ఇప్ప‌టి వాళ్లు నిజంగానే 1980లోకి వెళ్తే.. ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఈ మార్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Published : Sep 13, 2026, 06:00 PM IST

1980s Trend: ప్ర‌స్తుతం 1980 ట్రెండ్ న‌డుస్తోంది. 46 ఏళ్ల క్రితం ట్రెండ్‌లో త‌మ‌ను తాము చూసుకుంటూ మురిసిపోతున్నారు. అయితే ఒక‌వేళ ప్ర‌స్తుతం ఉన్న వ్య‌క్తి ముఖ్యంగా గ‌త 20 ఏళ్ల‌లో జ‌న్మించిన వ్య‌క్తి నిజంగానే 80ల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది.?

PREV
16
1980ల్లోకి వెళ్తే.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 1980 ట్రెండ్ కనిపిస్తోంది. చాలామంది తమ ఫొటోలను ఏఐ సాయంతో 1980 నాటి లుక్‌లోకి మార్చుకుని అప్పటి కాలంలో తాము ఎలా కనిపిస్తామో చూసుకుంటున్నారు. పాత కాలం దుస్తులు, ఇళ్లు, వాహనాలు, సినిమా పోస్టర్లు ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక్కసారి ఊహించండి.. ఇప్పుడున్న ఒక వ్యక్తి నిజంగానే 1980లోకి వెళ్లిపోతే ఎలా ఉంటుంది? చుట్టూ ఉన్న ప్రపంచం అతడికి పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. ఆ ముఖ్య‌మైన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

26
1980లో ఫోన్ అంటే కేవ‌లం మాట్లాడే సాధనం మాత్ర‌మే

1980లో ఫోన్ ఉన్న ఇల్లు అంటే అదొక సౌకర్యంగా భావించే రోజులు. అందరికీ మొబైల్ ఫోన్లు ఉండేవి కాదు. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇంట్లో ఉన్న ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నుంచి కాల్ చేయాలి. దూర ప్రాంతాల్లో ఉన్నవారితో మాట్లాడటం కూడా అంత సులభం కాదు. అత్యవసర సమాచారం చెప్పాలంటే ఫోన్‌తో పాటు లేఖలు, టెలిగ్రామ్ వంటి మార్గాలపై ఆధారపడాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక చిన్న స్మార్ట్‌ఫోన్‌లోనే ఫోన్, కెమెరా, టీవీ, పుస్తకాలు, మ్యాప్, బ్యాంకు, షాపింగ్ ఇలా ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. వీడియో కాలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్న వారితోనైనా ముఖాముఖిగా మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఫోన్ కోసం ఇంట్లో ఒక గది లేదా టేబుల్ అవసరమైతే.. ఇప్పుడు ప్రపంచమే మన చేతిలోకి వచ్చేసింది.

36
సినిమా చూడాలంటే థియేటర్.. ఇప్పుడు ఓటీటీనే ఇంట్లో థియేటర్

1980లో కొత్త సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. సినిమా విడుదలైన తర్వాత టికెట్ కోసం క్యూలో నిలబడటం, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎదురుచూడటం అప్పటి అనుభవంలో భాగం. ఇంట్లో సినిమాలు చూడటానికి టీవీ ఉన్నా.. నేటిలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సినిమా పడితే అది చూసే అవకాశం ఉండేది కాదు.

ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇంట్లో కూర్చుని స్మార్ట్ టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నాము. నచ్చిన సమయంలో వీడియోను ఆపుతున్నాం, మళ్లీ చూస్తున్నాం. 1980 వ్యక్తి నేటి కాలంలోకి వచ్చి ఒకే మొబైల్‌లో వందల సినిమాలు, సిరీస్‌లు కనిపిస్తే.. అది అతడికి మ్యాజిక్‌లాగే అనిపించవచ్చు.

