పునరావాసం వంటి అంశాలకు జైలు సంస్కరణల్లో ప్రాధాన్యం ఉంది.

11 గంటలకు లంచ్.. ఆ తర్వాత ఖైదీల లెక్కింపు

ఉదయం కార్యక్రమాల తర్వాత 11 గంటల నుంచి 11:45 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. భోజనం పూర్తయిన తర్వాత 11:45 నుంచి 12:15 గంటల వరకు ఖైదీల లెక్కింపు జరుగుతుంది. జైలు భద్రతలో ఖైదీల లెక్కింపు అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఎవరు తమ నిర్దేశిత ప్రదేశంలో ఉన్నారు, ఎవరైనా గైర్హాజరయ్యారా వంటి విషయాలను సిబ్బంది పరిశీలిస్తారు.

మధ్యాహ్నం విశ్రాంతి, టీ

12:15 నుంచి 1 గంటల వరకు ఖైదీలకు విశ్రాంతి సమయం ఉంటుంది. ఈ సమయంలో కొంత సేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ విరామ సమయంలో మరోసారి టీ అందిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి.

46
జైల్లో ఖైదీలు మధ్యాహ్నమంతా ఏం చేస్తారు?

1PM నుంచి 3PM వరకు మళ్లీ విద్యా కార్యక్రమాలు

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మరోసారి విద్యా తరగతులు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయి. జైలు వ్యవస్థలో విద్య, వృత్తి శిక్షణ, ప్రవర్తనా మార్పు వంటి కార్యక్రమాలు ఖైదీల పునరావాసంలో కీలకమైనవిగా పరిగణిస్తారు. భారతదేశంలోని జైలు సంస్కరణల మార్గదర్శకాల్లో కూడా ఖైదీల సంక్షేమం, విద్య, వృత్తి నైపుణ్యాలు, పునరావాసానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఉంది.

3PM నుంచి 4PM వరకు వ్యక్తిత్వ వికాస క్లాసులు

3 గంటల నుంచి 4 గంటల వరకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో గెస్ట్ లెక్చరర్లు లేదా సైకాలజీ నిపుణులు ఖైదీలకు క్లాసెస్ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో ప్రొజెక్టర్ ద్వారా విద్యా, సామాజిక అంశాలపై షార్ట్ ఫిల్మ్స్ లేదా ఇతర కార్యక్రమాలు చూపిస్తారు.

ఇలాంటి కార్యక్రమాల ఉద్దేశం ఖైదీలలో ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడం, తప్పు ప్రవర్తనకు దారితీసిన అంశాలను అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో సమాజంలో బాధ్యతాయుతంగా జీవించేందుకు అవసరమైన విలువలను పెంపొందించడం. జైళ్లలో సాంస్కృతిక, వినోద, విద్యా కార్యక్రమాలు ఖైదీల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడే పునరావాస కార్యక్రమాలుగా Model Prison Manual లో కూడా ప్రస్తావించబడ్డాయి.

సాయంత్రం 4PM నుంచి 4:45PM వరకు ఆటలు

రోజంతా తరగతులు, ఇతర కార్యక్రమాలతో గడిపిన తర్వాత 4 గంటల నుంచి 4:45 గంటల వరకు స్పోర్ట్స్, గేమ్స్‌కు సమయం కేటాయిస్తారు. జైలు పరిస్థితులను బట్టి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలతో పాటు ఇండోర్ గేమ్స్‌కు కూడా అవకాశం ఉండొచ్చు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో, క్రమశిక్షణ, టీమ్‌వర్క్ వంటి లక్షణాలను పెంపొందించడంలో సహాయపడతాయి.

56
ఖైదీలు ఎప్పుడు పడుకుంటారు?

సాయంత్రం 5 గంటలకే డిన్నర్

సాయంత్రం 5 గంటల నుంచి 5:45 గంటల వరకు రాత్రి భోజనం అందిస్తారు. ఇతర కార్యక్రమాలతో పోలిస్తే డిన్నర్ సమయం ముందుగానే ఉండటం జైలు దినచర్యలో కనిపించే ప్రత్యేకతల్లో ఒకటి. ఖైదీ నిద్రపోయేలోపే తిన్న అహారమంతా అరిగిపోవాలనే ఇలా తొందరగా డిన్నర్ అందిస్తారు. ఇలా రాత్రి భోజనం పూర్తయిన తర్వాత ఖైదీలను తిరిగి వారివారి బ్యారక్ లేదా సెల్‌లకు పంపించే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

5:45 తర్వాత బ్యారక్స్ క్లోజ్

5:45 నుంచి 6 గంటల మధ్య ఖైదీలను తిరిగి బ్యారక్ లేదా సెల్‌లలోకి పంపిస్తారు. దీనితో బయట నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ తర్వాత జైలు సిబ్బంది భద్రతా తనిఖీలు, లెక్కింపు వంటి ప్రక్రియలను నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. జైలు వ్యవస్థలో ఖైదీల కదలికలపై క్రమబద్ధమైన పర్యవేక్షణ భద్రతలో ముఖ్యమైన భాగం.

