Governors salary: రాష్ట్ర గవర్నర్ అత్యున్నత ప్రభుత్వ పదవి. కేంద్రప్రభుత్వమే వారికి జీతాలను అందిస్తుంది. ఇక గవర్నర్లను నియమించేది మాత్రం రాష్ట్రపతి. అయితే గవర్నర్లకు నెలకు ఎంత జీతం ఇస్తారు? వారికి ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలు ఎలా ఉంటాయో తెలుసా?
రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవి గవర్నర్. వీరికి కేంద్ర ప్రభుత్వం భారీ వేతనం, విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తోంది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ నేపథ్యంలో వీరి జీతభత్యాలు, అధికారిక వసతుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువమందిలో ఉంటుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఒకే విధమైన వేతనం వర్తిస్తుంది. వీరికి నెలకు రూ.3,50,000 జీతం అందిస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వేతనంపై ఎటువంటి ఆదాయపు పన్ను వర్తించదు. పదవీ బాధ్యతలు సజావుగా నిర్వర్తించడానికి ప్రభుత్వం వీరికి వ్యక్తిగత ఖర్చుల భారం లేకుండా ప్రత్యేక అధికారిక ఏర్పాట్లు చేస్తుంది. అంటే వీరికి తమ జీతం నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
23
అన్నీ ఫ్రీ ఫ్రీ
గవర్నర్ హోదాకు తగ్గట్టుగా ప్రభుత్వం అత్యున్నత స్థాయి అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌ను ఉచితంగా కేటాయిస్తుంది. రాజ్‌భవన్ నిర్వహణ, విద్యుత్, ఇతర గృహ వినియోగ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రక్షణపరంగా వీరికి అత్యంత కట్టుదిట్టమైన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, అంగరక్షకులు ఉంటారు. అధికారిక పర్యటనల నిమిత్తం ప్రత్యేక వాహనాలు, డ్రైవర్లను సమకూరుస్తారు. విమాన, రైలు, రోడ్డు మార్గాల్లో సాగే అధికారిక ప్రయాణ ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచే వెచ్చిస్తారు. గవర్నర్‌తో పాటు కుటుంబ సభ్యులందరికీ పూర్తి ఉచిత అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయి. పరిపాలనా నిర్వహణ కోసం వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది వేతనాలు, సమాచార ఖర్చులు అన్నీ ప్రభుత్వ ఖాతా నుంచే చెల్లిస్తారు.
33
పెన్షన్ ఎంత ఇస్తారు?
రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా ఉండే గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. గవర్నర్‌ను రాష్ట్రపతి నేరుగా నియమిస్తారు. సాధారణంగా వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉన్నప్పటికీ, అది పూర్తిగా రాష్ట్రపతి ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. అవసరమైతే పదవీ కాలం పూర్తి కాకముందే మరొక రాష్ట్రానికి బదిలీ చేసే లేదా తొలగించే అధికారం కేంద్రానికి ఉంది. ఒక్కరే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఇన్చార్జిగా వ్యవహరించే వీలుంది. ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వెంటనే రాజ్‌భవన్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది.అయితే వీరికి ఎలాంటి పెన్షన్ అందించరు. కానీ జీవితాంతం మాజీ గవర్నర్లు, వారి జీవిత భాగస్వామికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (CGHS) లేదా సూచించిన నిబంధనల ప్రకారం ఉచిత వైద్య చికిత్స సదుపాయాలు లభిస్తాయి. సహాయంగా ఒక వ్యక్తిగత సహాయకుడిని నియమించుకోవడానికి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ రూపంలో నెలకు పాతిక వేల రూపాయల దాకా చెల్లిస్తుంది.