Smallest War: ప్రపంచంలో అతి తక్కువ సమయంలో ముగిసిపోయిన యుద్ధం గురించి తెలుసా? ఆ యుద్ధం ఏఏ దేశాల మధ్య జరిగిందో, అంత తక్కువ సమయంలో యుద్ధం ఎలా ముగిసిపోయిందో ఇక్కడ వివరించాము.
యుద్ధం అంటే రోజులు, నెలలు, కొన్నిసార్లు ఏళ్ల తరబడి సాగుతుందని అనుకుంటాం. కానీ చరిత్రలో ఓ యుద్ధం మాత్రం కేవలం 38 నిమిషాల్లోనే ముగిసింది. అదే బ్రిటన్, జాంజిబార్ మధ్య జరిగిన యుద్ధం. 1896 ఆగస్టు 27న జరిగిన ఈ పోరాటం ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయం సాగిన యుద్ధంగా గుర్తింపు పొందింది. జాంజిబార్ ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో భాగంగా ఉంది. అప్పట్లో అక్కడ సుల్తాన్ హమద్ బిన్ తువైనీ పాలించేవారు. ఆయన మరణించిన తర్వాత ఖలీద్ బిన్ బర్ఘష్ బ్రిటన్ అనుమతి లేకుండానే సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పటికే జాంజిబార్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్న బ్రిటన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దీంతో రెండు పక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి.
23
బ్రిటన్ హెచ్చరికను పట్టించుకోకపోవడంతో
ఖలీద్ సింహాసనం నుంచి దిగిపోవాలని బ్రిటన్ అధికారులు హెచ్చరించారు. ఇందుకోసం గడువు కూడా విధించారు. అయినా ఖలీద్ వెనక్కి తగ్గలేదు. తనకు మద్దతుగా ఉన్న సైనికులతో రాజభవనం చుట్టూ రక్షణ ఏర్పాటు చేశారు. 1896 ఆగస్టు 27న ఉదయం గడువు ముగిసిన తర్వాత బ్రిటిష్ నౌకాదళం దాడి ప్రారంభించింది. ఉదయం 9.02 గంటలకు మొదలైన బాంబుల దాడితో రాజభవనం తీవ్రంగా దెబ్బతింది. జాంజిబార్ సైనికులు బ్రిటన్ ఆధునిక ఆయుధాలను ఎదుర్కోలేకపోయారు. రాజభవనం మంటల్లో చిక్కుకుంది. చివరకు ఉదయం 9.40 గంటలకు జాంజిబార్ సైనికులు తెల్లజెండా ఎగురవేసి లొంగిపోయారు. దీంతో కేవలం 38 నిమిషాల్లోనే యుద్ధం ముగిసింది.
33
500 మందికి పైగా ప్రాణనష్టం..
ఈ యుద్ధంలో జాంజిబార్‌కు చెందిన సైనికులు, పౌరులు కలిపి సుమారు 500 మంది మరణించినట్లు లేదా గాయపడినట్లు చారిత్రక నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్ తరఫున ఒక నావికుడు గాయపడ్డాడు. యుద్ధం మొదలైన కొద్దిసేపటికే ఖలీద్ రాజభవనం నుంచి తప్పించుకుని జర్మనీ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందారు. ఆ తర్వాత ఆయన జాంజిబార్‌ను విడిచిపెట్టారు. బ్రిటన్ మద్దతున్న హమూద్ బిన్ మహమ్మద్‌ను కొత్త సుల్తాన్‌గా నియమించారు. ఈ యుద్ధం కేవలం 38 నిమిషాలే సాగినా, జాంజిబార్‌పై బ్రిటన్ ఆధిపత్యం మరింత బలపడింది. ఆధునిక ఆయుధాలు, సైనిక బలం మధ్య ఉన్న తేడా ఒక చిన్న రాజ్యంపై ఎంతటి ప్రభావం చూపగలదో ఈ సంఘటన చరిత్రలో గుర్తుండిపోయింది.