Snake Bite First Aid : పాము, తేలు, జెర్రి... ఈ విషపూరిత జీవులు కాటేయగానే ఏం చేయకూడదు? ఏం చేయాలి?

Published : Sep 11, 2026, 10:25 AM IST

పాము, తేలు, జెర్రి… ఈ మూడు విషపూరితమైన జంతువులే. ఇవి కరిచినప్పుడు చాలామంది కంగారుపడి కొన్ని తప్పులు చేస్తుంటారు, ఇవి ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. మరి ఇవి కరిచిన వెంటనే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ ఫస్ట్ ఎయిడ్ టిప్స్ తప్పక తెలుసుకోండి.

PREV
15
పాము కరిస్తే వెంటనే ఏం చేయాలి?

వర్షకాలం వచ్చిందంటే చాలు ఇంటి పరిసరాల్లో, పొలంగట్లపై గడ్డి అంతెత్తున పెరుగుతుంది… దీంతో పాములు, తేళ్లు, జెర్రెలు వంటి విషపూరిత జంతువులు అందులోకి చేరతాయి. అందుకే వర్షాకాలంలోనే రైతులు, సామాన్య ప్రజలు విషపురుగుల కాటుకు ఎక్కువగా గురవుతుంటారు… కొన్నిసార్లు పాము కాటుతో ప్రాణాలు పోతుంటాయి. అయితే ఏ విషపూరిత జంతువు కాటేసినా సరైన పద్దతిలో ప్రథమ చికిత్స అందించి వెంటనే హాస్పిటల్ కు తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చు… కానీ కంగారుపడి చేసే కొన్ని తప్పుడు ప్రథమ చికిత్సలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. కాబట్టి ఏ కాటుకు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలో, అప్పటివరకు ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పాము కరవడాన్ని ప్రత్యక్షంగా చూడటం కాదు అనుమానం వచ్చినా దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగానే చూడాలి. అది విషమున్న పామా, కాదా, కాటేసిందా, లేదా అంటూ ఆలోచిస్తూ ఇంట్లోనే తేల్చుకోవడానికి ప్రయత్నించొద్దు, ఇలా సమయం వృధా చేయవద్దు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం బాధితుడిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి.

పాముకాటుకు చేయాల్సిన ప్రథమచికిత్స

  • కరిచిన పాముపై దాడి చేయడానికి ప్రయత్నించవద్దు, అది మళ్లీ కాటేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగా బాధితుడిని దూరంగా, సురక్షితమైన చోటుకు తీసువెళ్లండి.
  • బాధితుడు కంగారు పడకుండా ధైర్యం చెప్పాలి. ఆందోళనకు గురయితే గుండెవేగం పెరిగి రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది.. దీంతో విషం మరింత తొందరగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే పాము కరిచిన వ్యక్తిని ప్రశాంతంగా ఉంచండి.
  • పాము కాటేసిన అవయవం (కాలు లేదా చెయ్యి) ఎక్కువగా కదపకుండా చూసుకోండి.
  • వాపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాధితుడికి ఉంగరాలు, గాజులు, కడియాలు, బూట్లు వంటివి ఉంటే తీసేయండి.
  • వీలైతే కాటు పడిన భాగాన్ని కదలకుండా చేసి హాస్పిటల్‌కు తీసుకెళ్లండి.
  • వాంతులు, కళ్లు తిరగడం వంటివి ఉంటే, శ్వాస సరిగ్గా ఆడేందుకు వీలుగా బాధితుడిని పక్కకు తిప్పి పడుకోబెట్టండి.
  • శ్వాస, స్పృహ ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉండండి.
  • ఆలస్యం చేయకుండా దగ్గర్లోని హాస్పిటల్ లేదా ఎమర్జెన్సీ సెంటర్‌కు తీసుకెళ్లండి.
25
పాము కరిచాక ఈ పనులు అస్సలు చేయొద్దు
  • పాము కరిచిన వెంటనే ఆ భాగానికి పైన తాడుతో గట్టిగా కట్టడం అస్సలు చేయవద్దు.
  • గాయాన్ని కత్తితో కోయడం, నోటితో విషాన్ని పీల్చడం, ఆకుపసర్లు పెట్టడం వంటివి చాలా ప్రమాదకరం. ఇవి ఏమాత్రం పనిచేయకపోగా, ట్రీట్‌మెంట్‌ను ఆలస్యం చేస్తాయి.
  • 'విషాన్ని పీల్చేయొచ్చు' అనేది పెద్ద అపోహ. అలాంటి ప్రయత్నాల్లో సమయం వృథా అవ్వడమే కాకుండా గాయానికి మరింత హాని జరగొచ్చు. ఒక్కోసారి విషాన్ని పీల్చే వ్యక్తి కూడా ప్రమాదంలో పడవచ్చు.
  • కరిచిన పామును పట్టుకోవడానికి ప్రయత్నించొద్దు. పాము కరిచిన తర్వాత దాన్ని వెతికి పట్టుకోవడం లేదా చంపడం వంటివి చేయొద్దు. వీలైతే దూరం నుంచి సురక్షితంగా దాని ఫోటో తీయొచ్చు. కానీ ఫోటో కోసం మళ్లీ పాము దగ్గరికి వెళ్లడం ప్రమాదకరం.
35
తేలు కుడితే ఏం చేయాలి?

