Biggest Prison: ప్రతిదేశంలో జైళ్లు ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద జైలు ఏదో తెలుసా? అక్కడ ఎంతమంది ఖైదీలు ఉంటారు? ఆ జైల్లో ఉండే రూల్స్ ఏమిటి? వంటి ఆసక్తికరమైన సమాచారాన్ని ఇక్కడ అందించాము. చదివేయండి.
ప్రపంచంలో నేరాలు చేసే వారిని బంధించేందుకు ఎన్నో జైళ్లు ఉన్నాయి. కానీ ఒక జైలులో ఏకంగా 40 వేల మంది ఖైదీలను ఉంచే సదుపాయం ఉందంటే నమ్ముతారా? అంతేకాదు.. అక్కడ ఖైదీలకు స్వేచ్ఛ అనేది దాదాపు ఉండదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, బయట ప్రపంచాన్ని చూడటం కూడా అంత సులభం కాదు. ఇంతకీ ఈ జైలు ఎక్కడుంది? అక్కడ ఖైదీలకు ఎలాంటి శిక్షలు, నిబంధనలు ఉంటాయి? ఈ జైలు పేరు CECOT. ఇది మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్ దేశంలో ఉంది. టెకోలుకా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. 2023 జనవరి 31న ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ఈ జైలును ప్రారంభించారు. దేశంలో పెరిగిపోతున్న గ్యాంగ్స్టర్ల ఆగడాలను అరికట్టేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా MS-13, బారియో 18 వంటి ప్రమాదకర నేర ముఠాలకు చెందిన వారిని ఇక్కడ బంధిస్తున్నారు.
23
ఖైదీలకు ఉండే కఠిన నియమాలు
ఈ జైలులో ఒకేసారి 40 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. ఇక్కడి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఖైదీలు రోజులో దాదాపు 23 గంటల 30 నిమిషాలు తమ గదుల్లోనే ఉండాలి. బయటకు వెళ్లేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు. గదుల్లో ఇనుప మంచాలు ఉన్నా వాటిపై పరుపులు, దిండ్లు ఉండవు. ఫ్యాన్లు, ఏసీలు కూడా ఉండవు. కుటుంబ సభ్యులను కలుసుకోవడం, వారితో ఫోన్లో మాట్లాడటం చాలా కష్టం. ఖైదీల ప్రతి కదలికపై నిఘా ఉంటుంది. జైలు గదుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. కోర్టు విచారణలకు కూడా ఖైదీలను నేరుగా తీసుకెళ్లకుండా వీడియో కాల్స్ ద్వారా హాజరుపరుస్తారు. దీంతో బయట ప్రపంచంతో వారి సంబంధాలు పూర్తిగా తగ్గిపోతాయి.
33
భారీ భద్రత
ఈ జైలులో భద్రతకు పెద్దపీట వేశారు. చుట్టూ భారీ కాంక్రీట్ గోడలు, విద్యుత్ కంచెలు ఏర్పాటు చేశారు. ఖైదీలు పారిపోకుండా 19 నిఘా టవర్లు నిర్మించారు. వందల మంది పోలీసులు, సైనికులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడి భద్రతా ఏర్పాట్లు చూస్తే సినిమా జైళ్లు కూడా చిన్నవిగా అనిపిస్తాయి. నేర ముఠాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎల్ సాల్వడార్ ప్రభుత్వం ఈ జైలును కీలక కేంద్రంగా మార్చింది. అయితే ఇక్కడ ఖైదీల హక్కులు, వారికి అందుతున్న సౌకర్యాలపై అంతర్జాతీయంగా విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే CECOT జైలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.