Interesting Facts: భూమిపై ఎక్కడ చూసినా అడవులు, చెట్లు, పచ్చదనం కనిపిస్తాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌లో మాత్రం చెట్లు, పెద్ద అడవులు దాదాపుగా కనిపించవు. ఇంతకీ ప్రాంతంలో చెట్లు పెరగకపోవడానికి అసలు కారణం ఏంటంటే.?
గ్రీన్‌లాండ్‌లో ఎక్కువ కాలం చలి వాతావరణమే ఉంటుంది. ఇక్కడ శీతాకాలం చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలం కూడా చాలా తక్కువగా ఉండటంతో పాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి. చెట్లు పెరగాలంటే కొంతకాలం పాటు తగినంత వెచ్చని వాతావరణం అవసరం. కానీ గ్రీన్‌లాండ్‌లో ఆ అవకాశం చాలా తక్కువ. ముఖ్యంగా చెట్లు పెరిగి పెద్దవిగా మారేందుకు అవసరమైన సమయం, ఉష్ణోగ్రతలు అందుబాటులో ఉండవు. అందుకే అక్కడ పెద్ద చెట్లు, దట్టమైన అడవులు ఏర్పడలేదు.
25
దాదాపు 80 శాతం భూభాగం మంచుతోనే..
గ్రీన్‌లాండ్ భూభాగంలో దాదాపు 80 శాతం ప్రాంతం భారీ మంచు పొరతో కప్పబడి ఉంటుంది. దీంతో మొక్కలు, చెట్లు పెరగడానికి అందుబాటులో ఉన్న నేల చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మంచు కరిగినా.. అక్కడి నేల వెంటనే చెట్లు పెరగడానికి అనుకూలంగా మారదు. నేలలో పోషకాలు తక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు కూడా మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద చెట్లు వేళ్లు పాతుకుని పెరగడం చాలా కష్టం.
35
ఏడాది పొడవునా గడ్డకట్టే నేల
గ్రీన్‌లాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ‘పర్మాఫ్రాస్ట్’ ఉంటుంది. అంటే నేల చాలా కాలం పాటు గడ్డకట్టిన స్థితిలోనే ఉంటుంది. ఇలాంటి నేలలో చెట్ల వేర్లు లోతుగా వెళ్లడం కష్టం. నీరు కూడా నేలలోకి సరిగా ఇంకదు. దీంతో చెట్లకు అవసరమైన నీరు, పోషకాలు అందడం కష్టమవుతుంది. అందుకే అక్కడ లోతైన వేర్లు అవసరమైన పెద్ద చెట్ల కంటే.. తక్కువ ఎత్తులో పెరిగే నాచు, లైకెన్లు, చిన్న పొదలు వంటి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి.
గ్రీన్‌లాండ్ మొత్తం ప్రాంతంలో చెట్లు ఉండవని చెప్పడం పూర్తిగా సరైనది కాదు. ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో వాతావరణం కొంత అనుకూలంగా ఉండటంతో చిన్న బిర్చ్, విల్లో చెట్లు అక్కడక్కడ కనిపిస్తాయి. గ్రీన్‌లాండ్‌లోని క్విన్నువా లోయలో సహజంగా ఏర్పడిన చిన్న అడవి కూడా ఉంది. అయితే ఇవి చాలా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. మిగతా ప్రాంతాల్లో చలి, మంచు, నేల పరిస్థితులు చెట్ల పెరుగుదలకు అనుకూలంగా ఉండవు.
55
వాతావరణ మార్పులతో మారుతున్న పరిస్థితులు
ఇటీవలి కాలంలో గ్రీన్‌లాండ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు కరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల పొదలు, ఇతర చిన్న మొక్కల పెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో వాతావరణ మార్పుల ప్రభావంతో మరిన్ని ప్రాంతాలు మొక్కల పెరుగుదలకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ గ్రీన్‌లాండ్ ప్రకృతి వ్యవస్థ ఇప్పటికే ప్రత్యేకమైనదే. చెట్లు లేకపోయినా.. తీవ్రమైన చలిని తట్టుకుని జీవించే అనేక మొక్కలు, జంతువులు అక్కడ ఉన్నాయి.