ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి గ్రామం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి వీరభద్రస్వామి ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంనాటి అద్భుత శిల్పకళకు నిదర్శనం. 16వ శతాబ్దంలో ఈ ఆలయ సముదాయం విశేషంగా అభివృద్ధి చెందింది. ఆలయంలోని శిల్పాలు, పైకప్పుపై చిత్రాలు, రాతి నిర్మాణాలు ఆనాటి కళాకారుల నైపుణ్యాన్ని చాటిచెబుతాయి.
ఈ ఆలయంలోని మండపంలో సుమారు 70 రాతి స్తంభాలు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా కనిపించేది ఈ వేలాడే స్తంభమే. మిగతా స్తంభాలు నేలపై ఆనుకుని ఉండగా, ఈ స్తంభం అడుగు భాగం మాత్రం పూర్తిగా నేలను తాకదు. స్తంభం కింద కనిపించే ఖాళీలోంచి కాగితం లేదా వస్త్రాన్ని ఒకవైపు నుంచి మరోవైపుకు దూర్చవచ్చు. ఈ ప్రత్యేకతే దీన్ని చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు.
అసలు విషయం ఏంటంటే...స్తంభం కొంత పక్కకు జరిగి ఉండటంతో ఒకవైపు నేలను తాకుతూ, మరోవైపు ఖాళీగా ఉంటుంది.