46
అప్పుడు కేవ‌లం న‌గ‌దు మాత్ర‌మే

1980లో కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బు చెల్లించాలంటే నగదు ప్రధాన మార్గం. బ్యాంకు లావాదేవీల కోసం కూడా ప్రజలు బ్యాంకుకే వెళ్లాల్సి వచ్చేది. చెక్కులు, పాస్‌బుక్‌లు వంటి వాటి వినియోగం ఉండేది. డబ్బు పంపాలన్నా, తీసుకోవాలన్నా ఇప్పటితో పోలిస్తే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కూరగాయలు కొనే దగ్గర నుంచి పెద్ద షాపింగ్ వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో డబ్బు చెల్లిస్తున్నాం. నగదు జేబులో లేకపోయినా ఫోన్‌లోని యూపీఐ యాప్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నాము. 1980 నుంచి వచ్చిన మార్పుల్లో ఇది చాలా పెద్ద మార్పు. అప్పట్లో డబ్బు కోసం బ్యాంకు లేదా పర్సు అవసరమైతే.. ఇప్పుడు కొన్ని సెకన్లలో ఫోన్ నుంచే లావాదేవీ పూర్తవుతోంది.

56
అడ్ర‌స్ కోసం తంటాలు

1980లో కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే అక్కడి వ్యక్తులను అడిగి దారి తెలుసుకోవాల్సి వచ్చేది. ప్రయాణానికి ముందు మ్యాప్ లేదా ఇతర వివరాలు తెలుసుకుని బయలుదేరేవారు. రోడ్డు మధ్యలో దారి తప్పితే మళ్లీ ఎవరో ఒకరిని అడగాల్సిందే. కానీ నేటి ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్, జీపీఎస్, మ్యాప్స్ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎక్కడికి వెళ్లాలో ఫోన్‌లో టైప్ చేస్తే మార్గం చూపిస్తుంది. ట్రాఫిక్ పరిస్థితి, ప్రయాణ సమయం, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. ఒకప్పుడు మనుషులు దారి చూపిస్తే.. ఇప్పుడు ఫోన్ మనకు దారి చూపిస్తోంది. ఇదే మార్పు సమాచార విషయంలోనూ కనిపిస్తుంది. 1980లో ఏదైనా విషయం తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి, తెలిసినవారిని అడగాలి లేదా లైబ్రరీకి వెళ్లాలి. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా ఇంటర్నెట్‌లో కొన్ని సెకన్లలో సమాధానం వెతుక్కోవచ్చు.

66
1980లో నెమ్మదిగా ఉన్న జీవితం.. ఇప్పుడు వేగంగా మారుతున్న ప్రపంచం

1980తో పోలిస్తే నేటి జీవితంలో సౌకర్యాలు ఎన్నో రెట్లు పెరిగాయి. షాపింగ్ కోసం తప్పనిసరిగా మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే వస్తువులు ఆర్డర్ చేస్తున్నాం. వార్తల కోసం మరుసటి రోజు పేపర్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్, లైవ్ టీవీ ఛాన‌ల్స్‌, వెబ్‌సైట్ల‌ ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకుంటున్నాము.

అయితే ఈ మార్పులతో పాటు జీవనశైలిలోనూ పెద్ద మార్పు వచ్చింది. అప్పటి జీవితం నెమ్మదిగా సాగేది. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఎక్కువ సమయం ఉండేది. పొరుగువారితో పరిచయాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ మన పనులను సులభం చేసినా.. అదే సమయంలో మన జీవిత వేగాన్ని కూడా పెంచింది. అప్పుడు బ‌య‌టి ఫుడ్ తినాలంటే హోట‌ల్‌కి వెళ్లాల్సిందే. కానీ ప్ర‌స్తుతం ఫోన్‌లో ఆర్డ‌ర్ పెడితే ఇంటివి వ‌చ్చేస్తున్నాయి.

అందుకే 1980 నుంచి 2026 వరకు వచ్చిన మార్పులను చూస్తే ఇది కేవలం ఫోన్లు, ఇంటర్నెట్, యూపీఐ, ఓటీటీల మార్పు మాత్రమే కాదు. మనిషి జీవించే విధానమే మారిపోయింది. 1980 నుంచి నేటి కాలంలోకి వచ్చిన ఒక వ్యక్తికి స్మార్ట్‌ఫోన్ కంటే ముందు ఆశ్చర్యం కలిగించేది.. ఈ ప్రపంచం ఇంత వేగంగా ఎలా మారిపోయిందనే విషయం కావచ్చు. ఒకప్పుడు భవిష్యత్తుగా ఊహించిన ఎన్నో విషయాలు ఇప్పుడు మన రోజువారీ జీవితంలో సాధారణంగా మారిపోయాయి.

Read more Photos on
click me!

Recommended Stories