
రాత్రి సమయం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది.. ఈ సమయంలో వీధికుక్కలు ఒక్కసారిగా ఏడుస్తున్నట్లు, ఊల వేస్తున్నట్లు అరవడం మొదలుపెడతాయి. ఈ శబ్దాల గురించి చిన్నప్పటి నుంచి కథలుకథలుగా వింటున్నాం... ఇంటిముందు ఇలా కుక్కలు అరిస్తే ఆ కుటుంబంలో ఏదో అశుభం జరగబోతోందని కొందరు నమ్ముతారు. ఇక కుక్కలకు దెయ్యాలు, ఆత్మలు కనిపిస్తాయని... అందుకే రాత్రుళ్లు ఊల వేస్తాయని బాగా ప్రచారంలో ఉంది. కానీ ఇవేవీ నిజం కాదని సైన్స్ చెబుతోంది.
కుక్కలు రాత్రిపూట ఇలా అరవడానికి ప్రధానంగా వాటి సహజ స్వభావం, వినికిడి శక్తి, పరిసరాల్లోని శబ్దాలు వంటి శాస్త్రీయ కారణాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు నిద్రపోడానికి ప్రయత్నిస్తుంటే ఈ అంశాలు ఇబ్బంది కలిగిస్తాయట... అందుకే అవి ఏడుస్తున్నట్లుగా అరుస్తాయి... ఇవి సాధారణ అరుపుకు చాలా భిన్నంగా ఉంటాయి. మరి కుక్కల విచిత్రమైన అరుపుల వెనకున్న సైన్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
కుక్కలు రాత్రిపూట అరవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి వాటి అసాధారణమైన వినికిడి శక్తి. మనుషులతో పోలిస్తే కుక్కలు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిలోని శబ్దాలను వినగలవు. మన చెవులకు వినిపించని చాలా స్వల్పమైన లేదా దూరంలోని శబ్దాలను కూడా అవి గుర్తించగలవు. ఉదాహరణకు చాలా దూరంలో మరో కుక్క అరుస్తున్నా మనకు ఆ శబ్దం స్పష్టంగా వినిపించకపోవచ్చు. కానీ కుక్క మాత్రం దాన్ని గుర్తించి స్పందిస్తుంది. ఒక కుక్క ఊల వేస్తే.. దానికి సమీపంలోని ఇతర కుక్కలు కూడా ప్రతిస్పందించడం అందుకే కనిపిస్తుంది.
కుక్కలు తోడేళ్ల కుటుంబానికి చెందిన జంతువులు. అడవుల్లో నివసించే తోడేళ్లు తమ గుంపులోని ఇతర సభ్యులతో దూరం నుంచే శబ్దాల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. అదే లక్షణం వీది కుక్కల్లోనూ కొంతవరకు కొనసాగింది. రాత్రిపూట పరిసరాలు నిశ్శబ్దంగా ఉండటంతో కుక్కల శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. దీంతో అవి ఇతర కుక్కలకు స్పందించడానికి, తమ పరిధిని తెలియజేయడానికి లేదా గుంపులోని ఇతర కుక్కలతో సంబంధాన్ని కొనసాగించడానికి ఊల వేయవచ్చు.
కుక్కలు రాత్రిపూట అసహజంగా అరవడానికి మరో కారణం వాటి పరిసరాల్లో ఉండే చిన్న జంతువులు. ఎలుకలు, గబ్బిలాలు వంటి కొన్ని జంతువులు మనుషులకు సులభంగా వినిపించని శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా గబ్బిలాలు ఎకోలోకేషన్ కోసం అధిక ఫ్రీక్వెన్సీ శబ్దాలను ఉపయోగిస్తాయి. ఎలుకలు 8000-10000HZ వద్ద ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి... ఇదే చిక్ చిక్ శబ్దం… ఇలా ఎలుకలు రాత్రుళ్ళు అల్ట్రా సోనిక్ ఫ్రీక్వెన్సీ వద్ద మాట్లాడటం మనకు వినపడవు కానీ కుక్కలకు వినిపిస్తాయి. ఈ శబ్దాలను కుక్కలు మనుషుల కంటే మెరుగ్గా గుర్తించగలవు. ఇంటి పరిసరాల్లో ఎలుకలు లేదా ఇతర చిన్న జంతువుల కదలికలను గుర్తించినప్పుడు కూడా కుక్కలు అప్రమత్తమై మొరగవచ్చు లేదా ఊల వేయవచ్చు.
