Loco pilot salary: భారతీయ రైల్వే అతి పెద్ద రవాణా వ్యవస్థ. ఈ రవాణా ఈ వ్యవస్థలో లోకో పైలట్లు ఎంతోమంది పనిచేస్తున్నారు. వారి జీతం గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. నడిపే రైళ్ళను బట్టి లోకో పైలట్ల జీతం ఆధారపడి ఉంటుంది.
మనదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఈ వ్యవస్థలో 1,10,000 మంది లోకో పైలట్లు పనిచేస్తున్నారు. ఇక మొత్తం భారతీయ రైల్వే లో పనిచేసే ఉద్యోగుల విషయానికి వస్తే 12 లక్షల 30 వేల మందికి పైగా ఉద్యోగం చేస్తున్నారు. ఇక లోకో పైలట్లలో మగవారిదే పై చేయి. మహిళా లోకో పైలట్ల సంఖ్య రెండువేలు మాత్రమే. చాలామందికి రైళ్లలో నడిపే లోకో పైలట్లకు ఎంత జీతం ఉంటుంది? అనే విషయంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. లోకో పైలట్ల అనుభవం, సీనియారిటీ, వారు నడిపే రైలును బట్టి వారి జీతం ఆధారపడి ఉంటుంది. లోకో పైలట్ ఉద్యోగం కోసం ఆర్ఆర్‌బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పెట్టిన పరీక్షలను రాయాలి.
24
ఎన్ని రకాల లోకో పైలెట్ ఉద్యోగాలు?
మనదేశంలో గూడ్స్ రైళ్లు, వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఒక్కోరకం రైలును బట్టి అది నడిపే లోకో పైలట్ శాలరీ ఆధారపడి ఉంటుంది. ఒక లోకో పైలట్ ఉద్యోగం.. అసిస్టెంట్ లోకో పైలట్ స్థాయితో మొదలవుతుంది. ఇతడు సీనియర్ లోకో పైలట్ కు సహాయకుడిగా ఉంటాడు. ఇక రైల్వే యార్డులలో ర్యాక్, వ్యాగన్లు కదిలించే ఇంజన్లను నడిపేందుకు షంటింగ్ లోకో పైలట్ ఉంటాడు. అలాగే గూడ్స్ ట్రైన్లకు ఉండే లోకో పైలట్ చాలా దూర ప్రయాణాలు చేస్తాడు. ప్రయాణికుల రైలును నడిపేందుకు ఇద్దరు లోకో పైలెట్లు ఉంటారు. ఒకరు సీనియర్, మరొకరు జూనియర్. అలాగే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను, హై స్పీడ్ రైళ్లను నడిపే లోకో పైలట్లు వేరుగా ఉంటారు. ఇక అతిపెద్ద లోకో పైలట్ పోస్టు.. చీఫ్ లోకో ఇన్స్పెక్టర్. ఇతను లోకో పైలట్ల శిక్షణ, వారి విధులను పర్యవేక్షిస్తాడు.
34
లోకో పైలెట్ జీతం ఎంత?
భారతీయ రైల్వేలో లోకో పైలట్ ఉద్యోగం అనేది చాలా గౌరవప్రదమైనది. మంచి స్థిరత్వాన్ని అందించే ఉద్యోగం కూడా. కొత్తగా ఉద్యోగంలో చేరిన అసిస్టెంట్ లోకో పైలట్ ప్రాథమిక జీతం నెలకు 19,900 రూపాయలుగా ఉంటుంది. ఇక డిఏ, హెచ్ఆర్ఎ అన్నింటినీ కలుపుకుంటే అది 35 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉండవచ్చు. ఇక గూడ్స్ బండిని నడిపే లోకో పైలట్ జీతం ప్రారంభంలో 40 వేల నుండి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. ప్యాసింజర్ల రైళ్లను నడిపే లోకో పైలట్ జీతం 66 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. సీనియారిటీ ప్రకారం ఆ జీతం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది. ఇక రాత్రి వేళల్లో పని చేస్తే నైట్ డ్యూటీ అలవెన్స్, ఎక్కువ కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తే కిలోమీటర్ లెక్క అలెవెన్సులు, ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి.
పదేళ్ల పాటు లోకో పైలట్ అనుభవం ఉంటే జీతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక సీనియర్ లెవెల్ కి చేరుకుంటే రెండు లక్షల రూపాయల జీతం అందుకునే అవకాశం ఉంది. లోకో పైలెట్ పరీక్ష రాసేందుకు పదో తరగతి పూర్తి చేయడంతో పాటు ఐటిఐ లేదా ఇంజనీరింగ్లో డిప్లొమో లేదా డిగ్రీ అవసరం ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే A 1 మెడికల్ ఫిట్నెస్ కూడా కలిగి ఉండాలి.