Gold: బంగారం కొనేటప్పుడు హాల్‌మార్క్ ఉందంటే చాలు.. ఇక ప్యూరిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల నకిలీ హాల్ మార్క్ వేస్తున్నారు. మరి ఆ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.
బంగారం కొనేటప్పుడు చాలా మంది ముందుగా చూసేది హాల్‌మార్క్ ఉందా లేదా అనేదే. హాల్‌మార్క్ ఉంటే బంగారం స్వచ్ఛమైందని నమ్ముతారు. కానీ కేవలం హాల్‌మార్క్, HUID నంబర్ కనిపించిందని వెంటనే నమ్మేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు చోట్ల నకిలీ హాల్ మార్క్ సెంటర్లు వెలిశాయట. నకిలీ హాల్‌మార్క్ ని వేయడం లేదా ఒరిజనల్ నగకి సంబంధించిన HUID నెంబర్‌ను వేరే తక్కువ ప్యూరిటీ నగపై వేస్తున్నారట. దానివల్ల ఆ నంబర్‌ను BIS CARE యాప్‌లో చెక్ చేసినా అక్కడ వివరాలు కనిపిస్తాయి. దీంతో కస్టమర్‌కు ఆ నగపై అనుమానం కూడా రాకపోవచ్చు. చివరికి తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేసి నష్టపోయే ప్రమాదం ఉంది. మరి అలా జరగకూడదంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
26
BIS సర్టిఫైడ్ జ్యువెలర్ దగ్గర గోల్డ్ కొనడం
BIS సర్టిఫైడ్ జ్యువెలర్ దగ్గర బంగారం కొనడం వల్ల నాణ్యతపై మరింత నమ్మకం ఉంటుంది. హాల్‌మార్క్ ద్వారా బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. బిల్లులో బంగారం బరువు, స్వచ్ఛత, ధర వంటి వివరాలు స్పష్టంగా ఉంటాయి. భవిష్యత్తులో ఎక్స్ఛేంజ్ లేదా రీసేల్ సమయంలో కూడా బిల్లులు, హాల్‌మార్క్ వివరాలు ఉపయోగపడతాయి.
36
HUID నెంబర్
బంగారం నగపై ఉన్న HUID నంబర్‌ను BIS CARE యాప్‌లో చెక్ చేయడం తప్పనిసరి. కానీ అక్కడ నెంబర్ కనిపించింది కదా అని అక్కడితో ఆగిపోవద్దు. యాప్‌లో కనిపించే వివరాలను మీరు కొనుగోలు చేస్తున్న నగతో పోల్చి చూడాలి. నగపై ఉన్న HUID, ప్యూరిటీ మార్క్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయా గమనించాలి. కేవలం HUID కనిపిస్తోంది కాబట్టి ఆ నగ అదే హాల్‌మార్క్‌కు చెందిందనే నిర్ణయానికి రావద్దు.
హాల్‌మార్క్ ఉందా లేదా అన్నదానికంటే అందులో బంగారం ఎంత ఉందనేది చాలా ముఖ్యం. 22 క్యారెట్ బంగారానికి 22K916, 18 క్యారెట్‌కు 18K750, 14 క్యారెట్‌కు 14K585 వంటి గుర్తులు ఉంటాయి. కాబట్టి నగపై ఉన్న ప్యూరిటీ మార్క్‌ను తప్పకుండా చూడాలి. కొందరు వ్యాపారులు తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారాన్ని ఎక్కువ క్యారెట్ల బంగారంగా చూపిస్తే, కస్టమర్ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది.
56
బిల్ తీసుకోవడం
బంగారం కొనేటప్పుడు బిల్ తీసుకోవడం చాలా ముఖ్యం. బిల్‌లో నగ బరువు ఎంత, బంగారం ప్యూరిటీ ఎంత, ధర ఎంత వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. తర్వాత ఎప్పుడైనా ప్యూరిటీ విషయంలో సమస్య వస్తే ఈ బిల్ ఆధారంగా ఉంటుంది. “బిల్ అవసరం లేదు, తక్కువ ధరకు ఇస్తాం” అని ఎవరైనా చెప్పినా అలా కొనడం మంచిది కాదు. బంగారం ఎంత ఖరీదైందో, దానికి సంబంధించిన పత్రాలు కూడా అంతే ముఖ్యం.
66
జ్యువెలరీ ఫోటోలు
నగపై ఉన్న హాల్‌మార్క్, HUID, బిల్ వివరాల్లో ఏదైనా తేడా కనిపిస్తే లేదా బంగారం ప్యూరిటీపై అనుమానం వస్తే, నమ్మకమైన BIS గుర్తింపు పొందిన హాల్ మార్క్ సెంటర్ లో పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే జ్యువెలరీకి సంబంధించిన HD ఫోటోలు BIS కేర్ యాప్ లో కనిపిస్తాయి. అయితే ఈ ఫోటో షేరింగ్ ఫెసిలిటీ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25 హాల్ మార్క్ సెంటర్లలోనే ఉన్నట్లు తెలుస్తోంది.