
ఉదయ్ కిరణ్.. లవర్ బాయ్ అనే పదానికి మారుపేరు. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి మెప్పించాడు. హిట్లు అందుకున్నాడు. వేగంగా స్టార్ హీరో అయిపోయాడు. ఆయన హీరోగా పరిచయం అయిన రెండేళ్లలోనే టాలీవుడ్‌లోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఎవరికీ లేని క్రేజ్ ఆయనకు సొంతమైంది. అమ్మాయిల ఫాలోయింగ్ అయితే ఊహించడం కష్టమే. ఎంత వేగంగా ఎదిగాడో, అలానే డౌన్ అయ్యాడు. చాలా రోజులు సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యాడు. కానీ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ఒక్క మూవీ రిలీజ్ అయితే ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్య ఉండేవాడట.
ఉదయ్ కిరణ్ కెరీర్‌లో చాలా ఆటుపోట్లు చూశాడు. కానీ తట్టుకోలేకపోయాడనేది ఆయన గురించి తెలిసినవాళ్లు చెప్పే మాట. ఎందుకంటే ఆయన నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయట. ప్రారంభంలో ఓకే చెప్పి మధ్యలోనే ఆపేసేవారట. కొన్ని ప్రారంభోత్సవం చేసి ఆగిపోవడం, మరికొన్ని స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు ఓ మూవీ అయితే ఏకంగా ఎనభై శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత పక్కన పెట్టారట. దీని వెనుక కొందరి హస్తం ఉందని అంటుంటారు.
కానీ ఈ మూవీ షూటింగ్ పూర్తయి రిలీజ్ అయితే మాత్రం పెద్ద హిట్ అయ్యేదని, ఇప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవారని చెప్పారు మ్యూజిక్ జోస్యభట్ల. ఉదయ్ కిరణ్ నటించిన `ప్రేమంటే సులువు కాదురా` సినిమా 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని చివరి దశలో ఆగిపోయింది. ఈ మూవీ పూర్తి అయి విడుదలైతే ఉదయ్ కి పెద్ద హిట్ అయ్యేదని, ఆ దెబ్బతో సూపర్ స్టార్‌గా ఎదిగేవాడని మ్యూజిక్ డైరెక్టర్ జోస్యభట్ల వెల్లడించారు. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు తెలియదన్నారు. కానీ ఏదో జరిగిందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత. అంతటి పెద్ద నిర్మాత ఈ మూవీని ఎందుకు ఆపేశారో అర్థం కాలేదన్నారు.
ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతికృష్ణ కూడా మధ్యలో ఆ మూవీని పూర్తి చేయాలని ప్రయత్నించారట. కానీ సాధ్యం కాలేదని, ఏం జరిగిందో తెలియదన్నారు. జనసేనకి పాటని చేసినప్పుడు జ్యోతి కృష్ణ కలిశాడని, ఆ టైమ్‌లో ఈ ప్రస్తావన వచ్చిందన్నారు. నిర్మాత ఏఎం రత్నం కూడా అనేవారట. ఈ మూవీతో ఉదయ్ కిరణ్‌కి మంచి లైఫ్ వస్తుందని. కానీ ఏదో జరిగింది, ఉదయ్ కిరణ్ కి లైఫ్‌ని తలక్రిందులు చేసిందని జోస్యభట్ల వెల్లడించారు. ఏం జరిగిందో ఏమో గానీ, `ప్రేమంటే సులువు కాదురా` మూవీ విడుదలై, పెద్ద హిట్ అయితే మాత్రం ఇప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవాడు. ఆయన సినిమాలను మనం ఎంజాయ్ చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ హీరోగా రాణించేవారని జోస్యభట్ల తెలిపారు.
ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్‌కి చివర్లో ఒక కోరిక ఉండేది. పవన్ కళ్యాణ్ నటించిన `అత్తారింటికి దారేదీ` మూవీ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని చూసి ఇలాంటి మంచి ఫ్యామిలీ మూవీ చేయాలని ఉండేదట. ఈ విషయాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్యకి చెప్పారట. అలాంటి కథలు చూడమని, తాను చేస్తానని తెలిపారట. కానీ కొన్నాళ్లకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సెప్టెంబర్ 27న `అత్తారింటికి దారేదీ` మూవీ రిలీజ్ అయితే, 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ్ కిరణ్.. చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లోకి రావాలనుకున్నారు. `చిత్రం` మూవీతో అవకాశాన్ని దక్కించుకున్నాడు. `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`, `కలుసుకోవాలని` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత `శ్రీరామ్`, `హోలీ`, `నీ స్నేహం`, `నీకు నేను నాకు నువ్వు`, `లవ్ టుడే`, `ఔనన్నా కాదన్నా`, `వియ్యాల వారి కయ్యాలు`, `గుండె ఝల్లుమంది`, `ఏకలవ్యుడు`, `నువ్వెక్కడుంటే నేనక్కడుంటా`, `జై శ్రీరామ్` వంటి చిత్రాల్లో నటించాడు. చివర్లో `చిత్రం చెప్పిన కథ` మూవీ రిలీజ్ కావాల్సింది. ఆయన చనిపోవడంతో ఆగిపోయింది.