
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి... ఓవైపు టెక్ దిగ్గజ సంస్థల సేవల్లో అంతరాయాలు, మరోవైపు విమానయాన, బ్యాంకింగ్ రంగాల్లో సాంకేతిక సమస్యలు. ఇంకోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు. సాధారణంగా ఇలాంటి సమస్యలు ఒక్కో రంగంలో అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. కానీ వరుసగా వివిధ రంగాల్లో అంతరాయాలు చోటుచేసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతోందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల సేవల నుంచి విమానాశ్రయాలు, బ్యాంకులు, ప్రభుత్వ వ్యవస్థల వరకు సాంకేతిక సమస్యలు ఎదురవడం అంటే ఇది మామూలు విషయమేం కాదు. ఇదే సమయంలో బంగారం ధరలు, స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ రంగాల పతనంపై కూడా చర్చ మొదలైంది. అసలు ఈ పరిణామాలన్ని ఎందుకు జరుగుతున్నాయి? ఏదైనా తేడా జరగబోతోందా?
మొదట టెక్నాలజీ రంగంలోనే అంతరాయం మొదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సేవల్లో నవంబర్ 12న సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఔట్ లుక్ (Outlook), మైక్రోసాప్ట్ టీమ్ (Microsoft Teams), మైక్రోసాప్ట్ 365 (Microsoft 365) వంటి సేవలు సరిగా పనిచేయకపోవడంతో ఉద్యోగులు, వ్యాపార సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అంతరాయం కారణంగా లక్షలాది మంది వినియోగదారులు సేవలను ఉపయోగించలేకపోయారు. సర్వర్లపై అధిక భారం, మౌలిక సదుపాయాల్లో సమస్యలు దీనికి కారణమని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
ఇది జరిగిన కొద్ది రోజులకే మరో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సేవల్లోనూ సమస్యలు తలెత్తాయి. నవంబర్ 17న యాప్ స్టోర్ (App Store), ఐక్లౌడ్ (iCloud), ఆపిల్ పే (Apple Pay), ఆపిల్ మ్యూజిక్ (Apple Music) వంటి సేవలకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది వినియోగదారులు తమ యాపిల్ ఖాతాల్లోకి లాగిన్ కాలేకపోయారు. మరికొందరు యాప్ స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతర్గత సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా కొన్ని సేవల్లో సమస్యలు తలెత్తాయని, వాటిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని యాపిల్ తెలిపింది.
విమానయాన రంగంలోనూ సాంకేతిక సమస్యలు
టెక్నాలజీ సంస్థల తర్వాత అమెరికా విమానయాన రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాయి. నవంబర్ 13న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నెట్‌వర్క్‌లో సమస్య ఏర్పడటంతో అమెరికా అంతటా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా విమానాల ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
ఈ అంతరాయం కారణంగా వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి, మరికొన్ని రద్దయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 15 వేలకు పైగా విమానాల రాకపోకలు ప్రభావితమైనట్లు విమానయాన రంగానికి సంబంధించిన రిపోర్ట్స్ వెల్లడించాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. అనంతరం విమాన సేవలు క్రమంగా సాధారణ స్థితికి వచ్చాయి. అయితే ఇంతటి ప్రభావం చూపిన నెట్వర్క్ సమస్యకు అసలు కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
విమానయాన రంగంలో సమస్యలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా బ్యాంకింగ్ రంగంలోనూ సాంకేతిక అంతరాయాలు కనిపించాయి. నవంబర్ 16న జేపిమోర్గాన్ చేస్ (JPMorgan Chase) బ్యాంక్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య ఇతర బ్యాంకుల ఆన్లైన్ సేవలపై కూడా ప్రభావం చూపింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bank of America), వెల్స్ ఫార్గో ( Wells Fargo), యూఎస్ బ్యాంక్ ( US Bank), ట్రూయిస్ట్ (Truist) వంటి సంస్థల వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, నగదు బదిలీలకు సంబంధించిన సేవల్లో సమస్యలు తలెత్తాయి. జెల్లి ( Zelle) వంటి డిజిటల్ పేమెంట్ సేవలపైనా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. జెపిమోర్గాన్ చేస్ అంతర్గత హార్డ్‌వేర్ వ్యవస్థల్లో సాఫ్ట్వేర్ బగ్ కారణంగా లావాదేవీలు ఆలస్యమయ్యాయని వెల్లడించింది. అయితే ఈ సమస్య సైబర్ దాడి వల్ల కాదని బ్యాంక్ స్పష్టం చేసింది. మరుసటి రోజు నాటికి సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
జాతీయ భద్రతా నెట్‌వర్క్‌లోనూ సమస్య!
