PIB Fact Check : కేంద్ర ప్రభుత్వం మరోసారి నోట్ల రద్దుకు సిద్దమయ్యిందా..? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500 నోట్ల చెలామణిని నిలిపివేస్తుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఇదిగో…
500 Currency Note Ban : కరెన్సీ నోట్ల రద్దు (Demonetization)... మోదీ సర్కార్ 2016 లో తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు, డబ్బులు లేక ప్రజలు పడిన ఇబ్బందులు... పీడకలలాంటి ఆరోజులు ఇప్పటికీ ప్రజలెవ్వరూ మర్చిపోలేకపోతున్నారు. అలాంటిది సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ నోట్ల రద్దుపై జరుగుతున్న ప్రచారం ప్రజలను కంగారుపెడుతోంది. మరి ఆ ప్రచారమేంటి? అందులో నిజమెంత? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
24
రూ. 500 నోట్లు రద్దు..?
గతంలో భారత ప్రభుత్వం పెద్దనోట్లను (రూ.500, రూ.1000) రద్దు చేసిన విషయం తెలిసింది. ఆ తర్వాత కొత్త రూ.500 నోట్లతో పాటు రూ.2000 నోట్లను కూడా చెలామణిలోకి తీసుకువచ్చింది. కానీ 2023 లో రూ.2000 నోట్లను కూడా చెలామణి నుండి ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు పెద్ద నోటు అంటే అత్యధిక విలువ కలిగిన కరెన్సీ 500 రూపాయలు. తాజాగా దీన్ని కూడా చెలామణి నుండి ఉపసంహరించుకునేందుకు ఆర్బిఐ ప్రయత్నిస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఆరంభం నాటికి రూ.500 నోట్లను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించిందని... ఈ దిశగా ఆర్బిఐ చర్యలు కూడా తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. 2026 మార్చి నాటికి ఏటిఎంలలో రూ.500 నోట్లను పూర్తిగా నిలిపివేయాలని... బ్యాంకులు కూడా వీటిని ప్రజలకు ఇవ్వకూడదని ఆర్బిఐ ఆదేశించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తంగా రూ.500 నోట్ల చెలామణిని పూర్తిగా నిలిపివేయాలని దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించిందనేది సోషల్ మీడియా ప్రచార సారాంశం.
34
రూ.500 నోట్ల రద్దుపై ఆర్బిఐ క్లారిటీ...
మరోసారి పెద్దనోట్ల రద్దు జరుగుతుందని... రూ.500 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటారన్న సోషల్ మీడియా ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ ఖండించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIB) ఎక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
''కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 మార్చి నాటికి రూ.500 నోట్లను చెలామని నుండి తొలగించనున్నట్లు ఓ ప్రచారం సర్క్యులేట్ అవుతోంది. ఇది తప్పుడు ప్రచారం. ఆర్బిఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదు. కాబట్టి రూ.500 నోటు చట్టబద్దంగా చలామణిలో ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలి... ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇతరులకు షేర్ చేయకూడదు'' అంటూ పిఐబి ట్వీట్ చేసింది.
2016 నోట్ల రద్దు తర్వాత తరచూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నోట్ల రద్దు అంటూ జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే ప్రతిసారి ఆర్బిఐ, కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలేమీ లేవని క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. గతేడాది కూడా ఇలాగే రూ.500 నోట్ల రద్దు అంటూ ప్రచారం జరగ్గా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు.
''కేంద్ర ప్రభుత్వానికి రూ.500 నోట్లను రద్దుచేసే ఉద్దేశం లేదు... ఆర్థిక శాఖ వద్ద అలాంటి ప్రతిపానదలు ఏవీ లేవు. రూ.100, రూ.200 నోట్ల మాదిరిగానే రూ.500 నోట్లు కూడా చెలామణిలో ఉంటాయి. బ్యాంకు ఏటిఎంలలో కూడా వీటిని పొందవచ్చు... ఈ విషయంలో ఎలాంటి అనుమానం వద్దు'' అని రాజ్యసభలో ప్రకటించారు మంత్రి పంకజ్ చౌదరి.