మనం నిత్య జీవితంలో డబ్బు సంపాదించడమే పరమావధిగా భావిస్తాం. కోట్లు సంపాదిస్తే సకల సౌకర్యాలు లభిస్తాయని, జీవితం ఆనందంగా సాగిపోతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాత్రం ఈ విషయంపై తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ.. చురకలు వేశారు. సమాజంలోని ఒక కఠినమైన వాస్తవాన్ని ఎత్తిచూపారు. విపరీతంగా ఆస్తులు, కోట్లు సంపాదించే కొంతమంది కోటీశ్వరులు కనీసం రెండు పూటలా మనసారా తిండి కూడా తినలేని స్థితిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు.
ఒక్క చపాతికోసం 100 కోట్లా..
డబ్బు ఎంత ఉన్నప్పటికీ, ఆరోగ్యం సహకరించకపోతే ఆ సంపద వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. చాలామంది ధనవంతులు ఆరోగ్య సమస్యల కారణంగా (బీపీ, షుగర్ వంటివి) కడుపు నిండా నచ్చిన ఆహారాన్ని తినలేక, కేవలం ఒక్క చపాతి తింటూ ఉడకని జీవితాన్ని గడుపుతుంటారని, దాని కోసం 100 కోట్లు సంపాదించడం ఎందుకని కామెంట్ చేశారు. కోట్లు సంపాదించడం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, చివరకు ఆ డబ్బును అనుభవించే అదృష్టం కూడా కోల్పోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.