కుక్కల పంజాలో సెన్సార్స్ ఉంటాయి.. భూమిలో ఏదైనా కదలికలు (భూకంపం వంటివి) జరగ్గానే వెంటనే కుక్కలు గుర్తిస్తాయి. మనం గుర్తించలేని కంపనాలు కూడా కుక్కల సెన్సార్స్ పసిగడతాయి. దీంతో ఈ సెన్సార్స్ కుక్క మెదకుడు సమాచారం అందిస్తాయి... అందుకే అవి రాత్రుళ్ళు విచిత్రంగా అరుస్తుంటాయి.
భూమిలో స్వల్పమైన ప్రకంపనలు సంభవించినప్పుడు కుక్కలు వాటిని మనుషుల కంటే ముందుగానే గుర్తిస్తాయని చాలాకాలంగా ప్రచారం ఉంది. కుక్కలకు సున్నితమైన పాదాలు, మంచి వినికిడి, వాసన గుర్తించే శక్తి ఉండటం నిజమే. అయితే “భూకంపం రాకముందే కుక్కలు తప్పకుండా గుర్తిస్తాయి” అనే విషయానికి శాస్త్రీయంగా స్థిరమైన ఆధారాలు లేవు. కొన్ని సందర్భాల్లో జంతువులు భూకంపానికి ముందు ప్రవర్తనలో మార్పులు చూపించినట్లు పరిశీలనలు ఉన్నప్పటికీ, వాటిని నమ్మకమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పరిగణించలేం.
కుక్కలు రాత్రిపూట మనుషులకు కనిపించని దెయ్యాలను చూస్తాయని చెప్పడానికి కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు. చీకటిలో వాటి చూపు, వినికిడి, వాసన వంటి ఇంద్రియాలు మనుషుల కంటే భిన్నంగా పనిచేస్తాయి. మనం గమనించని చిన్న కదలికలు, వాసనలు లేదా శబ్దాలను అవి గుర్తించడంతో వాటి ప్రవర్తన మనకు విచిత్రంగా అనిపించవచ్చు. భయపడినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆందోళన చెందినప్పుడు లేదా శారీరక అసౌకర్యం ఉన్నప్పుడూ కుక్కలు ఎక్కువగా అరవచ్చు.
కొన్నిసార్లు యజమాని దృష్టిని ఆకర్షించడానికి కూడా కుక్కలు ఊల వేస్తాయి. ఎక్కువసేపు ఒంటరిగా ఉండే కుక్కల్లో separation anxiety కారణంగా రాత్రిపూట అరుపులు పెరగవచ్చు. కొత్త ప్రదేశం, తెలియని శబ్దాలు, ఇతర జంతువులు లేదా పరిసరాల్లో వచ్చిన మార్పులు కూడా వాటి ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. వయసు పెరిగిన కుక్కల్లో గందరగోళం లేదా నిద్రలో మార్పులు వచ్చినా రాత్రివేళల్లో ఎక్కువగా శబ్దం చేసే అవకాశం ఉంటుంది.
అందుకే రాత్రిపూట కుక్కలు ఏడుస్తున్నట్లు లేదా ఊల వేస్తున్నట్లు అరుస్తే వెంటనే దెయ్యాలు, ఆత్మలు అని భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా వాటి సహజమైన కమ్యూనికేషన్, సున్నితమైన వినికిడి, పరిసరాల్లోని ఇతర జంతువులు, భయం, ఒంటరితనం లేదా ఆందోళన వంటి కారణాలే దీనికి కారణమవుతాయి. మనకు కనిపించని, వినిపించని ఏదో ఒక విషయాన్ని కుక్క గుర్తించి ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రవర్తన వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోవడమే సరైన మార్గం.