ఇక అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవస్థలోనూ సాంకేతిక అంతరాయం చోటుచేసుకోవడం మరింత చర్చకు దారితీసింది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) ఉపయోగించే అత్యంత రహస్య సమాచార నెట్వర్క్ NSA Netలో తాత్కాలిక సమస్య ఏర్పడింది. ఈ నెట్వర్క్ ద్వారా ఏజెన్సీ అధికారులు రహస్య సమాచారాన్ని పరస్పరం పంచుకుంటారు.
నవంబర్ 17న ఈ వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన NSA.. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్న మెయింటెనెన్స్ సమయంలో నెట్వర్క్ పనితీరులో తాత్కాలిక సమస్య తలెత్తిందని తెలిపింది. కొన్ని అంతర్గత వ్యవస్థలు ప్రభావితమైనప్పటికీ జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన కార్యకలాపాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. అంటే ఈ సమస్య కారణంగా దేశ రక్షణ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిందని చెప్పడానికి ఆధారాలు లేవు.
అమెరికాలోని ప్రభుత్వ వ్యవస్థలు, డిజిటల్ సేవలపై కూడా సాంకేతిక అంతరాయాల గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వాతావరణ సమాచారాన్ని అందించే నేషనల్ వెదర్ సర్వీస్ (NWS), ఆన్లైన్ కోర్టు పోర్టల్స్ వంటి వ్యవస్థల్లో సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది.
మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అమెరికాలో నవంబర్ 17న S&P 500 దాదాపు 1 శాతం, డౌ జోన్స్ 1.6 శాతం, నాస్డాక్ 0.7 శాతం నష్టపోయాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఏఐ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
అమెరికా విధిస్తున్న ఏఐ చిప్ ఎగుమతి ఆంక్షలు, టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న అనిశ్చితి, కంపెనీల విలువలపై ఇన్వెస్టర్ల ఆందోళనలు కూడా ఈ పతనానికి కారణాలుగా ఉన్నాయి. యూరప్, ఆసియా మార్కెట్లలోనూ కొన్ని సూచీలు నష్టాలను చవిచూశాయి. అయితే అన్ని దేశాల మార్కెట్లు ఒకే స్థాయిలో పడిపోతున్నాయని చెప్పలేం.
బంగారం ధరలు భారీగా పతనం
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. నవంబర్ 18న భారత మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.2,600 నుంచి రూ.2,800 వరకు పడిపోయింది. వెండి ధర కిలోకు రూ.5,000కు పైగా తగ్గింది.
అమెరికా డాలర్ బలపడటం, అక్కడ వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశాలు ఉండటం బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాదికి పైగా కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే ఈ పతనానికి టెక్నాలజీ అంతరాయాలే కారణమని చెప్పడానికి ఆధారాలు లేవు.
రియల్ ఎస్టేట్ రంగంలోనూ మందగమనం
ప్రస్తుతం ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. అధిక వడ్డీ రేట్లు, ఇళ్లు, భూముల ధరలు, కొనుగోలుదారులపై పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగా ఆస్తుల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. అమెరికాలో కూడా గత అక్టోబర్ నెలలో పాత ఇళ్ల అమ్మకాలు అంతకుముందు నెలతో పోలిస్తే 5.5 శాతం తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే 8.8 శాతం క్షీణించాయి. ఇండియా, అమెరికా దేశాల్లోనే కాదు దాదాపు అన్ని దేశాల్లోనూ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలాగే ఉంది..
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన అమెరికాలో టెక్నాలజీ సంస్థలు, విమానయాన వ్యవస్థలు, బ్యాంకులు, జాతీయ భద్రతా నెట్‌వర్క్‌లలో కొద్దిరోజుల వ్యవధిలో సమస్యలు తలెత్తడం సహజంగానే ఆసక్తిని కలిగిస్తోంది. వీటన్నింటినీ కలిపి చూస్తే ఏదో పెద్ద పరిణామం జరుగుతోందా అనే సందేహం వస్తోంది.
ఏదేమైనా ప్రపంచం మొత్తం డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడుతున్న సమయంలో వరుసగా ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తే ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.