Crocodile Tears: దొంగ ఏడుపులు ఏడ్చే వారిని “మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు” అని అంటుంటారు. అయితే ఈ సామెత ఎందుకు వచ్చింది.? దీని వెనకాల ఏమైనా శాస్త్రీయ కారణం ఉందా.?లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యయుగాల్లో యూరప్ దేశాల్లో ఒక నమ్మకం ఉండేది. మొసలి తన ఆహారాన్ని తింటూ ఏడుస్తుందని వారు భావించేవారు. దాన్ని చూసిన ప్రజలు .. మొసలి తాను తింటున్న ఎరపై పశ్చాత్తాపంతో ఏడుస్తోంది అని అనుకున్నారు. ఆ అపోహే తర్వాత కథగా మారింది. కాలక్రమంలో అది సామెతగా స్థిరపడింది. అప్పటి నుంచి నకిలీ దుఃఖాన్ని “మొసలి కన్నీరు”గా పోల్చడం మొదలైంది.
25
మొసళ్లు నిజంగా ఏడుస్తాయా?
మొసళ్లు మనుషుల్లా భావోద్వేగంతో ఏడవవు. అయితే మొసలి కళ్ల నుంచి నీరు కారడం నిజమే. కానీ అది బాధ వల్ల కాదు. అది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. మొసలి ఎక్కువసేపు నోరు తెరిచి ఉండడం, ఎరను గట్టిగా నమలడం, దవడలు బిగించడం లాంటి సమయంలో కళ్ల వద్ద ఉన్న గ్రంథులపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ద్రవం బయటకు వస్తుంది. అది కన్నీళ్లలా కనిపిస్తుంది.
35
శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు.?
2006లో న్యూరాలజిస్ట్ డాక్టర్ మాల్కమ్ షానీర్, జంతుశాస్త్రవేత్త కెంట్ ఏ. విలేట్ కలిసి అమెరికన్ ఎలిగేటర్లపై పరిశోధనలు చేశారు. పొడి ప్రదేశంలో వాటికి ఆహారం ఇచ్చి పరిశీలించారు. తినే సమయంలో వాటి కళ్ల నుంచి ద్రవం రావడం గమనించారు. ఆ కన్నీళ్లు బాధ వల్ల రావడం కాదు. ఆహారం తినే సమయంలో సహజంగా కళ్ల గ్రంథులు పనిచేయడం వల్లే వస్తాయని వారి పరిశోధనలో తేలింది.
చాలామంది మొసలి, ఎలిగేటర్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ కొన్ని తేడాలు ఉంటాయి. మొసలి నోరు U ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. ఎలిగేటర్ నోరు V ఆకారంలో కొంచెం సన్నగా ఉంటుంది. రెండూ తినేటప్పుడు కళ్ల నుంచి ద్రవం విడుదల చేస్తాయి. ఆ ద్రవంలో ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇది కళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
55
ఇది భావోద్వేగం కాదు
మొసళ్ల కళ్లలో ప్రత్యేక గ్రంథులు ఉంటాయి. అవి కళ్లు ఎండిపోకుండా తేమను కాపాడుతాయి. దుమ్ము, ధూళి చేరకుండా రక్షిస్తాయి. అలాగే ఉప్పు సమతుల్యతను నియంత్రించే వ్యవస్థ కూడా వాటిలో ఉంటుంది. అదనపు ద్రవాన్ని బయటకు పంపడం వాటి శరీర అవసరం. అందువల్ల మొసలి కళ్ల నుంచి నీరు కారడం అంటే అది దుఃఖం కాదు. అది సహజ శరీర చర్య మాత్రమే.
మొత్తం మీద “మొసలి కన్నీరు” అనే సామెత ఒక పురాతన అపోహ నుంచి పుట్టింది. నిజానికి మొసలి మనుషుల్లా బాధతో ఏడవదు. కానీ శతాబ్దాలుగా వచ్చిన కథల కారణంగా.. నకిలీ దుఃఖాన్ని సూచించే మాటగా ఇది స్థిరపడిపోయింది.