Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?

Published : Sep 18, 2026, 01:31 PM IST

Gautam Adani Success Story: 21 ఏళ్ల వయసులో రైలు టికెట్‌తో ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణిస్తూ, సీటు దొరక్క బోగీ ఫ్లోర్‌పై నిద్రించిన ఒక సాధారణ యువకుడు.. నేడు రూ.10.45 లక్షల కోట్లకు పైగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.

PREV
15
బ్యాంకర్లకే షాక్ ఇచ్చిన ఆ ఒక్క డీల్.. అదానీని ఇన్ఫ్రా కింగ్ గా ఎలా మార్చింది?

1983 జూన్ 21న ఒక 21 ఏళ్ల భారతీయ యువకుడు తొలిసారిగా విదేశీ గడ్డపై కాలు మోపాడు. ఆ ప్రదేశం తూర్పు ఆసియా దేశమైన దక్షిణ కొరియా. విమానం దిగగానే ఆ యువకుడు నేరుగా మోకాళ్లపై కూర్చొని ఆ కొరియన్ నేలను ముద్దాడాడు. ఆ దృశ్యం చూసి అతనితో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. అది కేవలం ఒక విదేశీ ప్రయాణం మాత్రమే కాదు, అతని కలల విమానం టేకాఫ్ కాబోతున్న అసలైన లాంచ్‌ప్యాడ్. 21 ఏళ్ల వయసులో ఒక చిన్న బిజినెస్‌తో విదేశాలకు వెళ్లిన ఆ యువకుడే నేడు భారత్‌లోనే అత్యంత ధనవంతుడు. అతని నికర ఆస్తి విలువ ఏకంగా 109 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10.45 లక్షల కోట్లు). ఆ వ్యక్తే అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.

25
ప్లాస్టిక్ ప్యాకేజింగ్ నుంచి కొత్త ఆలోచన

1980ల కాలంలో అదానీ కుటుంబం ప్లాస్టిక్ ప్యాకేజింగ్ బిజినెస్‌లో ఉండేది. వ్యాపారం బాగానే సాగుతున్నా, గౌతమ్ అదానీ ఆలోచనలు వేరుగా ఉండేవి. ప్యాకేజింగ్ ఉత్పత్తుల అమ్మకం ధర మార్కెట్‌లో స్థిరంగా ఉంటుందని, కానీ దానికి కావాల్సిన ముడిసరుకు ధరలు మాత్రం ఎప్పుడూ మారుతుంటాయని ఆయన గుర్తించారు. స్థానిక సప్లైయర్లపై ఆధారపడితే ఎక్కువ లాభాలు రావు అని అర్థం చేసుకుని, విదేశీ మార్కెట్లపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.

35
ఫస్ట్ క్లాస్ బోగీ ఫ్లోర్‌పై నిద్రించి బిజినెస్ పాఠాలు

ఆ రోజుల్లో చిన్న వ్యాపారులకు విదేశాల నుంచి ముడిసరుకు తెప్పించడం సులభం కాదు. ఆ సమయంలో ముంబైకి చెందిన పెద్ద ప్లాస్టిక్ వ్యాపారులు షా, జతిన్ కోటేచాలతో అదానీకి పరిచయంర్పడింది. వారు 2,000 టన్నుల భారీ లాట్లలో సరుకు తెప్పించేవారు. అదానీ వారితో మంచి సంబంధాలు పెంచుకుని, వ్యాపార మెలకువలు నేర్చుకోవడం ప్రారంభించారు. ప్రముఖ రచయిత ఆర్.ఎన్. భాస్కర్ తన "Gautam Adani: Reimagining Business in India and the World" పుస్తకంలో ఒక ఆసక్తికర విషయాన్ని రాశారు. ఆ వ్యాపారులు ముంబై నుంచి అహ్మదాబాద్‌కి ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తే, అదానీ సెకండ్ క్లాస్ టికెట్‌తో రైలు ఎక్కేవారు. కానీ, వారి నుంచి గ్లోబల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ నియమాలు నేర్చుకోవడానికి ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చి, వారితో మాట్లాడుతూ ఆ బోగీ నేలపైనే నిద్రించేవారు.

45
అవసరం 20 టన్నులే.. కానీ ఆర్డర్ 200 టన్నులు

1983 మొదటి త్రైమాసికంలో దక్షిణ కొరియాలోని ఒక పెద్ద ప్లాస్టిక్ సప్లయర్‌తో అదానీకి సంబంధాలు ఏర్పడ్డాయి. జూన్‌లో కొరియా వెళ్లిన వెంటనే ఆయన 200 టన్నుల పీవీసీ దిగుమతికి ఆర్డర్ ఇచ్చారు. అయితే, ఆ సమయంలో అదానీ స్వంత ఫ్యాక్టరీకి నెలకు కావాల్సింది కేవలం 20 టన్నులు మాత్రమే. అంటే తన అవసరం కంటే 10 రెట్లు ఎక్కువ సరుకుకు ఆర్డర్ ఇచ్చారు. తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో సరుకు కొని, తమ అవసరానికి పోను మిగిలిన సరుకుని మార్కెట్‌లోని ఇతర చిన్న వ్యాపారులకు లాభానికి అమ్మడమే ఆయన మాస్టర్‌ప్లాన్.

55
రిస్క్‌ను దాటి బిజినెస్ కింగ్‌గా అదానీ

బ్యాంక్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయించుకోవడానికి బ్యాంకర్లు మొదట సంకోచించినా, అదానీ స్వయంగా వెళ్లి వారిని ఒప్పించి అనుమతి తెచ్చుకున్నారు. ఆ ఒక్క డీల్‌తో ఆయన ఒక ప్యాకేజింగ్ తయారీదారు నుంచి 'కమోడిటీ ట్రేడర్'గా మారిపోయారు. ఆ తర్వాత గుజరాత్ స్టేట్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ ద్వారా ఇంపోర్ట్ హక్కులను ఉపయోగించుకుని తొలి ఏడాదే రూ.10 కోట్ల వ్యాపారం చేశారు. ఒకసారి ఆయన దిగుమతి చేసుకున్న 5,000 టన్నుల పాలిమర్‌తో వస్తున్న ఓడ సముద్రంలో మునిగిపోయినప్పటికీ, ఆయన అధైర్యపడకుండా వెంటనే మరొక పెద్ద ఇంపోర్ట్ కోసం కొత్త ఎల్ సీ ఓపెన్ చేశారు.

ఈ కొరియా ట్రిప్, 200 టన్నుల పీవీసీ డీల్ అదానీ ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేసింది. 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్స్‌కు పునాది పడింది, దాన్నే మనం నేడు 'అదానీ ఎంటర్‌ప్రైజెస్'గా పిలుస్తున్నాం. ప్రస్తుతం అదానీ గ్రూప్ కింద 10 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి, వాటిలో సుమారు 48,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన నికర ఆస్తి 109 బిలియన్ డాలర్లు.

Read more Photos on
click me!

Recommended Stories