తేలు కుట్టడం వల్ల చాలాసార్లు తీవ్రమైన నొప్పి వస్తుంది. పెద్దవాళ్లపై తేలు విషం ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కాదు కానీ పిల్లల్లో ఈ విషం ప్రభావం శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఎక్కువని భారత జాతీయ ఆరోగ్య మిషన్ (Indian National Health Mission) చెబుతోంది. తేలు కుట్టిన చోట నొప్పి, మంట, వాపు ఉంటాయి… కొందరిలో మాత్రం విష ప్రభావం శరీరం మొత్తానికి వ్యాపించవచ్చు.

గమనించాల్సిన ప్రమాదకరమైన లక్షణాలు

  • అతిగా చెమట పట్టడం
  • వాంతులు లేదా కడుపు నొప్పి
  • గుండె వేగంగా లేదా అస్తవ్యస్తంగా కొట్టుకోవడం
  • రక్తపోటులో మార్పులు
  • కండరాల సంకోచాలు లేదా బిగుసుకుపోవడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • తీవ్రమైన నీరసం లేదా స్పృహ కోల్పోవడం

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లలు, వృద్ధులు లేదా లక్షణాలు వేగంగా పెరుగుతున్నట్లయితే, ఇంట్లో వేచి చూడకుండా వైద్యుడిని సంప్రదించడం సురక్షితం.

45
జెర్రి కరిస్తే ఏం చేయాలి?

జెర్రి కరిచిన చోట సాధారణంగా విపరీతమైన నొప్పి, ఎర్రబడటం, వాపు, మంట ఉంటాయి. కొందరిలో తిమ్మిరి వంటి లక్షణాలు కూడా కనిపించొచ్చు. అరుదుగా ఈ విషం వల్ల తీవ్రమైన అలర్జీ కూడా రావచ్చు.

జెర్రి కరిస్తే ఏం చేయాలి?

1. కాటు పడిన భాగాన్ని సబ్బు, నీటితో శుభ్రంగా కడగాలి.

2. వాపు, నొప్పి తగ్గడానికి, గుడ్డలో చుట్టిన ఐస్ ప్యాక్‌ను కాసేపు పెట్టొచ్చు.

3. జెర్రి కాటేసిన ప్రదేశాన్ని గమనిస్తూ ఉండాలి.

4. నొప్పి లేదా వాపు పెరిగితే డాక్టర్‌ను సంప్రదించాలి.

శ్వాస ఆడకపోవడం, గొంతు లేదా ముఖం వాపు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే అది ఎమర్జెన్సీ. వెంటనే వైద్య సహాయం అవసరం.

55
విష జంతువులు కాటేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

'కాటు చిన్నదే కదా... ఏమీ కాదులే' అని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పాము కరిస్తే హాస్పిటల్‌కు వెళ్లడంలో ఆలస్యం చేయొద్దు. విషపు పాము కాటుకు ప్రాణం కాపాడే ముఖ్యమైన చికిత్స యాంటీవెనమ్ (Antivenom). ఇది హాస్పిటల్‌లో అవసరమైన పరీక్షల తర్వాత ఇస్తారు. తేలు, జెర్రి కాటులో కూడా లక్షణాలు తీవ్రమైతే వైద్య చికిత్స తప్పనిసరి.

విషపూరిత జీవులు కాటేస్తే గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు 

  1. అస్సలు కంగారు పడొద్దు

2. బాధితుడిని ఎక్కువగా నడవనివ్వొద్దు, పరుగెత్తనివ్వొద్దు.

3. కాటేసిన చోట గట్టిగా తాడు కట్టొద్దు.

4. గాటు పెట్టడం, విషం పీల్చడం చేయొద్దు.

5. పాము కరిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లండి.

ముఖ్య గమనిక

ఈ సమాచారం కేవలం ప్రథమ చికిత్స, అవగాహన కోసం మాత్రమే. పాము, తేలు లేదా జెర్రి కరిచినప్పుడు పరిస్థితి ముదిరేదాకా చూడకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. కాటు వేసిన జీవిని పట్టుకోవడానికి ప్రయత్నించడం కంటే బాధితుడి భద్రత, తక్షణ వైద్య చికిత్స ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories