రైతులు పండించే వడ్లను ప్రభుత్వం లేదా ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఈ వడ్లను మిల్లులకు తరలించి బియ్యంగా మారుస్తారు. మిల్లులో వివిధ దశల్లో వడ్లను ప్రాసెస్ చేసి తినడానికి వీలుగా బియ్యంగా మారుస్తాయి.
మొదట రైతుల నుండి సేకరించిన ధాన్యం (వడ్ల) రైస్ మిల్లుల్లోకి చేరగానే జల్లెడ పడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్లు ఉపయోగిస్తారు... ఈ ప్రక్రియ ద్వారా గడ్డి, దుమ్ము, తాలు గింజలు వంటివి వేరు అవుతాయి. ఆ తర్వాత వడ్ల సైజులోనే ఉండే చిన్నచిన్న రాళ్లను మరో ప్రత్యేక యంత్రం ద్వారా వేరుచేస్తారు. ఇలా కేవలం వడ్లను మాత్రమే సేకరిస్తారు.
ఇప్పుడు అసలు ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. వడ్లపై ఉండే పొట్టును ప్రత్యేక మిషన్ల ద్వారా వేరుచేస్తారు. దీంతో బ్రౌన్ కలర్ లో బియ్యం గింజలు వస్తాయి... వీటినే బ్రౌన్ రైస్ అంటారు. ఈ బ్రౌన్ పొరను కూడా తొలగించేందుకు బాగా పాలిష్ చేస్తారు... దీంతో మనం తినే తెల్లని బియ్యం రెడీ అవుతాయి.
అయితే ఈ బియ్యంలోనూ నల్లగా పాడయిపోయినవి, రెండు ముక్కలుగా మారిన గింజలు, నూకలు ఉంటాయి.. వీటిని కూడా ప్రత్యేక మిషన్ల ద్వారా వేరుచేస్తారు. ఇలా కేవలం నాణ్యమైన బియ్యం గింజలనే సేకరించి బస్తాల్లోకి చేరుస్తారు... ఇవే ప్రజలు తినేందుకు బయటకు వచ్చే బియ్యం.