రాత్రి టీవీ చూసే సమయం కూడా ఉంటుంది

ఖైదీలు పూర్తిగా రోజంతా ఒకే రకమైన నియంత్రిత వాతావరణంలో ఉండకుండా కొంత వినోదం పొందేందుకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు టీవీ సమయం కూడా ఉంటుంది. వార్తలు, విద్యా కార్యక్రమాలు లేదా జైలు నిబంధనలకు అనుగుణంగా ఇతర కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుంది. Model Prison Manual లో కూడా వార్తాపత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ, సినిమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను జైలు పునరావాస వ్యవస్థలో భాగంగా ఉపయోగించవచ్చని పేర్కొంది. ఆ తర్వాత ఎవరి బ్యారక్ లో వాళ్ళు పడుకుంటారు... తిరిగి ఉదయం 6 గంటల నుండి మళ్ళీ రోజు ప్రారంభం అవుతుంది.

జైల్లో జీవితం కేవలం శిక్షతోనే పరిమితం కాదు

ఖైదీల రోజువారీ దినచర్యలో ప్రతి పనికీ ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఉదయం లేవడం నుంచి రాత్రి విశ్రాంతి వరకు వ్యాయామం, భోజనం, పరిశుభ్రత, విద్య, కౌన్సెలింగ్, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, వినోదం ఇలా అనేక కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఆధునిక జైలు వ్యవస్థలో శిక్షతో పాటు సంస్కరణ, పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే ఈ టైమ్‌టేబుల్‌ను దేశంలోని ప్రతి జైలుకు వర్తించే ఒకే విధమైన షెడ్యూల్‌గా చూడకూడదు. జైళ్లు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు శాఖలు తమ నిబంధనలు, భద్రతా అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేయవచ్చు. తెలంగాణలో కూడా సెంట్రల్ జైళ్లు, జిల్లా జైళ్లు, ఓపెన్ జైళ్లు, మహిళా ప్రత్యేక జైలు, సబ్ జైళ్లు వంటి వివిధ రకాల జైలు సంస్థలు ఉన్నాయి.

అందువల్ల జైల్లో ఖైదీ జీవితం బయట నుంచి చూస్తే కేవలం నాలుగు గోడల మధ్య బంధించబడినట్టుగా అనిపించినా.. వాస్తవానికి ప్రతి రోజూ నిర్ణీత సమయానికి జరిగే అనేక కార్యక్రమాలతో కూడిన క్రమబద్ధమైన దినచర్యగా ఉంటుంది. ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం శిక్షను అనుభవిస్తున్న వ్యక్తిలో మార్పు తీసుకురావడం, అతడిని లేదా ఆమెను భవిష్యత్తులో సమాజంలో బాధ్యతాయుతమైన జీవితానికి సిద్ధం చేయడమే.

66
జైల్లోని ఖైదీల టైమ్ టేబుల్

6.00 AM TO 7.00 AM - ఖైదీలు ఉండే జైలు గది (బ్యారక్) ని ఓపెన్ చేస్తారు. ఫ్రెష్ అప్, టీ సమయం

7.00 AM TO 8.00 AM - P.T (Physical Training), పరేడ్/యోగా

8.00 AM TO 9.00 AM - బ్రేక్ ఫాస్ట్, క్లీనింగ్ ఆండ్ బాతింగ్

9.00 AM TO 11.00 AM - ఎడ్యుకేషన్ క్లాసెస్ (విద్యాదానం), సైకలాజికల్ కౌన్సెల్సింగ్ (ఉన్నతి)

11.00 AM TO 11.45 AM - లంచ్ (మధ్యాహ్న భోజనం)

11.45 AM TO 12.15 PM - ఖైదీల లెక్కింపు

12.15 PM TO 1.00 PM - విశ్రాంతి, టీ టైమ్

1.00 PM TO 3.00 PM - ఎడ్యుకేషన్ క్లాసెస్ (విద్యాదానం), సైకలాజికల్ కౌన్సెల్సింగ్ (ఉన్నతి)

3.00 PM TO 4.00 PM - నైతిక విలువల క్లాసెస్, గెస్ట్ లెక్చరర్స్ లేదా సైకాలజీ నిపుణులతో క్లాస్ లేదంటే ప్రొజెక్టర్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్

4.00 PM TO 4.45 PM - స్పోర్ట్స్ ఆండ్ గేమ్స్

5.00 PM TO 5.45 PM - డిన్నర్ (రాత్రి భోజనం)

5.45 PM TO 6.00 PM - తిరిగి బ్యారక్ లేదా సెల్ లోకి పంపిస్తారు

7.00 PM TO 8.00 PM - టివి సమయం

Read more Photos on
click me!

Recommended Stories