Fact Check : వీడెవడండీ బాబు.. పెద్దపులిని పిల్లిలా పట్టుకుని మందు తాగిస్తున్నాడు..! ఈ వైరల్ వీడియో నిజమేనా?

Published : Oct 30, 2025, 03:21 PM IST

Fact Check : మద్యంమత్తులో ఓ వ్యక్తి పెద్దపులిని పెంపుడు జంతువులా పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో నిజమేనా లేక AI సృష్టా అన్నది తెలుసుకుందాం. 

PREV
15
వైరల్ వీడియో నిజమేనా?

VIral Video : తాగితే పిల్లిలా ఉండే మగాడుకూడా పులిలా మారతాడని అంటుంటారు... కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న మందుబాబు పులిని కూడా పిల్లిలా మార్చేశాడు. రోడ్డుపై పులి కనిపించగానే భయంతో పరుగెత్తకుండా తాపీగా దాని దగ్గరికి వెళ్లి అదేదో తన పెంపుడు జంతువు అన్నట్లుగా తలనిమిరుతున్నాడు. అంతటితో ఆగకుండా పులితో మందు తాగించే ప్రయత్నం చేశాడు. ఇలా మద్యంమత్తులో ఓ వ్యక్తి పులితోనే ఆటాడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.

25
పులితోనే మందు తాగించే ప్రయత్నం...

ఈ ఘటన ఇండియాలోనే జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర విధర్భ ప్రాంతంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఓ తాగుబోతు పులితో ఉన్నట్లు పేర్కొంటూ వీడియో బయటకు వచ్చింది. పులితో మందు తాగించేందుకు తాగుబోతు ప్రయత్నిస్తున్న తీరు సరదాగా ఉంది... దీంతో ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చింది. అయితే ఈ ఆశ్చర్యకరమైన సంఘటన నిజమేనా? నిజంగానే తాగిన మైకంలో అతడు పులివద్దకు వెళ్లాడా? తల నిమురుతూ మద్యం తాగించే ప్రయత్నం చేసినా పులి అతడిని ఏమీ చేయలేదా?… ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరికి వచ్చే అనుమానాలివే. కాబట్టి ఈ వైరల్ వీడియోను మరింత వివరంగా పరిశీలిద్దాం.

35
పులితో తాగుబోతు వీడియో వైరల్

ఈ నెల (అక్టోబర్ 4న) ఆరంభంలో జరిగినట్లుగా ఆరు సెకన్ల నిడివిగల ఈ పులి, తాగుబోతు వీడియోను వెరిఫైడ్ ప్రొఫైల్స్‌తో సహా ఎక్స్ (X) లో చాలామంది పంచుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఓ టైగర్ రిజర్వ్ సమీపంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

‘52 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి మద్యంమత్తులో ఉండగా రోడ్డుపై పెద్దపులి కనిపించింది. దారితప్పి అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చిన ఆ పులికి భయపడి స్థానికులందరూ ఇళ్లలోకి వెళ్లిపోయారు.. కానీ రాజు మాత్రం ఎలాంటి భయం లేకుండా దాని దగ్గరకు వెళ్లాడు. పెంపుడు జంతువు మాదిరిగా తన చేతిలో దాని తలపై నిమురుతూ మద్యాన్ని తాగించాలని చూశాడు. ఇలా రాజు పులివద్దే 5-10 నిమిషాలు ఉన్నాడు. అయితే పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకోవడంతో అది తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. పులి వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు, ఈ సంఘటనతో రాజు పటేల్ స్థానిక హీరోగా మారిపోయాడు’ అంటూ కొందరు ఎక్స్ (X) లో పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది.

45
పులితో తాగుబోతు వీడియో నిజమేనా?

మహారాష్ట్ర పెంచ్ టైగర్ రిజర్వ్‌లో గానీ, దాని పరిసరాల్లో గానీ ఇలాంటి అసాధారణ సంఘటన జరిగినట్టు నిర్ధారించే వార్తలు లేదా ప్రకటనలు కీవర్డ్ సెర్చ్‌లో దొరకలేదు. అలాగే పెంచ్ టైగర్ రిజర్వ్ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో కూడా ఈ సంఘటనను ధృవీకరించే ఎలాంటి సూచనలు లేవు... అటవీ అధికారులు కూడా ఈ ఘటనను ధృవీకరించలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో ఏఐ (AI) సృష్టించిందేమో అనే అనుమానం కలుగుతోంది.

టైగర్ తో తాగుబోతు వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని పొంతన లేని, అసహజమైన విషయాలు కనిపించాయి. పులిని నిమురుతున్న వ్యక్తి ప్యాంటుపై అసహజమైన ముడతలు ఉన్నాయి. దీంతో ఏఐ (AI) వీడియో డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి ఈ దృశ్యాలను పరిశీలించగా పులిని నిమురుతూ మద్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఉన్న ఈ వీడియో ఏఐ (AI) సృష్టి అని తేలింది.  

55
ఫ్యాక్ట్ చెక్

52 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి పులిని నిమురుతూ మద్యం ఇస్తున్న వీడియోను ఏఐ (AI) టూల్స్ ఉపయోగించి సృష్టించారు. ఈ వీడియో, సంఘటన నిజం కాదని నిజ నిర్ధారణలో స్పష్టమైంది.

Read more Photos on
click me!

Recommended Stories